నేతన్నలకు ఆరోగ్య కార్డు

జాతీయ చేనేత దినోత్సవాన్ని (ఈనెల 7న)  పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగ సమగ్రాభివృద్ధి, నేతన్నల సంక్షేమ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది.

Published : 06 Aug 2023 04:58 IST

10,652 మగ్గాల నవీకరణ
చేనేత సంఘాలకు డీసీసీబీల నుంచి రుణాలు
ఉప్పల్‌లో చేనేత మ్యూజియం
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వరాల జల్లు

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ చేనేత దినోత్సవాన్ని (ఈనెల 7న)  పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగ సమగ్రాభివృద్ధి, నేతన్నల సంక్షేమ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. మగ్గాల నవీకరణ, నేతన్నలకు ఆరోగ్యకార్డు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా ఏటా రూ.95 కోట్ల రుణం, చేనేత మ్యూజియం, కన్వెన్షన్‌ సెంటర్‌  వంటివి ఇందులో ఉన్నాయి. చేనేత, జౌళిశాఖల మంత్రి కేటీఆర్‌ ఈ నెల 7న వీటిని అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్రంలో చేనేత సమస్యలపై అధ్యయనం అనంతరం అధికారులతో కేటీఆర్‌ సమావేశమై తొమ్మిది అంశాలపై ప్రతిపాదనలు రూపొందించారు. వాటికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదముద్ర వేశారు.

వివరాలు ఇలా...

  • చేనేత కార్మికులకు, చేనేత వృత్తి పనిచేస్తున్నవారికి నేత్ర, ఎముకలు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటికి ఆరోగ్యకార్డు ద్వారా చికిత్స అందిస్తారు. ప్రతి కుటుంబానికి ఏటా రూ.25 వేల పరిమితి మేరకు వైద్యసేవలు అందుతాయి.
  • చేనేత కార్మికులకు పనిభారం, అనారోగ్య సమస్యలను నివారించేందుకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 10,652 గుంట మగ్గాల స్థానంలో నవీకరించిన ఫ్రేమ్‌ మగ్గాలను స్థాపించనున్నారు. ఒక్కో ఫ్రేమ్‌ మగ్గం ఏర్పాటుకు రూ.38వేల చొప్పున ఈ పథకానికి రూ.40.50 కోట్లను కేటాయించనుంది.
  • రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలు తమ వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీలుగా డీసీసీబీలు క్యాష్‌ క్రెడిట్‌ను (నగదు రుణ పరపతిని) అమలు చేయనున్నాయి. దీన్ని వర్కింగ్‌ క్యాపిటల్‌గా ఉపయోగించుకొని సంఘాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తాయి.
  • దేశంలో తొలిసారిగా చేనేత మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. ఉప్పల్‌లోని శిల్పారామం వద్ద 500 గజాల స్థలాన్ని కేటాయించారు. ఈ నెల 7న కేటీఆర్‌ దీనికి శంకుస్థాపన చేస్తారు.
  • చేనేత వస్త్రాల వ్యాపార నిర్వహణ, క్రయవిక్రయదారుల సమావేశాలు, సదస్సుల నిర్వహణ కోసం చేనేత కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మిస్తారు. ఉప్పల్‌ భగాయత్‌లో 2,375 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.
  • చేనేత కార్మికులు చనిపోయిన సమయంలో టెస్కో ద్వారా అందించే పరిహారాన్ని రూ.12,500 నుంచి రూ.25 వేలకు పెంపుదల.
  • చేనేత మిత్ర పథకం కింద కార్మికులకు నూలు, రంగులు, రసాయనాలకు 40% మేర  రాయితీని అందిస్తోంది. దీని కింద నమోదు ఇబ్బందికరంగా ఉందని కార్మికులు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తేవడంతో మార్పులు చేశారు. ఇకపై జియో ట్యాగ్‌ గల చేనేత మగ్గాలపై పనిచేసే  కార్మికులకు నెలకు రూ.3,000(చేనేత కార్మికునికి  రూ.2,000, అనుబంధ కార్మికులకు రూ.1,000) చొప్పున వారి ఖాతాల్లో నేరుగా బదిలీ చేయాలని నిర్ణయించారు.
  • గత ఆగస్టు నుంచి 59 సంవత్సరాల లోపు వయసున్న వారికి నేతన్న బీమా పథకం అమలవుతుండగా ఇకపై 60 నుంచి 75 సంవత్సరాల వయసు గల వారికీ వర్తింపజేయనున్నారు.
  • పోచంపల్లిలో మూతపడిన చేనేత పార్కును బ్యాంకులు వేలం వేయగా టెస్కో ద్వారా ప్రభుత్వం కొన్నది. దీనిని దేశంలోనే అతిపెద్ద చేనేత పార్కుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది.
  • చేనేత సంఘాలపై రుణభారం తగ్గించేందుకు పావలా వడ్డీ పథకం కింద 2022-23 సంవత్సరానికి రూ.2.13 కోట్ల విడుదల.
  • నేతన్నకు చేయూత పథకం కింద కార్మికులు 8% వేతనాలను జమ చేస్తే ప్రభుత్వం దానికి 16 శాతాన్ని వారిపేరిట జమ చేస్తోంది. ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

చేనేత వారోత్సవాలు ఘనంగా నిర్వహిద్దాం: కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7 నుంచి 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. మీ పరిధిలో ఉన్న నేతన్నలతో కలిసి సంబరాల్లో పాల్గొని, వారితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. ‘‘హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో చేనేత వస్త్ర ఉత్పత్తుల ప్రదర్శన కొనసాగుతుంది. బీఎంఆర్‌ సార్థ ఫంక్షన్‌ హాల్‌ 7,500 మంది నేతన్నలతో రాష్ట్రస్థాయి చేనేతల సంబరాలు నిర్వహిస్తాం’’ అని కేటీఆర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని