Hyderabad - AI Jobs: కొత్తగా 1.5 లక్షల ఏఐ ఆధారిత ఉద్యోగాలు

రాష్ట్రంలో 2025 నాటికి కొత్తగా 1.5 లక్షల కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఉద్యోగాలు వచ్చే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

Updated : 18 Aug 2023 07:51 IST

2025 నాటికి తెలంగాణలో వచ్చే అవకాశాలు
ఏఐ మిషన్‌, నాస్కామ్‌ ‘కృత్రిమ మేధలో తెలంగాణ’ నివేదికలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2025 నాటికి కొత్తగా 1.5 లక్షల కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఉద్యోగాలు వచ్చే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భవిష్యత్తు టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశముందని, ఆ మేరకు మానవ వనరుల్ని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. విద్యార్థులకు ఏఐ, డీప్‌ లెర్నింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌(ఎంఎల్‌) తదితర రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టామని, లక్ష మంది విద్యార్థులకు ఏఐ నైపుణ్యాలను ఇచ్చే లక్ష్యం పెట్టుకున్నట్లు పేర్కొంది. కార్పొరేట్‌ సంస్థలు వివిధ మార్గాల ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన నిపుణులను సిద్ధం చేయాలని తెలిపింది. తెలంగాణ ఏఐ మిషన్‌ ద్వారా 142 ఏఐ స్టార్టప్‌లకు సహాయం అందిస్తున్నట్లు వివరించింది. తెలంగాణ ఏఐ మిషన్‌, నాస్కామ్‌ సంయుక్తంగా ‘కృత్రిమ మేధలో తెలంగాణ’ నివేదికను విడుదల చేసింది. ఇప్పటివరకు తెలంగాణలోని స్టార్టప్‌లు 54 ఒప్పందాల ద్వారా రూ.4,300 కోట్ల నిధులు సమీకరించాయని పేర్కొంది.

నివేదికలోని ముఖ్యాంశాలు

  • భవిష్యత్తు టెక్నాలజీ, ఏఐలో తెలంగాణ అంతర్జాతీయ కేంద్రంగా మారుతోంది. ఏఐ ఆధారిత టెక్నాలజీల్లో నాణ్యమైన పరిశోధనలు కంప్యూటర్‌ విజన్‌, ఎంఎల్‌, రోబోటిక్స్‌ రంగాల్లో రాష్ట్రానికి బలమైన పునాదులుగా మారుతున్నాయి. ఇప్పటికే పలు విద్యాలయాలు సంబంధిత డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టాయి.
  • దేశంలో 89 శాతం ఏఐ పరిశోధనలు యూనివర్సిటీల్లో జరుగుతున్నాయి. తెలంగాణలోని ఆరు విశ్వవిద్యాలయాలు పరిశోధనల పరంగా ప్రపంచవ్యాప్తంగా వెయ్యిలోపు ర్యాంకులు సాధించాయి. ఇందులో ఐఐఐటీ, ఐఐటీ హైదరాబాద్‌, ఎన్‌ఐటీ వరంగల్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, ఓయూ, జేఎన్‌టీయూ ఉన్నాయి.
  • 2011 నుంచి 2022 వరకు ఏఐలో 1,774 పరిశోధన పత్రాలు వెలువడితే ఐఐఐటీ హైదరాబాద్‌ నుంచి 177, ఐఐటీ హైదరాబాద్‌ నుంచి 65 పత్రాలు ఉన్నాయి. ఏఐ ఆధారిత పరిశోధన పత్రాల్లో తెలంగాణ విశ్వవిద్యాలయాల వార్షిక వృద్ధిరేటు 31 శాతంగా ఉంది.
  • ఐఐఐటీ హైదరాబాద్‌ కంప్యూటర్‌ విజన్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌(ఎన్‌ఎల్‌పీ) రంగాల్లో, ఐఐటీ హైదరాబాద్‌ ఎంఎల్‌, డేటా మైనింగ్‌ రంగాల్లో ఎక్కువ పరిశోధనలు చేస్తోంది. వీటితో పాటు వెబ్‌ ఇన్ఫర్మేషన్‌ రిట్రీవల్‌, హ్యూమన్‌ కంప్యూటర్‌ ఇంటరాక్షన్‌, రోబోటిక్స్‌ రంగాల్లోనూ పరిశోధనలు జరుగుతున్నాయి.
  • కృత్రిమ మేధ ఆధారిత పరిశోధనల్లో ఐఐఐటీ హైదరాబాద్‌ దేశంలో నంబరు 1గా నిలుస్తోంది. మేధో సంపత్తి హక్కుల కోసం 532 పేటెంట్లు తెలంగాణ నుంచి నమోదయ్యాయి.

మరింత వృద్ధికి మార్గాలివీ..

  • ఐటీ సంస్థల్లోని సీనియర్‌ కార్పొరేట్‌ నాయకులు ఒకే వేదిక కిందకు వచ్చి సమాఖ్య ఏర్పాటు చేయాలి. స్టార్టప్‌లకు సలహాలు, వ్యాపార విషయాల్లో సూచనలతో పాటు ఉత్పాదకత, మార్కెటింగ్‌, బ్రాండింగ్‌, సేల్స్‌, నియామకాలు, పన్నులు, నిధుల సమీకరణ, కొత్త వ్యాపారాలు, కొనుగోలు అంశాలపై అవగాహన కల్పించాలి.
  • విద్యా పరిశోధన సంస్థలు, స్టార్టప్‌లతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలి. పరిశ్రమలు, పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో కలిపి ఏఐ ఆధారిత స్టార్టప్‌ ప్రాజెక్టులు వచ్చేలా వాతావరణం కల్పించాలి.
  • సంబంధిత ప్రభుత్వ విభాగాల సమన్వయంతో నిర్వహించిన గ్రాండ్‌ ఛాలెంజ్‌ పోటీలు, ఆలోచనలు పూర్తిస్థాయి ప్రాజెక్టులుగా మారేలా చూడాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని