‘మేడిగడ్డ’పై నిపుణుల కమిటీ!

కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు నేపథ్యంలో సమగ్ర అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది.

Updated : 29 Nov 2023 04:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు నేపథ్యంలో సమగ్ర అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలంలో గోదావరిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీకి చెందిన పిల్లర్లు గత నెలలో కుంగిన విషయం తెలిసిందే. మంగళవారం హైదరాబాద్‌లోని నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయంలో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.మురళీధర్‌ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బ్యారేజీకి జరిగిన నష్టం, మరమ్మతులు, సాంకేతికత తదితర అంశాలపై అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అన్ని విభాగాలకు చెందిన నిపుణులను నియమించి.. నివేదిక రూపొందించాలన్న అంచనాకు వచ్చారు. తెలంగాణ డ్యాం సేఫ్టీ కమిటీ ఛైర్మన్‌ ఏబీ పాండ్యా, ఈఎన్సీ మురళీధర్‌, విశ్రాంత ఈఎన్సీ రామారావు, ఇద్దరు డిజైన్స్‌ నిపుణులతోపాటు సీడబ్ల్యూసీ నుంచి ఇద్దరు నిపుణులను కమిటీలో సభ్యులుగా తీసుకోవాలని నిర్ణయించారు. కమిటీ ఏర్పాటుకు సంబంధించిన దస్త్రాన్ని ప్రభుత్వ ఆమోదం కోసం పంపించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని