నేడు, రేపు సర్కారు బడులకు ఎన్నికల సెలవులు

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బుధ, గురువారాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న పలువురు కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో డీఈఓలు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఆదేశాలిచ్చారు.

Updated : 29 Nov 2023 05:10 IST

ఉత్తర్వులు జారీ చేసిన పలు జిల్లాల కలెక్టర్లు
హైదరాబాద్‌, మరికొన్ని జిల్లాల్లో ప్రైవేట్‌ పాఠశాలలకూ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బుధ, గురువారాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న పలువురు కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో డీఈఓలు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఆదేశాలిచ్చారు. హైదరాబాద్‌ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు రెండురోజులు సెలవులు ప్రకటిస్తూ హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ ఉత్తర్వులిచ్చారు. సూర్యాపేట తదితర జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే సెలవులిచ్చారు. నిర్మల్‌, కరీంనగర్‌, పెద్దపల్లి తదితర జిల్లాల్లో ప్రైవేట్‌ పాఠశాలలకూ ప్రకటించారు. పోలింగ్‌ కేంద్రాలుగా లేని, వాటిల్లోని ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు లేకుంటే అవి పనిచేస్తాయని, అలాంటివి కేవలం 5 శాతం ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే ఉండొచ్చని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ‘కొన్ని జిల్లాల్లో ప్రైవేట్‌ పాఠశాలలను పోలింగ్‌ కేంద్రాలుగా వాడుకోకున్నా.. వాటికి సంబంధించిన బస్సులను ఎన్నికల విధులకు వినియోగించుకుంటున్నారు. దానివల్ల వాటికి కూడా బుధవారం సెలవు ఇవ్వాల్సి వస్తోంది’ అని జిల్లా అధికారులు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పలు ప్రైవేట్‌ పాఠశాలలు కూడా 29న సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు కూడా పోలింగ్‌ కేంద్రాలుగా ఉండటం, అధ్యాపకులు ఎన్నికల విధుల్లో పాల్గొంటుండటంతో బుధవారం కూడా సెలవులు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారని అధ్యాపక వర్గాలు తెలిపాయి.

మైనారిటీ గురుకులాలను పోలింగ్‌ కేంద్రాలుగా తీసుకుంటే వాటికి ఈనెల 28 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు, 70 శాతం సిబ్బంది పోలింగ్‌ విధుల్లో పాల్గొంటుంటే వాటికి 29 నుంచి 1వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ మైనారిటీస్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ(టీఎంఆర్‌ఈఐఎస్‌) కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. ‘పోలింగ్‌ కేంద్రాలున్న చోట్ల బుధవారం కూడా సెలవు ప్రకటించి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాం’ అని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణమండలి కార్యదర్శి పుల్లయ్య తెలిపారు.

ఎన్నికల విధుల్లోని సిబ్బందికి 1న ప్రత్యేక సెలవు

ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పాఠశాల, ఇంటర్‌ విద్యాశాఖ, సాంకేతిక, ఉన్నత విద్యాశాఖల సిబ్బంది ఈనెల 30న అర్ధరాత్రి వరకు పనిచేయాల్సి ఉంటున్నందున వారికి డిసెంబరు 1వ తేదీన ప్రత్యేక సెలవు(స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌) ఇస్తూ పలు జిల్లాల కలెక్టర్లు ఆదేశాలిచ్చారు.

సెలవులివ్వని సంస్థలపై చర్యలు

పోలింగ్‌ సందర్భంగా గురువారం సెలవులు ఇవ్వని సంస్థలపై ఎన్నికల చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు ఐటీ సంస్థలకు కూడా ఇవి వర్తిస్తాయని పేర్కొన్నారు. దీన్ని ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం తీవ్ర నేరంగా పరిగణించాల్సి వస్తుందని వెల్లడించారు. ఐటీ సంస్థలు సెలవు ప్రకటించాయా? లేదా? అన్న అంశాన్ని పరిశీలించాల్సిందిగా కార్మికశాఖను ఎన్నికల సంఘం ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని