దీక్షాదివస్‌ స్ఫూర్తిగా... రాష్ట్రంకోసం పునరంకితం

తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం దీక్షా దివస్‌ స్ఫూర్తిగా పునరంకింతమవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర గతిని మలుపు తిప్పిన ఘట్టం దీక్షా దివస్‌ అని, నాటి ఉద్యమ చైతన్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందామని పేర్కొన్నారు.

Updated : 29 Nov 2023 05:08 IST

నాటి ఉద్యమ చైతన్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందాం
రాష్ట్ర ప్రజలకు మంత్రి కేటీఆర్‌ పిలుపు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం దీక్షా దివస్‌ స్ఫూర్తిగా పునరంకింతమవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర గతిని మలుపు తిప్పిన ఘట్టం దీక్షా దివస్‌ అని, నాటి ఉద్యమ చైతన్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందామని పేర్కొన్నారు. దేశాభివృద్ధికి తెలంగాణను ఒక మోడల్‌గా నిలిపేందుకు ఆ రోజు బీజం పడిందని అన్నారు. నవంబరు 29న దీక్షాదివస్‌ సందర్భంగా ఆనాటి చరిత్రను గుర్తుచేస్తూ కేటీఆర్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు... ‘‘తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం దీక్షా దివస్‌. నవంబర్‌ 29, 2009 నా జీవితంలో మరచిపోలేని రోజు. దశాబ్దాలుగా దగాపడ్డ తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలను తెంచేందుకు.. కేసీఆర్‌ నడుం బిగించిన రోజు ఇది. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో’ అని నినదిస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగి దిల్లీ పీఠం దిగొచ్చేందుకు ఈ రోజే నాందీవాచకం పలికారు. తెలంగాణ ఇస్తామని 2004లో భారాస (అప్పటి తెరాస)తో పొత్తుపెట్టుకొని రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ రాష్ట్రానికి దోఖా చేసేందుకు సిద్ధపడింది. రాష్ట్రపతి ప్రసంగంలో, యూపీఏ కనీస ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణ ఇస్తామని పార్లమెంట్‌ వేదికగా నమ్మబలికి తాత్సారం చేయడమే కాకుండా..  సందర్భం వచ్చిన ప్రతిసారీ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణను అవహేళనలకు, అవమానాలకు గురిచేస్తూనే వచ్చింది.

ఈ దశలో అక్టోబర్‌ 21, 2009న సిద్దిపేటలో జరిగిన ఉద్యోగ గర్జన సభలో కేసీఆర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘తెలంగాణ కోసం నేనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్న... ఎట్ల తెలంగాణ రాదో చూస్తా’’ అని కేసీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రసాధనే ధ్యేయంగా.. నవంబర్‌ 29న సిద్దిపేటలోని రంగధాంపల్లిలో కేసీఆర్‌ ఆమరణ నిరాహారదీక్షా వేదిక సిద్ధమైంది. హైదరాబాద్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్‌ పూలమాల వేసి, కరీంనగర్‌ తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్‌కు నవంబర్‌ 28న చేరుకున్నారు. నవంబర్‌ 29 తెల్లారేసరికి పోలీసులు చుట్టుముట్టారు. మరోవైపు కేసీఆర్‌కు రక్షణ కవచంగా నిలిచిన ఉద్యమశ్రేణులు  పోలీసులను ప్రతిఘటించాయి. దీంతో పోలీసులు తాత్కాలికంగా వెనక్కితగ్గారు. ఆమరణ దీక్ష చేసేందుకు కేసీఆర్‌ సిద్దిపేటకు బయలుదేరారు. పోలీసులు గందరగోళం సృష్టించి ఆయనను అరెస్టు చేసి ఖమ్మం తరలించారు. ఇది తెలిసి ఆచార్య జయశంకర్‌  ‘‘కేటీఆర్‌, నేనూ.. మా ఇంటి నుంచే నిరసనకు దిగుతున్నాం’’ అని ప్రకటించారు. తదనంతర పరిణామాల్లో జయశంకర్‌ను ఖమ్మం తీసుకెళ్లారు. నన్ను మాత్రం అరెస్ట్‌ చేసి సెంట్రల్‌ జైలుకు తరలించారు. కేసీఆర్‌ ఆమరణ దీక్షకు దిగిన ఈరోజు.. మలిదశ ఉద్యమంలో లక్ష్యం దిశగా అడుగులేసేందుకు మార్గదర్శకమైంది. ఆ స్ఫూర్తిని కొనసాగిద్దాం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు