ప్రలోభాల అడ్డుకట్టకు మరింత నిఘా

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సమీపించడంతో నిఘాను మరింత విస్తృతం చేశామని, గురువారం పోలింగ్‌ ముగిసేంత వరకు రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు.

Updated : 29 Nov 2023 04:32 IST

రాష్ట్రంలో పోలింగ్‌ ముగిసేంత వరకు 144 సెక్షన్‌
ఎన్నికల సిబ్బంది నిర్దేశిత మార్గాల్లోనే వెళ్లాలి
తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సమీపించడంతో నిఘాను మరింత విస్తృతం చేశామని, గురువారం పోలింగ్‌ ముగిసేంత వరకు రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ వెల్లడించారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసిన నేపథ్యంలో బీఆర్కే భవన్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇకపై ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి ప్రచారం చేయకూడదు. బల్క్‌ మెసేజ్‌లు పంపకూడదు. బుధవారం నుంచి ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు వెళతారు. వారికిచ్చిన రూట్‌ మ్యాప్‌ల ఆధారంగానే వెళ్లాలని నిర్దేశించాం. పోలింగ్‌ ముగిసిన తరువాత కూడా ఈవీఎంలను తీసుకెళ్లాల్సిన మార్గాలపై రూట్‌ మ్యాప్‌లు ఇచ్చాం. దానికి భిన్నంగా ఇతర మార్గాల్లో వెళ్తే చర్యలు తీసుకుంటాం. రాజకీయ పార్టీల ప్రతినిధులు వారి సొంత వాహనాల్లో ఎన్నికల వాహనాలను అనుసరించవచ్చు.

ఉదయం 5.30 గంటలకు మాక్‌పోలింగ్‌

  • గురువారం పోలింగ్‌ ప్రారంభానికి 90 నిమిషాలు ముందు ఉదయం 5.30 గంటల మాక్‌పోలింగ్‌ నిర్వహిస్తాం. రాజకీయ పార్టీల ఏజెంట్లు ఆ సమయానికి చేరుకోవాలి.
  • ఇది పూర్తయిన తరువాత బ్యాలెట్‌ యూనిట్‌తోపాటు వీవీప్యాట్‌ ట్రేను పూర్తిగా క్లియర్‌ చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించాం.
  • రాష్ట్రంలో 35,655 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. సమస్యాత్మకమని గుర్తించిన 27,094 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ నిర్వహిస్తాం.
  • 15,999 మంది సర్వీసు ఓటర్లు బ్యాలెట్‌ పత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వీటిని వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ఒక నిమిషం ముందు చేర్చాల్సి ఉంటుంది.
  • ఇప్పటి వరకు 1.48 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
  • ఇంటి నుంచి 27,178 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ విధానానికి అర్హులైన వారిలో 94% మంది ఓటు వేశారు.
  • పోలింగ్‌ ముగిసిన అరగంట తరువాత ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ప్రకటించవచ్చు.

ఓటరు స్లిప్పు ధ్రువపత్రం కాదు

రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలను అనుసంధానం చేసేందుకు 3,800 సెక్టార్‌ ఆఫీసర్లను నియమించాం. వారి వద్ద అదనపు ఈవీఎంలతోపాటు భద్రతా సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఎక్కడైనా ఈవీఎం పని చేయని పక్షంలో అదనపు యంత్రాన్ని సరఫరా చేస్తారు. ఓటరు సమాచార పత్రం(ఓటరు స్లిప్పు) ఓటు వేసేందుకు ధ్రువపత్రం కాదు. స్లిప్పులపై అభ్యర్థులు, పార్టీ సమాచారం లేకుండా పంపిణీ చేసుకోవచ్చని రాజకీయ పార్టీలకు అనుమతులిచ్చాం. ఇప్పటి వరకు తనిఖీల్లో రూ.732 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నాం. అందులో రూ.302 కోట్లు నగదు, రూ.84 కోట్ల విలువ చేసే వస్తువులు ఉన్నాయి’ అని వికాస్‌రాజ్‌ తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి మంత్రి కేటీఆర్‌కు పంపిన నోటీసుపై వివరణ వచ్చిందని, దానిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామని చెప్పారు. సమావేశంలో ఎన్నికల అధికారులు లోకేశ్‌కుమార్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని