ఇందూరులో వడగళ్ల బీభత్సం

నిజామాబాద్‌ జిల్లాలో మంగళవారం వడగళ్లు బీభత్సం సృష్టించాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో గాలివాన పడింది.

Published : 29 Nov 2023 05:12 IST

కల్లాలపై తడిసిన ధాన్యం

నిజామాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ జిల్లాలో మంగళవారం వడగళ్లు బీభత్సం సృష్టించాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో గాలివాన పడింది. పలుచోట్ల రోడ్లపై భారీ వృక్షాలు నేలకూలాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. నిజామాబాద్‌ నగరంతో పాటు నవీపేట, ఎడపల్లి, బోధన్‌, నిజామాబాద్‌ గ్రామీణం, రుద్రూర్‌, రెంజల్‌, సాలూర, నందిపేట్‌ మండలాలతో పాటు కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. అత్యధికంగా ఎడపల్లి మండలం జాన్కంపేట్‌లో 49.8 మిల్లీ మీటర్ల వర్షంపడింది. నిజామాబాద్‌ నగరంలో 42.8,. కల్దుర్కిలో 34.3, గూపన్‌పల్లిలో 33.8, చిన్నమావందిలో 30.0, పాల్దా, ఎడపల్లి, రెంజల్‌లో 18.3. మాక్లూర్‌లో 13, డిచ్‌పల్లిలో 9.8, తాడ్వాయిలో 8.8, ఆలూర్‌లో 7.5, మాచాపూర్‌లో 6.8, పుల్కల్‌లో 5.5, నవీపేటలో 4.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులకు తోడు వడగళ్లు పడడంతో ప్రజలు బెంబేలెత్తారు. రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాలపై చెట్లు విరిగిపడ్డాయి. చాలా మండలాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. వానాకాలం సీజన్‌లో ఇంకా సగం ధాన్యం కల్లాల్లోనే ఉంది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. ఒక్కసారిగా వచ్చిన వడగళ్లతో రైతులు ఆగమాగమయ్యారు. వ్యవసాయ పనులు ముగించుకొని వస్తున్న రైతులు, కూలీలు వడగళ్ల వానతో బిక్కుబిక్కుమంటూ ఇళ్లకు చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని