ఓటు బాటలో పోటెత్తారు

సొంతూరిలో ఓటేసేందుకు హైదరాబాద్‌ నుంచి ఓటర్లు బుధవారం పెద్దఎత్తున తరలివెళ్లారు. నగరంలో చదువుకుంటున్న విద్యార్థులు.. ఉద్యోగాలు చేస్తున్న యువత.. ఉపాధి నిమిత్తం ఇక్కడ స్థిరపడినవారు స్వగ్రామాలకు వెళ్లేందుకు రావడంతో.. జూబ్లీ బస్‌స్టేషన్‌(జేబీఎస్‌), మహాత్మా గాంధీ బస్‌స్టేషన్‌(ఎంజీబీఎస్‌)లతో పాటు రైల్వే స్టేషన్లూ కిక్కిరిశాయి.

Published : 30 Nov 2023 05:31 IST

రాజధాని నగరం నుంచి సొంతూళ్లకు పయనం
కిక్కిరిసిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
బస్సులు చాలక అవస్థలు
సాధారణం కంటే రెట్టింపు సంఖ్యలో తరలివెళ్లిన ప్రయాణికులు

ఈనాడు, హైదరాబాద్‌: సొంతూరిలో ఓటేసేందుకు హైదరాబాద్‌ నుంచి ఓటర్లు బుధవారం పెద్దఎత్తున తరలివెళ్లారు. నగరంలో చదువుకుంటున్న విద్యార్థులు.. ఉద్యోగాలు చేస్తున్న యువత.. ఉపాధి నిమిత్తం ఇక్కడ స్థిరపడినవారు స్వగ్రామాలకు వెళ్లేందుకు రావడంతో.. జూబ్లీ బస్‌స్టేషన్‌(జేబీఎస్‌), మహాత్మా గాంధీ బస్‌స్టేషన్‌(ఎంజీబీఎస్‌)లతో పాటు రైల్వే స్టేషన్లూ కిక్కిరిశాయి. సొంత గ్రామంలో ఓటు వేయడంతో పాటు ఇతర పనులేమైనా ఉంటే చూసుకొని రావొచ్చన్న ఉద్దేశంతో సోమవారం నుంచి పెద్దసంఖ్యలో నగరం నుంచి ఊళ్లకు బయలుదేరి వెళ్లారు. వీరిలో 22 నుంచి 25 ఏళ్ల వయసున్న యువత.. ముఖ్యంగా ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు. ‘నాకు తొలిసారి ఓటు వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మా సొంతూరైన ఖమ్మం వెళ్తున్నాను. అమ్మానాన్నలతో చర్చించి ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయం తీసుకుంటా’ అని బీటెక్‌ విద్యార్థిని ఒకరు తెలిపారు. ‘ఎప్పటి నుంచో హైదరాబాద్‌లో ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నాం. మా పల్లెకు వెళ్లి ఓటు వేస్తాం’ అని కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ఒక కుటుంబ సభ్యులు తెలిపారు.

ఎన్నికల విధులకు బస్సులు.. ప్రయాణికులకు పాట్లు

పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బందిని, ఈవీఎం యంత్రాలను తరలించే నిమిత్తం ఆర్టీసీ బస్సులను వినియోగించడంతో.. హైదరాబాద్‌ నగరం నుంచి గ్రామాలకు, పట్టణాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సుల కోసం గంటలకొద్దీ పడిగాపులు కాయాల్సి వచ్చింది. అడపాదడపా వచ్చిన బస్సుల్లో చోటు కోసం పరుగులు పెట్టారు. కొందరు కిటికీల్లోంచి లోపలికి దూరారు. సీట్లు నిండిపోవడంతో.. నిల్చొని మరీ కిక్కిరిసి ప్రయాణించారు. ‘సీట్లు దొరకని విధంగా రద్దీ ఉన్నా.. ఊర్లో ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ఎంజీబీఎస్‌కు వచ్చాను’ అని నగరంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఉద్యోగం చేస్తున్న హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన మహిళ తెలిపారు. దాదాపు 20 శాతం బస్సులను ఎన్నికల విధులకు పంపడం వల్లనే కొరత నెలకొందని జేబీఎస్‌లో ఆర్టీసీ సూపర్‌వైజర్‌ ఒకరు తెలిపారు.

సొంత వాహనాల్లోనూ..

హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న జిల్లాలవారు పలువురు ద్విచక్ర వాహనాలపై తరలివెళ్లారు. దూర ప్రాంతాలవారు, సొంత కార్లున్న వారు వాటిలో వెళ్లారు. ‘ఈ రోజు ఆఫీస్‌ ఉంది. గురువారం ఉదయం బైక్‌పై ఊరికి వెళ్లి ఓటేస్తాను’ అని ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఓ ప్రైవేట్‌ ఉద్యోగి తెలిపారు.  


ప్రతిరోజు కన్నా రెట్టింపు..

హైదరాబాద్‌ నగరంలోని అన్ని బస్సు స్టేషన్ల నుంచి ప్రతిరోజూ 3,280 బస్సులు ఊళ్లకు వెళ్తుంటాయి. ఎన్నికల వేళ రద్దీ ఎక్కువగా ఉంటుందన్న అంచనాతో అదనంగా బస్సులను సిద్ధం చేసి ఉంచారు. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రయాణికుల రద్దీ మొదలు కాగా.. 10 గంటలయ్యేసరికి ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. రాత్రి 8 గంటలకు కూడా రద్దీ తగ్గలేదు. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌లతో పాటు నగర శివార్లలోని ఎల్‌బీనగర్‌, ఆరాంఘర్‌ చౌరస్తా, జగద్గిరిగుట్ట, బాలానగర్‌ చౌరస్తా, చాంద్రాయణగుట్ట, పటాన్‌చెరు, ఉప్పల్‌ క్రాస్‌రోడ్స్‌, ఉప్పల్‌ బస్సు స్టేషన్‌.. ఇలా ఎక్కడ చూసినా ప్రయాణికుల రద్దీ కనిపించింది. ‘‘ప్రయాణికులు పోటెత్తడంతో నగరంలోని అన్ని డిపోల నుంచి మెట్రో ఎక్స్‌ప్రెస్‌లతోపాటు డీలక్స్‌ బస్సులను కూడా సిద్ధం చేశాం. రాత్రి 7 గంటల వరకూ 850 బస్సులు అదనంగా నడిపాం. మరో 400 బస్సులు సిద్ధంగా ఉంచాం’’ అని రంగారెడ్డి ఆర్‌ఎం శ్రీధర్‌ తెలిపారు. ప్రతిరోజూ నగరం నుంచి 1.80 లక్షల మంది ఊళ్లకు వెళ్తారని.. బుధవారం దానికి రెట్టింపు సంఖ్యలో వెళ్లారని ఆయన పేర్కొన్నారు. వీరిలో ఓట్లు వేసేందుకు సొంతూళ్లకు బయలుదేరినవారితో పాటు సాధారణ ప్రయాణికులూ ఉన్నారు.


రైళ్ల కిటకిట..

బస్సుల్లోనే కాదు.. రైళ్లలోనూ ప్రయాణికులు పోటెత్తారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు ఉదయం నుంచే ప్రయాణికులు భారీగా తరలివచ్చారు. దీంతో అదనంగా పోలీసు సిబ్బందిని ఉంచి.. జనరల్‌ బోగీల వద్ద తొక్కిసలాట జరగకుండా చూశామని స్టేషన్‌ మేనేజర్‌ రాజనర్సు చెప్పారు. విజయవాడ వైపు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లన్నీ నిండిపోయాయని తెలిపారు.   సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి కాజీపేట, వరంగల్‌, ఖమ్మం మీదుగా వెళ్లే రైళ్లన్నీ కిటకిటలాడాయి. నిజామాబాద్‌, కాగజ్‌నగర్‌, మహబూబ్‌నగర్‌ వైపు వెళ్లే రైళ్లూ నిండిపోయాయి. ఈస్ట్‌కోస్ట్‌, కోణార్క్‌, రేపల్లె, కాకతీయ, గోల్కొండ, భాగ్యనగర్‌, బెల్లంపల్లి, శాతవాహన, విశాఖ, ఫలక్‌నుమా, గోదావరి ఎక్స్‌ప్రెస్‌లు కిక్కిరిసిపోయాయి. జనరల్‌ బోగీలు నిండిపోవడంతో కొందరు స్లీపర్‌ కోచ్‌లలోకి ఎక్కి ప్రయాణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని