హైదరాబాద్‌లో డీసీపీ, ఏసీపీ సస్పెన్షన్‌

ఎన్నికల్లో డబ్బు తరలింపు విషయంలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం రచ్చకెక్కింది. ఈ వ్యవహారంలో నలుగురు సస్పెన్షన్‌కు గురి కాగా.. మరొకరిని సర్వీసు నుంచి తొలగించారు.

Updated : 30 Nov 2023 05:43 IST

మరో ఇన్‌స్పెక్టర్‌, వరంగల్‌  ఆబ్కారీ ఇన్‌స్పెక్టర్‌పైనా..
 సర్వీస్‌ నుంచి జైలర్‌ తొలగింపు
 ఎన్నికల సొమ్ము తరలింపు ఆరోపణలతో..

 ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల్లో డబ్బు తరలింపు విషయంలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం రచ్చకెక్కింది. ఈ వ్యవహారంలో నలుగురు సస్పెన్షన్‌కు గురి కాగా.. మరొకరిని సర్వీసు నుంచి తొలగించారు. డీసీపీ స్థాయి అధికారిపై వేటుపడడం సంచలనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు నాడి అంతు చిక్కకపోవడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు నరాలు తెగే ఉత్కంఠతో ఉన్నారు. ఎన్నికల కమిషన్‌ బృందాల పటిష్ఠ నిఘా నేపథ్యంలో వీలైన అన్ని దారుల్లో నగదు తెప్పించుకునే ప్రయత్నాల్లో తలమునకలయ్యారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థుల తరఫున కొందరు అధికారులే నేరుగా రంగంలోకి దిగడం.. మరికొందరు అధికారులు పరోక్షంగా సహకరించడం వంటివి విస్మయం కలిగిస్తున్నాయి.

  • హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని సంతోష్‌ ఎలైట్‌ అపార్ట్‌మెంట్‌ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఓటర్లకు డబ్బు పంచుతున్నారంటూ ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందింది. తనిఖీ బృందం అక్కడికి వెళ్లడంతో కారులో రూ.18 లక్షల నగదు లభ్యమైంది. నగదుతో పాటు సెల్‌ఫోన్‌, చెక్‌బుక్కులు, కారు (ఏపీ28సీహెచ్‌ 6759)ను ముషీరాబాద్‌ నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారి రవి ఇస్లావత్‌.. పోలీసులకు అప్పగించారు. వాహన యజమాని నగదుకు సంబంధించిన సమగ్ర వివరాలను వెల్లడించారు. అయితే పోలీసు అధికారులు అవన్నీ గుర్తు తెలియని వ్యక్తికి చెందినవిగా కేసు నమోదుచేశారు. నిందితుడిని ఉద్దేశపూర్వకంగానే తప్పించే పన్నాగానికి తెరలేపారు. విషయం గ్రహించిన ఎన్నికల తనిఖీ బృందం విషయాన్ని తీవ్రంగా తీసుకొని నివేదిక సమర్పించింది. కమిషన్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌శాండిల్య విచారణ జరిపించడంతో సెంట్రల్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ జహంగీర్‌ యాదవ్‌ల నిర్వాకం బహిర్గతమైంది. నగదు ముషీరాబాద్‌ అభ్యర్థికి చెందినదిగా తేలినా.. సదరు అభ్యర్థి కుటుంబసభ్యుడు ఘటనాస్థలిలో దొరికినా వారిని తప్పించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. నివేదిక ఆధారంగా ముగ్గురు అధికారులను సస్పెండ్‌ చేయాలంటూ ఎన్నికల కమిషన్‌ ఆదేశించడంతో ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
  • ఈ నెల 18న ఓఆర్‌ఆర్‌ అప్పా కూడలి వద్ద కారులో తరలిస్తున్న రూ.7.40 కోట్ల నగదును సైబరాబాద్‌ పోలీసులు జప్తుచేశారు. మొయినాబాద్‌ నుంచి ఖమ్మంలో ఓ అభ్యర్థికి చేరవేసేందుకు ఆ సొమ్ము తీసుకెళుతున్నారనే ఆరోపణలతో పది మందిపై కేసు నమోదైంది. నిందితుల్లో ఓ జైలర్‌ ఉన్నారు. ఆయన గురించి ఆరా తీస్తే రెండేళ్లుగా విధులకు దూరంగా ఉన్నట్లు తేలింది. వరంగల్‌ కేంద్ర కారాగారాన్ని తరలించిన సమయంలో ఆయనను అక్కడి నుంచి హైదరాబాద్‌లోని శిక్షణ సంస్థకు బదిలీచేశారు. అప్పటినుంచి అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడంతో విచారణ నిర్వహించారు. వ్యాపారం చేసే ఉద్దేశంతోనే విధులకు దూరంగా ఉంటున్నట్లు గుర్తించారు. దీనిపై నివేదిక ఎప్పుడో సిద్ధమైనా ఉన్నతాధికారులు చర్య తీసుకోలేదు. ఎన్నికల డబ్బు తరలింపు వ్యవహారం తరువాత పాత నివేదిక దుమ్ము దులిపారు. ఆయనను సర్వీస్‌ నుంచి తొలగించారు.
  • ఈ నెల 27న వరంగల్‌ అర్బన్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ అజిత్‌రావు సుమారు రూ.6 లక్షల డబ్బుతో కారులో ప్రయాణిస్తుండగా హైదరాబాద్‌ మేడిపల్లి ప్రాంతంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఓ హోటల్‌ నుంచి వచ్చిన అజిత్‌రావు ఎన్నికల సొమ్ము తరలిస్తున్నారంటూ దాడి చేసి పోలీసులకు అప్పగించారు. అజిత్‌రావు మాత్రం ఓ ఫంక్షన్‌ కోసం హోటల్‌ బుక్‌ చేసేందుకు వచ్చానని చెప్పారు. ఈక్రమంలో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేయకుండా డబ్బును ఐటీశాఖకు అప్పగించారు. ఈ వ్యవహారంపై ఎక్సైజ్‌శాఖ వరంగల్‌ డిప్యూటీ కమిషనర్‌ విచారణ జరిపారు. అజిత్‌రావు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా హైదరాబాద్‌ వచ్చినట్లు తేలడంతో బుధవారం సస్పెన్షన్‌ వేటువేశారు. సస్పెన్షన్‌ కాలంలో వరంగల్‌ హెడ్‌క్వార్టర్‌ను వదిలి వెళ్లరాదని ఆదేశించారు.

మధ్యమండలం డీసీపీగా శ్రీనివాస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల విధుల్లో అలక్ష్యం వహించినందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వేటు పడిన ముగ్గురు పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారిని నియమించారు. ఈమేరకు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సందీప్‌ శాండిల్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాఫిక్‌ డీసీపీ డి.శ్రీనివాస్‌ను మధ్యమండలం డీసీపీగా, సీసీఎస్‌ ఏసీపీ మధుమోహన్‌రెడ్డిని చిక్కడపల్లి ఏసీపీగా, ముషీరాబాద్‌ డీఐ డి.వెంకట్‌రెడ్డిని అక్కడే ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. వీరు బుధవారం రాత్రి బాధ్యతలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని