కృత్రిమ మేధతో సమస్యలకు చెక్‌!

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు కృత్రిమ మేధ శ్రేష్ఠతర కేంద్రాల(సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌)ను నెలకొల్పేందుకు సమాయత్తమైంది.

Published : 30 Nov 2023 05:30 IST

 దేశంలో మూడు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు
వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిర నగరాలపై అధ్యయనం
అయిదేళ్లలో రూ.990 కోట్ల వ్యయం
సెంటర్‌ కోసం పోటీలో ఐఐటీ హైదరాబాద్‌

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు కృత్రిమ మేధ శ్రేష్ఠతర కేంద్రాల(సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌)ను నెలకొల్పేందుకు సమాయత్తమైంది. కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించుకొని వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిర నగరాలపై అధ్యయనం చేసి ఆ రంగాల్లో అభివృద్ధి సాధించాలని నిర్ణయించిన  కేంద్రం అందుకు 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.990 కోట్లు కేటాయించనుంది. ఆయా ప్రముఖ విద్యాసంస్థలు కన్సార్షియంగా ఏర్పడి కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గత కేంద్ర బడ్జెట్‌లో ఏఐ శ్రేష్ఠతర కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రకటించగా.. తాజాగా విధివిధానాలను రూపొందించి ఛాలెంజ్‌ ఆధారిత విధానంలో ఆయా సంస్థలను ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దేశంలో తొలిసారిగా బీటెక్‌ ఏఐ కోర్సును ప్రారంభించిన విద్యాసంస్థగా ఘనత పొందిన ఐఐటీ హైదరాబాద్‌ సైతం శ్రేష్ఠతర కేంద్రాన్ని పొందేందుకు కసరత్తు చేస్తోంది. హెచ్‌సీయూ, ఓయూ సైతం పోటీపడతాయని తెలుస్తోంది.

మూడు రంగాల్లో అంతిమ లక్ష్యం ఇదీ

వ్యవసాయం: కృత్రిమ మేధ విధానాలను ఉపయోగించి వాతావరణ మార్పులు, వర్షాలు, తుపాన్లకు సంబంధించి ముందుగా కచ్చితమైన సమాచారం అందించడం, ముందుగానే ఆయా పంటలకు వచ్చే తెగుళ్లు, సాగులో ఉన్న పంటల స్థితిగతులను అంచనా వేయాలన్నది లక్ష్యం. అయిదేళ్ల ప్రాజెక్టు ఫలితంగా తృణధాన్యాల దిగుబడిని 10 శాతం పెంచడం, తెగుళ్ల నివారణతో పంట ఉత్పత్తిలో 12 శాతం నష్టాన్ని తగ్గించడం, 15 శాతం నీటి వినియోగాన్ని తగ్గించడం, సరఫరా గొలుసు (సప్లై చెయిన్‌) సమర్థ నిర్వహణ ద్వారా నిల్వ, రవాణాలో 5 శాతం వృద్ధి సాధించడం అంతిమ లక్ష్యంగా నిర్ణయించారు.

ఆరోగ్యం: గ్రామీణ ప్రాంత మహిళల్లో ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ లోపాన్ని గుర్తించడం ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డల జననాలను 10 శాతం పెంచాలి. గ్రామీణ ప్రాంత చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని 12 శాతం తగ్గించాలి. మామోగ్రామ్‌, ఇతరత్రా పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం ఆరోగ్య రంగంలో సాధించాల్సిన లక్ష్యాలు.

సుస్థిర నగరాలు: కొన్ని రంగాల్లో 15 శాతం విద్యుత్తు వినియోగాన్ని తగ్గించడం, నగరాల్లో గాలి, నీటి కాలుష్యాన్ని 10 శాతం మేర తగ్గించడం, మురుగునీరు, చెత్త కలవడం వల్ల సముద్రాలు, నదుల్లో కాలుష్య స్థాయి పెరుగుతున్నందున వ్యర్థాల తరలింపులో 25 శాతం వృద్ధిని సాధించడం, రవాణా సౌకర్యాలు పెంచడం ద్వారా ప్రయాణికుల సమయాన్ని 20 శాతం తగ్గించడం లక్ష్యాలుగా కేంద్రం నిర్ణయించింది.


ఆ కేంద్రం కోసం కృషి చేస్తున్నాం

మూడు శ్రేష్ఠతర కేంద్రాల్లో ఏదో ఒకదాన్ని ఐఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేలా మా బృందం కసరత్తు చేస్తోంది. ఇందుకు ఒక సమన్వయకర్తను నియమించాం. వారు ఏ రంగంలో పోటీ పడాలన్న దానిపై ఆచార్యులతో చర్చలు జరుపుతున్నారు. హైదరాబాద్‌లో వ్యవసాయం, వైద్యంతో పాటు సుస్థిర నగరాలకు సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలున్నందున మనకు ఇదో పెద్ద అవకాశం. కృత్రిమ మేధలో బీటెక్‌ కోర్సును ప్రవేశపెట్టిన తొలి ఐఐటీ మనదే. ఆ రంగంలో 30 మంది నిపుణులు ఇక్కడ ఉన్నారు. అందుకే కేంద్రాన్ని సాధించాలన్న లక్ష్యంతో ఉన్నాం.

 ఆచార్య బీఎస్‌ మూర్తి, డైరెక్టర్‌, ఐఐటీ హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని