అకాల వర్షానికి దెబ్బతిన్న పత్తి

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పలు ప్రాంతాల్లో పంటలు, ఆస్తులు దెబ్బతిన్నాయి. భారీ వడగళ్లు పడటంతో నిజామాబాద్‌ గ్రామీణ, కామారెడ్డి నియోజకవర్గాల పరిధిలో పత్తి పంటకు తీవ్రనష్టం వాటిల్లింది.

Published : 30 Nov 2023 03:26 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వడగళ్ల వాన

నిజామాబాద్‌ వ్యవసాయం, న్యూస్‌టుడే: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పలు ప్రాంతాల్లో పంటలు, ఆస్తులు దెబ్బతిన్నాయి. భారీ వడగళ్లు పడటంతో నిజామాబాద్‌ గ్రామీణ, కామారెడ్డి నియోజకవర్గాల పరిధిలో పత్తి పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. నిజామాబాద్‌తో పాటు పరిసర మండలాల్లో ఈదురు గాలులకు భారీ చెట్లు నేలకూలాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్తు తీగలు తెగిపోవడంతో సరఫరా నిలిచింది. బుధవారం రాత్రి అధికారులు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలవ్యాప్తంగా 350 ఎకరాల్లో పత్తి పంట నష్టపోయినట్లు అధికారులు తెలిపారు. ఇదే మండలం ముల్లంగిలో 250 ఎకరాల్లో పత్తితో పాటు మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది.

 నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

 ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఆగ్నేయ దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తున్నాయని పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌లో అత్యధికంగా 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్‌ జిల్లా పొతంగల్‌, సంగారెడ్డి జిల్లా నాగలిగిద్ద 6.1, మెదక్‌ జిల్లా రేగోడ్‌లలో 6.1, నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లిలో 5.9, సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి.

సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖమ్మంలో 4 డిగ్రీలు అధికంగా 33.6 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. భద్రాచలం 33.8, ఆదిలాబాద్‌ 33.2, హనుమకొండలో 32 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు రాష్ట్రమంతటా సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యాయి. పటాన్‌చెరులో సాధారణం కన్నా 6.9 డిగ్రీలు అధికంగా 20.8 డిగ్రీల సెల్సియస్‌, రాజేంద్రనగర్‌లో 20.5, హైదరాబాద్‌లో 21.7, హయత్‌నగర్‌లో 19.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని