Revanth Reddy: సీఎంగా రేవంత్‌!

తెలంగాణలో సోమవారం కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరనుంది. కాంగ్రెస్‌ ప్రతినిధిబృందం ఆదివారం రాత్రి గవర్నర్‌ తమిళిసైని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపింది.

Updated : 04 Dec 2023 06:57 IST

నేడు కొలువుదీరనున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం
ఉదయం తొమ్మిదిన్నరకు సీఎల్పీ సమావేశం
గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ బృందం

ఈనాడు హైదరాబాద్‌: తెలంగాణలో సోమవారం కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరనుంది. కాంగ్రెస్‌ ప్రతినిధిబృందం ఆదివారం రాత్రి గవర్నర్‌ తమిళిసైని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలిపింది. సోమవారం ఉదయం కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం తర్వాత అధిష్ఠానంతో సంప్రదించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది గవర్నర్‌కు తెలియజేస్తారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. పీసీసీ అధ్యక్షుడు, కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆయన పేరును ఖరారు చేసినట్లుగా సమాచారం. పార్టీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు ఈ పదవికి పోటీ పడుతున్న నేపథ్యంలో సీఎల్పీ భేటీ తర్వాతనే అధికారికంగా సీఎం అభ్యర్థి పేరు వెలువడే అవకాశం ఉంది. ఆదివారం వెలువడిన ఫలితాల్లో సీపీఐతో కలిసి 65 స్థానాలను గెలుచుకొన్న కాంగ్రెస్‌... ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సాధించింది. డిసెంబరు 9న ఎల్‌.బి.స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని గతంలో పలు సందర్భాల్లో రేవంత్‌ ప్రకటించారు. అయితే అంతవరకు ఆగకుండా సోమవారమే చేయాలని నిర్ణయించారు.

హైదరాబాద్‌లో మకాం వేసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకురాలు దీపాదాస్‌మున్షీ, ఇన్‌ఛార్జి ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లురవి తదితరులు ఆదివారం రాత్రికే ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే ఎమ్మెల్యేలందరూ చేరుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో సోమవారం ఉదయం తొమ్మిదిన్నరకు సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి డీకే శివకుమార్‌, బోసురాజు, అజయ్‌కుమార్‌, జార్జ్‌, దీపాదాస్‌మున్షీలు పరిశీలకులుగా హాజరవుతారు. ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత సీఎల్పీ చేసిన తీర్మానాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి పంపిస్తారు. అక్కడి నుంచి వచ్చే సీఎం పేరును ఎమ్మెల్యేలకు చెప్పి అనంతరం గవర్నర్‌ను కలిసి అందజేస్తారు. మరోవైపు ఎన్నికల సంఘం సీఈవో సోమవారం గవర్నర్‌ను కలిసి గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను సమర్పిస్తారు. ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ కార్యక్రమం ఉంటుంది. సీఎం ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక ఇంకెవరైనా ఉంటారా అన్నది సోమవారం తేలనుంది. ప్రమాణ స్వీకారానికి అగ్రనేతలు ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంక హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరాం

-డీకే

రాజ్‌భవన్‌ బయట పార్టీ నేతలతో కలిసి డీకే శివకుమార్‌ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం ఒక హోటల్‌లో జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్‌ విధానం ప్రకారం సీఎల్పీ సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని ఆయన వివరించారు. అనంతరం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పారు. వాస్తవానికి సీఎల్పీ సమావేశం ఆదివారం రాత్రే నిర్వహించాలని భావించామని, కొత్త ఎమ్మెల్యేలంతా రాత్రి నగరానికి చేరుకోవడంలో ఆలస్యం జరిగినట్లు ఆయన వివరించారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు బస చేసే గచ్చిబౌలి ఎల్లా హోటల్‌ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని