Congress - RevanthReddy: చెయ్యెత్తి జై కొట్టిన తెలంగాణ

‘హస్త’వాసి ఫలించింది.. ఆ ధాటికి ‘కారు’ వెనకబడింది. మార్పు కావాలంటూ కాంగ్రెస్‌ చేసిన ఉద్ధృత ప్రచారం ఆ పార్టీని విజయతీరానికి చేర్చింది. ఎట్టకేలకు తెలంగాణ పీఠం దక్కింది. సుమారు దశాబ్దం తర్వాత భారాస దూకుడుకు కాంగ్రెస్‌ కళ్లెం వేయగలిగింది.

Updated : 06 Dec 2023 12:36 IST

64 స్థానాలతో పీఠం కైవసం
రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్‌కు అధికారం
భారాసకు 39 స్థానాలు  
8 చోట్ల భాజపా గెలుపు  
7 స్థానాలూ నిలబెట్టుకున్న మజ్లిస్‌
కాంగ్రెస్‌కు 39.40 శాతం, భారాసకు 37.35 శాతం, భాజపాకు 13.90 శాతం ఓట్లు
కొత్తగూడెంలో సీపీఐ గెలుపు  
రాజధానిలో భారాసకు 18.. కాంగ్రెస్‌కు మూడు..
కేసీఆర్‌, రేవంత్‌రెడ్డిలకు ఒక గెలుపు.. ఒక ఓటమి  
కామారెడ్డిలో వారిద్దరినీ కాదని భాజపాకు పట్టం
మంత్రుల్లో 8 మంది విజయం, ఆరుగురి పరాజయం  
రెండు చోట్లా ఓడిన ఈటల
కుత్బుల్లాపూర్‌ భారాస ఎమ్మెల్యేకు అత్యధికంగా 85 వేల మెజారిటీ

‘హస్త’వాసి ఫలించింది.. ఆ ధాటికి ‘కారు’ వెనకబడింది. మార్పు కావాలంటూ కాంగ్రెస్‌ చేసిన ఉద్ధృత ప్రచారం ఆ పార్టీని విజయతీరానికి (telangana election results) చేర్చింది. ఎట్టకేలకు తెలంగాణ పీఠం దక్కింది. సుమారు దశాబ్దం తర్వాత భారాస దూకుడుకు కాంగ్రెస్‌ కళ్లెం వేయగలిగింది. ఆరు నెలల కిందటి వరకు అయోమయస్థితిలో ఉన్న కాంగ్రెస్‌.. కర్ణాటకలో విజయంతో పుంజుకుని పురోగమించింది. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో కూడా దూసుకెళ్లిన భారాసకు నిరాశే మిగిలింది. మూడు ప్రధాన పార్టీలూ హోరాహోరీగా ప్రచారం చేయగా.. చివరకు ఓటర్లు ‘చేయి’ పట్టుకుని నడవాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ (Congress), భారాసల నడుమ సీట్ల అంతరం ఎక్కువగా కనిపిస్తున్నా.. వాటికి పోలైన ఓట్ల శాతంలో తేడా 2.05 మాత్రమే. తమ పోరాటం ఫలించినందుకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ పెద్దలు సన్నాహాలు ప్రారంభించారు.        

ఈనాడు, హైదరాబాద్‌: ‘మార్పు కావాలి-కాంగ్రెస్‌ రావాలి’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ చేసిన నినాదాన్ని తెలంగాణ ప్రజలు నిజం చేశారు. 64 స్థానాలిచ్చి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ పార్టీకి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే నాలుగు సీట్లు ఎక్కువగా సాధించి పెట్టారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలు, ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేల వ్యవహారశైలి కాంగ్రెస్‌కు కలిసొచ్చాయని విశ్లేషకుల అంచనా. భారాస 39 సీట్లకే పరిమితమై డీలా పడింది. రెండు స్థానాల్లో పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గజ్వేల్‌లో గెలిచి కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. మంత్రుల్లో ఎనిమిది మంది విజయం సాధించగా.. ఆరుగురు పరాజయాన్ని మూటకట్టుకున్నారు. భారాస తనకు పట్టున్న పలు నియోజకవర్గాలను కూడా కోల్పోయింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (RevanthReddy) కూడా రెండుచోట్ల పోటీ చేసినా.. కొడంగల్‌లో మాత్రమే గెలిచారు. కామారెడ్డిలో మూడో స్థానానికి పరిమితమయ్యారు. తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేసిన భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ రెండు చోట్లా ఓడిపోయారు. మెరుగ్గా సీట్లు పొంది కింగ్‌ మేకర్‌ కావాలనుకున్న భాజపా మొత్తం ఎనిమిది సీట్లకే పరిమితమైంది. ఆ పార్టీ తరఫున బరిలోకి దిగిన ముగ్గురు ఎంపీలు సహా మిగిలిన అభ్యర్థులందరూ పరాజయాన్ని మూట కట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలపరంగా చూస్తే.. కాంగ్రెస్‌ ఖమ్మం, నల్గొండ, వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది.

ఈ జిల్లాల్లో భారాసకు ఒకటి, రెండు స్థానాలే దక్కడం గమనార్హం. రాష్ట్రమంతటా కాంగ్రెస్‌ హవా కనిపించినా.. రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అత్యధిక స్థానాల్లో భారాస అభ్యర్థులే గెలిచారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో 29 స్థానాలకు గాను.. భారాస 18 సాధించింది. కాంగ్రెస్‌కు కేవలం మూడు సీట్లే దక్కాయి. భాజపా సిటింగ్‌ స్థానమైన గోషామహల్‌ను మళ్లీ దక్కించుకోగా, ఎంఐఎం తన ఏడు స్థానాల్లో పట్టు నిలుపుకొంది. కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి పోటీపడిన కామారెడ్డి స్థానం.. అనూహ్యంగా ఆ ఇద్దరినీ నిరాశపర్చింది. అక్కడ భాజపా అభ్యర్థి, ఉమ్మడి నిజామాబాద్‌ జడ్పీ మాజీ ఛైర్మన్‌ కె.వెంకటరమణారెడ్డి.. ఆ ఇద్దరు దిగ్గజాలను ఓడించి జెయింట్‌ కిల్లర్‌గా గుర్తింపు పొందారు. 1983లో తొలిసారి సిద్దిపేటలో ఓటమి చవిచూసిన కేసీఆర్‌కు.. 40 ఏళ్ల ప్రస్థానంలో ఇది రెండో ఓటమి కావడం గమనార్హం. సీపీఐ పోటీ చేసిన ఏకైక స్థానం కొత్తగూడెంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. కుత్బుల్లాపూర్‌లో భారాస అభ్యర్థి కె.పి.వివేకానంద 85,576 ఓట్ల తేడాతో ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. అత్పల్ప మెజార్టీ కూడా భారాసాయే నమోదు చేసింది. చేవెళ్లలో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి కేవలం 268 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

ఆది నుంచీ ఆధిక్యంలో కాంగ్రెస్‌

ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్‌ ఆధిక్యాన్ని కనబరిచింది. రెండుసార్లు అధికారమిచ్చిన భారాసను మార్చాలనే అభిప్రాయంతోపాటు.. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ఓటర్లపై ప్రభావం చూపినట్లు స్పష్టమవుతోంది. భారాసకు చెందిన సీనియర్‌ నాయకులు ఓటమి పాలయ్యారు. పరాజయమే ఎరుగని నేతలను.. తొలిసారిగా బరిలోకి దిగిన కాంగ్రెస్‌ యువ అభ్యర్థులు మట్టి కరిపించారు. భారాస కంచుకోటలుగా భావించిన నియోజకవర్గాలను కాంగ్రెస్‌ బద్దలు కొట్టింది. గత నాలుగైదు ఎన్నికల్లో ఎప్పుడూ గెలవని స్థానాలు కూడా ఇప్పుడు హస్తానికి చిక్కాయి. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సీనియర్‌ నాయకుల్లో అత్యధికులు విజయం సాధించారు. ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్‌ ఆధిక్యం ప్రదర్శించింది. పోస్టల్‌ బ్యాలెట్‌లో ఆ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం కనిపించింది. ఆ తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలైంది. అనేక స్థానాల్లో కాంగ్రెస్‌, భారాస, భాజపా అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ ఏర్పడింది. 10 మందికి పైగా అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఫలితాల సరళి చూసి కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంది. పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగాయి. గాంధీభవన్‌లో పెద్దఎత్తున ఉత్సవాలు జరిపారు.

ఫలించని భారాస వ్యూహాలు

భారాస అభ్యర్థులను మూడు నెలల ముందుగానే ప్రకటించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లేలా చూడటం, ఇతర పార్టీలు అందుకోలేనంతగా ఆ పార్టీ ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది. 119 స్థానాల్లోనూ పోటీ చేసిన భారాస.. 80 చోట్ల ఓడిపోయింది. ఆ పార్టీకి చెందిన మంత్రుల్లో కేటీఆర్‌, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సబితారెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్‌లు గెలిచారు. ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌లు పరాజయం పాలయ్యారు. మూడోవంతు నియోజకవర్గాలకు సరైన అభ్యర్థులే లేరనుకొన్న కాంగ్రెస్‌.. కొన్నిచోట్ల ఇతర పార్టీల నుంచి గట్టి అభ్యర్థులను చేర్చుకొని పోటీకి నిలపడంతో ఆ పార్టీ నాలుగైదు చోట్ల మినహా మిగిలిన అన్ని స్థానాల్లోనూ హోరాహోరీగా పోరాడింది. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన సీపీఐ కొత్తగూడెం స్థానాన్ని దక్కించుకోగా, 108 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ, 19 స్థానాల్లో పోటీ చేసిన సీపీఎంలు అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయాయి. భాజపా.. గత రెండు ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సాధించింది. 2014లో అయిదు, 2018లో ఒక స్థానంలో మాత్రమే గెలిచిన ఆ పార్టీ బలం ఈసారి 8 స్థానాలకు పెరిగింది.

ఏ పార్టీ ఏ స్థానంలో నిలిచిందంటే..

  • 39 సీట్లు గెలిచిన భారాస 65 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. 13 చోట్ల మూడో స్థానంలో, మలక్‌పేట, యాకుత్‌పుర నియోజకవర్గాల్లో నాలుగోస్థానంలో ఉంది.
  • 64 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌ 26 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. 25 చోట్ల మూడో స్థానానికి, సిర్పూర్‌, చాంద్రాయణగుట్ట, కార్వాన్‌లలో నాలుగో స్థానానికి, బహదూర్‌పురలో అయిదో స్థానానికి పరిమితమైంది.
  • ఎనిమిది నియోజకవర్గాలను గెలుచుకున్న భాజపా 14 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన 97 సీట్లలో మూడు, నాలుగు, అయిదు, ఆరో స్థానాల్లో ఉంది.


వీవీ ప్యాట్ల లెక్కింపుతో ‘గంగుల’ గెలుపు ప్రకటన

రీంనగర్‌ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఉద్రిక్తతకు దారితీసింది. మొత్తం 25 రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భారాస అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌.. భాజపా అభ్యర్థి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ల మధ్య స్వల్ప తేడానే కొనసాగింది. గంగులకు ఒక దశలో 10 వేల పైచిలుకు ఆధిక్యం ఉండగా.. 24వ రౌండ్‌కు అది 4,648కి తగ్గింది. ఇంకా 25వ రౌండ్‌ లెక్కించాల్సి ఉండటంతో ఇరు పార్టీల్లోనూ ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే బండి సంజయ్‌ లెక్కింపు కేంద్రానికి వెళ్లి రీ కౌంటింగ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మొరాయించిన 43, 289 పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంల ఓట్లను లెక్కించాలని పట్టుబట్టారు. దీంతో ఎన్నికల అధికారులు ఆ ఈవీఎంలను సాంకేతిక సహాయకుల సాయంతో తెరిచే ప్రయత్నం చేశారు. తరువాత ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆ రెండు కేంద్రాల్లోని వీవీప్యాట్‌ ఓటరు స్లిప్‌లను లెక్కించారు. తపాలా ఓట్లు గంగుల కమలాకర్‌కు 950 రాగా.. సంజయ్‌కు 2,661 వచ్చాయి. మొత్తంగా 3,163 ఓట్లతో గంగుల కమలాకర్‌ విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.


తెలంగాణ శాసనసభ ఎన్నికల యుద్ధంలో ప్రజలే విజయం సాధించారు. హామీలన్నింటినీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. గెలుపోటములతో సంబంధం లేకుండా సిద్ధాంతపరమైన పోరాటం కొనసాగిస్తాం.

రాహుల్‌ గాంధీ


కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు ఇచ్చిన విజయాన్ని అమరవీరులకు అంకితం చేస్తున్నాం. 30 లక్షల మంది నిరుద్యోగుల పట్టుదల ఈ విజయంలో ఇమిడి ఉంది. వారందరికీ కృతజ్ఞతలు. మిత్రుడు భట్టి విక్రమార్కతోపాటు సీనియర్‌ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి, దామోదర రాజనర్సింహా, వి.హనుమంతరావు, శ్రీధర్‌బాబు, మధుయాస్కీ తదితరుల సహకారంతో విజయం సాధించాం. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, పేదలను ఆదుకోవడానికి, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే ప్రజలు ఈ విజయాన్ని పార్టీకి కట్టబెట్టారు.

రేవంత్‌రెడ్డి


రాష్ట్రంలో సంపద కొంత మంది చేతుల్లోకి వెళ్లడం సహించని ప్రజలు ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరతాం.

భట్టి


ఓటర్లకు ధన్యవాదాలు

  - కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే

తెలంగాణలో తమ పార్టీకి అవకాశం కల్పిస్తూ తీర్పు ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో కాంగ్రెస్‌కు ఓటు వేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ఆ 3 రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలు నిరుత్సాహపరిచాయి. మరింత దృఢ నిశ్చయంతో ఆ రాష్ట్రాల్లో పుంజుకోవడానికి కృషి చేస్తాం. ‘ఇండియా’ కూటమితో కలిసివచ్చే వారితో లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతాం.  


చరిత్ర సృష్టించిన తెలంగాణ ప్రజలు

- కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక      

శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టించారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. రాష్ట్రంలో శాంతి, శ్రేయస్సు, అభివృదికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు తమకు ఇచ్చిన ప్రతిపక్ష స్థానాన్ని సగౌరవంగా అంగీకరిస్తున్నాం.  


కొత్త ప్రభుత్వానికి  నిర్మాణాత్మక సహకారం

- జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా అందజేస్తాం. తెలంగాణలో విజయం సాధించిన భాజపా అభ్యర్థులకు శుభాకాంక్షలు. అత్యధిక స్థానాలు కైవసం చేసుకొన్న కాంగ్రెస్‌ నాయకత్వానికి ప్రత్యేక  అభినందనలు.


ఇది గొప్ప తీర్పు

-కూనంనేని

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: తెలంగాణ తాజా ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు చాలా గొప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం నియోజకవర్గ విజేత కూనంనేని సాంబశివరావు అన్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆదివారం ఓట్ల లెక్కింపు తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘భారాస పాలనలో అరాచకత్వం, నిరంకుశత్వం హద్దులు దాటింది. ఇది ప్రజల మనోభావాల్ని దెబ్బతీసింది.   ఉద్యమ నేతగా కేసీఆర్‌ నాడు అధికారంలోకి వచ్చారు. అది మరిచి ప్రజా ఉద్యమాలను అణచివేయడం దుర్మార్గం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపికైన ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులను ధనంతో కొనుగోలు చేసే సంస్కృతికి కేసీఆర్‌ తెరలేపారు. ఎప్పటికైనా ధనస్వామ్యంపై ప్రజాస్వామ్యానిదే విజయమని ప్రజలు నిరూపించార’ని కూనంనేని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని