లోక్‌సభలో సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ బిల్లు

విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Published : 05 Dec 2023 05:58 IST

ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
ఏడేళ్లలో రూ.889 కోట్ల వ్యయం

ఈనాడు, దిల్లీ: విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర యూనివర్సిటీల జాబితాలో ఈ విశ్వవిద్యాలయం పేరును చేర్చుతూ ఇప్పుడున్న చట్టానికి సవరణ ప్రతిపాదించారు. ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడంలో భాగంగా తెలంగాణలో ఈ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఉద్దేశాలు, లక్ష్యాల్లో పేర్కొంది. ‘‘సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం వల్ల అక్కడి ప్రజలకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుంది. గిరిజన కళలు, సంస్కృతి, సంప్రదాయాలపై పరిశోధనలు చేయడానికి, ఈ విషయాల్లో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడానికి ఇది బాటలు వేస్తుంది. గిరిజనుల చదువులపై దృష్టి సారించడంతోపాటు కేంద్ర విశ్వవిద్యాలయాలు చేసే ఇతర కార్యకలాపాలనూ ఈ వర్సిటీ నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం ఈ గిరిజన వర్సిటీని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది’’ అని వివరించింది. ఇందుకోసం 2009 సెంట్రల్‌ యూనివర్సిటీల చట్టాన్ని సవరించి అందులో ‘సమ్మక్క సారక్క సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ’ పేరును చేర్చుతున్నట్లు వెల్లడించింది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం  ఏడు సంవత్సరాలలో రూ.889.07 కోట్లు ఖర్చు చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు