KCR: తుగ్లక్‌ రోడ్‌ నివాసంతో తెగిన కేసీఆర్‌ బంధం!

దేశ రాజధాని దిల్లీలోని 23, తుగ్లక్‌ రోడ్‌లో ఉన్న అధికార నివాసంతో మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఉన్న దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం తెగిపోయింది.

Updated : 05 Dec 2023 07:50 IST

 ఖాళీ చేసేందుకు సన్నాహాలు

ఈనాడు, దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని 23, తుగ్లక్‌ రోడ్‌లో ఉన్న అధికార నివాసంతో మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఉన్న దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం తెగిపోయింది. 2004లో తెరాస తరఫున కరీంనగర్‌ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన కేసీఆర్‌.. మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి హోదాలో ఆయనకు తుగ్లక్‌ రోడ్‌లోని టైప్‌ 8 క్వార్టర్‌ను ప్రభుత్వం కేటాయించింది. 2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. ఉపఎన్నికలో మళ్లీ ఎంపీగా నెగ్గి అదే నివాసంలో కొనసాగారు. 2009లో మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా ఎన్నికై అదే క్వార్టర్‌లో ఉన్నారు. 2014లో కేసీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం దిల్లీలో అధికారిక నివాసాలు కేటాయిస్తుంది. ఇందులో భాగంగా అదే నివాసాన్ని కేసీఆర్‌కు కేటాయించింది. అదే సమయంలో నిజామాబాద్‌ ఎంపీగా గెలుపొందిన కేసీఆర్‌ కుమార్తె కవిత సైతం ఆ నివాసాన్నే తన అధికారిక నివాసంగా ఎంచుకున్నారు. అలా ఆ క్వార్టర్‌ ముఖ్యమంత్రికి, ఎంపీ కవితకు.. అధికారిక నివాసంగా మారింది. 2018లో కేసీఆర్‌ రెండో దఫా ముఖ్యమంత్రి అయ్యాక అదే నివాసాన్ని కొనసాగించారు. ప్రస్తుత ఎన్నికల్లో భారాస ఓటమితో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  దిల్లీలోని ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేస్తామని, అందుకు రెండుమూడు రోజులు సమయం కావాలని అధికారులకు భారత రాష్ట్ర సమితి వర్గాలు ఇప్పటికే నివేదించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని