Revanth Reddy: తుపానుపై అప్రమత్తంగా ఉండాలి: అధికారులకు రేవంత్‌ సూచనలు

మిగ్‌ జాం తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా చూడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనలో సూచించారు.

Updated : 06 Dec 2023 08:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: మిగ్‌ జాం తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా చూడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఓ ప్రకటనలో సూచించారు. లోతట్టు, ఏజెన్సీ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ‘పలు ప్రాంతాల్లో కుప్పపోసిన ధాన్యం తడిసిపోయే అవకాశం ఉందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ధాన్యం తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు దృష్టిపెట్టాలి. ఎక్కడికక్కడ రైతులకు అండగా నిలిచి అవసరమైన సహాయ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మూడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, నల్గొండ, యాదాద్రి, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. భారీ వర్ష సూచన ఉన్నందున ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేయాలి.  పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి ఆహారం, సురక్షిత నీరు అందేలా చూడాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. విద్యుత్‌, రహదారులు దెబ్బతినే పక్షంలో వెంటనే పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలి’’ అని రేవంత్‌రెడ్డి ఆ ప్రకటనలో సూచనలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లను మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని