Revanth Reddy: ఇటు ఎమ్మెల్యేలు.. అటు అధిష్ఠానం అండ!

ఇటు మెజార్టీ ఎమ్మెల్యేలు.. అటు కాంగ్రెస్‌ అధిష్ఠానం అండగా నిలవడంతో ముఖ్యమంత్రి పదవి విషయంలో రేవంత్‌రెడ్డికి పెద్దగా అవరోధాలు ఎదురుకాలేదు.

Updated : 06 Dec 2023 09:40 IST

సీఎం రేసులో ముందు నిలిచిన రేవంత్‌
ఆయన పేరునే సూచించిన రాహుల్‌ గాంధీ
పెద్దగా అవరోధాలు లేకుండానే ఖరారు
పోటీ పడిన భట్టి, ఉత్తమ్‌లను సముదాయించిన అగ్రనేతలు
ప్రభుత్వంలో ప్రాధాన్యమిస్తామని భరోసా

ఈనాడు, హైదరాబాద్‌: ఇటు మెజార్టీ ఎమ్మెల్యేలు.. అటు కాంగ్రెస్‌ అధిష్ఠానం అండగా నిలవడంతో ముఖ్యమంత్రి పదవి విషయంలో రేవంత్‌రెడ్డికి పెద్దగా అవరోధాలు ఎదురుకాలేదు. సీఎల్పీ మాజీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలు పోటీ పడినా.. ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కృషి, రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం, పీసీసీ అధ్యక్షుడిగా స్టార్‌ క్యాంపెయినర్‌గా ముమ్మరంగా పర్యటించడం, భారాసను దీటుగా ఎదుర్కోవడం లాంటి అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఈయన వైపే మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది.

👉 Follow EENADU WhatsApp Channel

పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ స్వయంగా రేవంత్‌ పేరును సూచించగా.. ఇతరులూ ఆమోదించినట్లు తెలుస్తోంది. ఆది నుంచీ పోటీలో మిగిలిన వారికంటే రేవంత్‌రెడ్డి ముందున్నారు. అభ్యర్థుల ఎంపికలో తన ముద్ర ఉండేలా చూసుకోవడం, ఇతర పార్టీల్లోని ముఖ్యులను కాంగ్రెస్‌లోకి వచ్చేలా చేయడంతోపాటు వారికి టికెట్లు ఇప్పించడం.. ఇలా అన్ని విషయాల్లో దూకుడుగా వ్యవహరించారు.

సీనియర్ల అభ్యంతరాలు

ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్‌ అధిష్ఠానం డి.కె.శివకుమార్‌ నేతృత్వంలో నియమించిన పరిశీలకుల బృందం హైదరాబాద్‌లో సోమవారం సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం అంతా సజావుగా సాగుతుందనుకొన్న సమయంలో.. ఆ సమావేశానికి ముందుగానే కొందరు సీనియర్‌ నాయకులు విడిగా డీకేను కలిశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్‌లోనే పనిచేస్తూ విజయానికి కష్టపడిన తమ అభ్యర్థిత్వాలను కూడా సీఎం పదవికి పరిశీలించాలని కోరారు. దీంతో పాటు రేవంత్‌రెడ్డితో సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడయ్యాక.. ముందు నుంచీ ఉన్న సీనియర్‌ నాయకులు చాలా విషయాల్లో ఆయనను వ్యతిరేకిస్తూ వచ్చారు. తమను సంప్రదించకుండానే, పరిగణనలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారని పలు సందర్భాల్లో ఫిర్యాదులు చేశారు కూడా. డీకేతో భేటీ అయిన నాయకులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. భట్టి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి రేసులో నిలవగా, వీరితోపాటు డీకేను కలిసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తమకున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. తర్వాత జరిగిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ తీర్మానం చేయడంతోపాటు ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలు తీసుకున్నారు. 30 మందికి పైగా ఎమ్మెల్యేలు నేరుగా రేవంత్‌రెడ్డి పేరు చెప్పగా, మిగిలిన వారిలో ఎక్కువ మంది ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని పేర్కొన్నట్లు తెలిసింది. భట్టి, ఉత్తమ్‌ పేర్లను కొద్ది మంది మాత్రమే చెప్పినట్లు సమాచారం.

దిల్లీలోనూ ప్రయత్నాలు

సీఎల్పీ సమావేశానికి ముందు నాయకులతో చర్చించిన అంశాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు వేర్వేరుగా వ్యక్తం చేసిన అభిప్రాయాలతో కూడిన నివేదికను పరిశీలకులు అధిష్ఠానానికి అందజేశారు. దీనిపై అధిష్ఠానం నిర్ణయం వెంటనే చెప్పకుండా.. పరిశీలకులను దిల్లీకి పిలిపించింది. సోమవారం రాత్రి చర్చించిన తర్వాత కూడా ఓ నిర్ణయానికి రాకపోవడంతో మంగళవారం మళ్లీ సమావేశమయ్యారు. ఇదే సమయంలో భట్టి, ఉత్తమ్‌లు దిల్లీ వెళ్లి ఏఐసీసీ నాయకులను కలిసి తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని కోరినట్లు తెలిసింది. రేవంత్‌రెడ్డి మాత్రం హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్‌లోనే ఉండిపోయారు. మంగళవారం మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌, పరిశీలకులు డీకే, ఠాక్రేలు సమావేశమయ్యారు. రేవంత్‌రెడ్డి పేరునే ఖరారు చేయాలని రాహుల్‌గాంధీ సూచించగా.. మిగిలిన వారు కూడా రేవంత్‌వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. తర్వాత కేసీ వేణుగోపాల్‌, డీకే, ఠాక్రేలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌లతో చర్చించారు. అధిష్ఠానం నిర్ణయాన్ని వారికి తెలిపారు. ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. అనంతరం ఉత్తమ్‌, భట్టిల సమక్షంలోనే రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా నిర్ణయించినట్లు.. 7న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు