Revanth Reddy: మాటల్లో ధాటి... వ్యూహాల్లో మేటి

తూటాల్లాంటి మాటలు.. సూటిగా, కుండబద్దలు కొట్టినట్లుండే ప్రసంగాలు.. ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవడంలో దూకుడు.. కార్యకర్తలు, నాయకులను ముందుకు నడపడంలో నాయకత్వ పటిమ.. ఇవన్నీ ఆయన ప్రత్యేకతలు.

Updated : 06 Dec 2023 09:11 IST

దూకుడైన తత్వం.. ప్రత్యర్థులకు దీటైన రాజకీయం
కాకలు తీరిన నేతలున్న కాంగ్రెస్‌లో అంచెలంచెలుగా ప్రస్థానం
పార్టీలో చేరిన ఆరేళ్లలోనే సీఎం పదవి సొంతం చేసుకొన్న రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: తూటాల్లాంటి మాటలు.. సూటిగా, కుండబద్దలు కొట్టినట్లుండే ప్రసంగాలు.. ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవడంలో దూకుడు.. కార్యకర్తలు, నాయకులను ముందుకు నడపడంలో నాయకత్వ పటిమ.. ఇవన్నీ ఆయన ప్రత్యేకతలు. కాకలు తీరిన నేతలు ఉన్న కాంగ్రెస్‌లో అనతికాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి పదవిని అందుకోగలిగారు రేవంత్‌రెడ్డి. పార్టీలో చేరిన ఆరేళ్లలోనే ఈ ఘనత సాధించడం విశేషం. 2017లో తెలుగుదేశాన్ని వీడి.. కాంగ్రెస్‌లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఎనుముల రేవంత్‌రెడ్డి స్వల్ప కాలంలోనే 2018లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదే ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొడంగల్‌లో బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. అయినా డీలా పడలేదు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి బరిలో దిగి విజయం సొంతం చేసుకున్నారు.

👉 Follow EENADU WhatsApp Channel

ఓవైపు లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతూనే.. రాష్ట్ర పార్టీలో ప్రత్యేకత చాటుకుంటూ వచ్చారు. అధిష్ఠానం అభిమానం చూరగొని 2021 జూన్‌ 26న పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. జులై 7న బాధ్యతలను స్వీకరించే నాటికే పార్టీలోని కీలక నేతల ఇళ్లకు వెళ్లి.. కలసి ముందుకెళ్దామనే సంకేతాలిచ్చారు. ఆయన తీరుపై సొంత పార్టీ నాయకులే కొందరు విమర్శలు చేసినా.. తనదైన పంథాలో ముందుకు సాగారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించారు.

గెలుపే లక్ష్యంగా ముందస్తు సమాయత్తం

2023 ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పార్టీని ఏడాదిన్నర ముందునుంచే సభలతో సమాయత్తం చేశారు. రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను గుర్తించారు. వాటికి కాంగ్రెస్‌ పరిష్కారాలను అందిస్తుందంటూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. 2022 మే 6న వరంగల్‌లో నిర్వహించిన రైతు డిక్లరేషన్‌ నుంచి కామారెడ్డిలో ఇటీవల నిర్వహించిన బీసీ డిక్లరేషన్‌ వరకు వేర్వేరు అంశాలపై పలు ప్రత్యేక హామీలను ప్రకటించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రతి కీలక కార్యక్రమానికి పార్టీ అగ్రనేతల్లో ఎవరో ఒకరు హాజరయ్యేలా చూశారు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌ సభకు రాహుల్‌ గాంధీ, హైదరాబాద్‌లో యూత్‌ డిక్లరేషన్‌ సభకు ప్రియాంకా గాంధీ, చేవెళ్లలో దళిత డిక్లరేషన్‌ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ సభకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య హాజరయ్యారు. తొలుత 13 రోజులపాటు నిర్వహించిన పాదయాత్ర.. వివిధ జిల్లాల్లో నిర్వహించిన సభలు పార్టీని విజయం దిశగా నడిపించాయి. నిరుద్యోగం, యువత సమస్యల విషయంలో ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించడం పార్టీకి ఉపకరించింది. ధరణి సమస్యలు సహా వివిధ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. పార్టీపరంగా 40 లక్షల డిజిటల్‌ సభ్యత్వాలు నమోదు చేయించారు.

సామాజిక మాధ్యమాల సద్వినియోగం

భారాస, భాజపాలకు దీటుగా పార్టీ వ్యూహాలను అమలు చేయడంలో రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. సామాజిక మాధ్యమాలను బలంగా ఉపయోగించుకున్నారు. వాటి ద్వారా ప్రత్యర్థుల విమర్శలకు దీటుగా స్పందించడం కాంగ్రెస్‌కు కలసివచ్చింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్‌ రూం ద్వారా వ్యూహాలను సమర్థంగా అమలు చేయగలిగారు. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలూ ప్రజల్లోకి బలంగా చేరేందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకున్నారు. భారాస ప్రభుత్వ తీరుపై విమర్శలు ప్రజల్లోకి చేరేందుకు ప్రత్యేక ప్రచార వ్యూహాలను అమలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారాస, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను శాసనసభ ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొని కాంగ్రెస్‌ను తెలంగాణలో తొలిసారిగా అధికారం దక్కేలా చేయడంలో రేవంత్‌రెడ్డి విజయవంతమయ్యారు.


ఏబీవీపీ నుంచి నాయకుడిగా ప్రస్థానం ప్రారంభం

ఈనాడు, మహబూబ్‌నగర్‌: రేవంత్‌రెడ్డి తండ్రి నరసింహారెడ్డి అప్పట్లో గ్రామానికి పోలీస్‌ పటేల్‌గా వ్యవహరించేవారు. తల్లి రామచంద్రమ్మ గృహిణి. వ్యవసాయ కుటుంబం. రేవంత్‌ హైస్కూల్‌ విద్య వనపర్తిలోని జడ్పీ బాలుర పాఠశాలలో కొనసాగింది. 1983-1985లో వనపర్తిలోనే ఇంటర్‌ బైపీసీ చదువుకున్నారు. రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ఏబీవీపీలో ప్రారంభమైంది. 1992 నుంచి చురుకైన కార్యకర్తగా పనిచేసేవారు. 2004లో కొంతకాలం భారాసలో పనిచేశారు. 2009లో కొడంగల్‌ నుంచి తెదేపా తరపున ఎమ్మెల్యే టికెట్‌ తెచ్చుకుని రాజకీయ కురువృద్ధుడు గుర్నాథ్‌రెడ్డిని ఓడించారు. అప్పట్లో రేవంత్‌ గెలుపు చర్చనీయాంశమైంది. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి తమ్ముడు పద్మనాభరెడ్డి కుమార్తె గీతను ఆయన ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. స్థిరాస్తి వ్యాపారంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.


అగ్రనేతల అభిమానం చూరగొని..

కాంగ్రెస్‌లో చేరిన కొద్దికాలంలోనే అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంకా గాంధీల అభిమానాన్ని రేవంత్‌ చూరగొన్నారు. తెలంగాణలో 21 రోజుల పాటు సాగిన రాహుల్‌ గాంధీ జోడోయాత్రను విజయవంతం చేయడం ఆయన రాజకీయంగా ఎదగడంలో దోహదం చేసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కృష్ణా వద్ద ప్రారంభమైన పాదయాత్ర నిజామాబాద్‌ జిల్లా మద్నూర్‌లో ముగిసేవరకు.. విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించారు.


పార్టీ సారథిగా తనదైన శైలి

తాజా ఎన్నికల్లో పార్టీకి సారథ్యం వహించేందుకు వచ్చిన అవకాశాన్ని రేవంత్‌రెడ్డి సద్వినియోగం చేసుకున్నారు. ఎన్నికలకు వెళ్లేనాటికి పార్టీలో అయిదు మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 64 మంది అభ్యర్థులు గెలిచి అధికారాన్ని దక్కించుకునే వరకు అలుపెరుగని కృషి చేశారు. గెలుపు అవకాశాలు ఉన్నవారికి టికెట్లు దక్కేలా చూశారు. టికెట్‌ దక్కనివారిని బుజ్జగించి.. అందరూ కలసికట్టుగా ముందుకు సాగేలా చూశారు. మొదటిసారిగా దాదాపు రెబెల్స్‌ ఎవరూ బరిలో లేకుండా ఎన్నికలకు వెళ్లడం విశేషం. జాతీయ నేతల ప్రచార కార్యక్రమాలు, సభలు ఒక ఎత్తైతే.. రేవంత్‌రెడ్డి సభలు మరో ఎత్తుగా నిలిచాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు మూడు, నాలుగు సభల చొప్పున 83 సభల్లో పాల్గొన్నారు.


కొండారెడ్డిపల్లి ముద్దు బిడ్డ

రాష్ట్రానికి కాబోయే నూతన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జన్మించారు. ఆయన జీవిత విశేషాలు ఇలా..

తల్లిదండ్రులు

ఎనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ

పుట్టిన తేదీ

నవంబరు 08, 1969

విద్యార్హతలు: డిగ్రీ (ఏవీ కళాశాల, హైదరాబాద్‌)

భార్య:  గీత

కుమార్తె:  నైమిషా రెడ్డి

నివాసం: జూబ్లీహిల్స్‌


రాజకీయ నేపథ్యం... పదవులు

2006: స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి మిడ్జిల్‌(ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా) జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నిక
2007-2009: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి)
2009-2014: ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ (కొడంగల్‌ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి నెగ్గారు)
2014: మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక (కొడంగల్‌ నుంచే తెదేపా అభ్యర్థిగా గెలుపు)
2014-2017: తెదేపా శాసనసభా పక్షనేత (తెలంగాణ శాసనసభ)
2017 అక్టోబరు: కాంగ్రెస్‌ పార్టీలో చేరిక
2018: శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొడంగల్‌ నుంచి పోటీ చేసి ఓటమి
2018: పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియామకం
2019 మే: మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా(కాంగ్రెస్‌) గెలుపు
2021 జూన్‌ 26: పీసీసీ అధ్యక్షుడిగా నియామకం


పార్లమెంటరీ కమిటీలు: రక్షణ శాఖ స్టాండింగ్‌ కమిటీ, కన్సల్టేటివ్‌ కమిటీ, పర్యావరణ మంత్రిత్వశాఖ, అటవీ, వాతావరణ మార్పు తదితర కమిటీలలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని