TS High Court: రోడ్డు ప్రమాదానికి డ్రైవర్‌ పక్కనున్న వ్యక్తీ కారణమంటే ఎలా..?

రోడ్డు ప్రమాద కారణాలను డ్రైవర్‌ పక్కన కూర్చున్న వ్యక్తికి ఆపాదించి బీమా పరిహారం సగానికి తగ్గించి ఇవ్వటాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

Updated : 06 Dec 2023 08:16 IST

రూ.29 లక్షల పరిహారాన్ని వడ్డీతో సహా చెల్లించాలి
బీమా కంపెనీకి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: రోడ్డు ప్రమాద కారణాలను డ్రైవర్‌ పక్కన కూర్చున్న వ్యక్తికి ఆపాదించి బీమా పరిహారం సగానికి తగ్గించి ఇవ్వటాన్ని హైకోర్టు తప్పుబట్టింది. పూర్తిస్థాయి పరిహారం రూ.29 లక్షలు చెల్లించాలని న్యూఇండియా అస్స్యూరెన్స్‌ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు ప్రమాదంలో తన భర్త మృతిచెందగా పరిహారాన్ని తగ్గిస్తూ మోటారు ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మెదక్‌కు చెందిన ఎ.సత్యవతి, మరొకరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ పి.శ్యాంకోశీ, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... 2013లో సత్యవతి భర్త సుబ్బారావు కారులో మచిలీపట్నం నుంచి హైదరాబాద్‌ వస్తుండగా డ్రైవర్‌ రోడ్డు పక్కన నిలిపి ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో మృతిచెందారన్నారు. రోడ్డు ప్రమాదానికి సుబ్బారావు కూడా కారణమని, అందువల్ల పరిహారాన్ని సగమే చెల్లించాలని ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.   వాదనలు విన్న ధర్మాసనం.. కారులో డ్రైవర్‌ పక్కన కూర్చున్న వ్యక్తికి డ్రైవింగ్‌లో నిర్లక్ష్యాన్ని ఎలా ఆపాదిస్తారని బీమా కంపెనీని ప్రశ్నించింది.   మొత్తం రూ.29 లక్షల పరిహారాన్ని 2013 నుంచి వడ్డీతో సహా చెల్లించాలని న్యూఇండియా అస్స్యూరెన్స్‌ కంపెనీని ఆదేశించింది. ఈ మేరకు పరిహారాన్ని సగానికి తగ్గిస్తూ జారీ చేసిన ట్రైబ్యునల్‌ ఉత్తర్వులను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని