Congress: పాక్షిక మంత్రివర్గమేనా?

రేవంత్‌రెడ్డితో పాటు గురువారం మధ్యాహ్నం మంత్రులుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. బుధవారం దిల్లీలో ఏఐసీసీ నాయకులతో సమావేశమైన రేవంత్‌రెడ్డి.. మంత్రివర్గం గురించి కూడా చర్చించినట్లు సమాచారం.

Updated : 07 Dec 2023 07:55 IST

సీఎంతో పాటు మరో 8 మంది!
పూర్తిస్థాయి క్యాబినెట్‌ మేలన్న అధిష్ఠానం

ఈనాడు హైదరాబాద్‌: రేవంత్‌రెడ్డితో పాటు గురువారం మధ్యాహ్నం మంత్రులుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. బుధవారం దిల్లీలో ఏఐసీసీ నాయకులతో సమావేశమైన రేవంత్‌రెడ్డి.. మంత్రివర్గం గురించి కూడా చర్చించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కాకుండా 17 మంది మంత్రులకు అవకాశం ఉండగా..  ప్రస్తుతం పాక్షికంగానే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక పూర్తిస్థాయిలోనా అన్నది బుధవారం రాత్రివరకు తేలలేదు.

ముఖ్యమంత్రితోపాటు మరో ఎనిమిది మంది మంత్రులు మొదట ప్రమాణ స్వీకారం చేయాలని.. తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించాలనే ప్రతిపాదన ఏఐసీసీ నాయకులు, రేవంత్‌రెడ్డి మధ్య జరిగిన చర్చల్లో వచ్చినట్లు తెలిసింది. కానీ అధిష్ఠానం మాత్రం పూర్తిస్థాయి మంత్రివర్గంతోనే వెళ్లమని సూచించినట్లు తెలిసింది. ఒకటి లేదా రెండు ఖాళీలు ఉంచి మిగిలినవి భర్తీ చేస్తే మంచిదనే అభిప్రాయాన్ని ఏఐసీసీ అగ్రనాయకులు వ్యక్తం చేసినట్లు సమాచారం. బుధవారం రాత్రి వరకు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరు మినహా మంత్రుల జాబితా గవర్నర్‌ కార్యాలయానికి చేరలేదు.

ఆ మూడు జిల్లాలకు పెద్దపీట!

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాలకు పెద్దపీట వేయనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున మొదటి విడతలో ఆ జిల్లా నుంచి మరొకరికి అవకాశం ఉంటుందా లేదా చూడాల్సి ఉంది. ఒకవేళ అవకాశం ఉంటే జూపల్లి కృష్ణారావుకు ఛాన్సు దక్కవచ్చు. ఈ జిల్లా నుంచి రెండోసారి గెలిచిన దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యే పేరు కూడా వినిపిస్తోంది. ఖమ్మం జిల్లా నుంచి మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి నల్గొండ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేదా ఆయన సతీమణి పద్మావతి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు రాజగోపాల్‌రెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్‌ నుంచి సీతక్క, కొండా సురేఖ, ఉమ్మడి మెదక్‌ నుంచి దామోదర రాజనర్సింహా, నిజామాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డి, ఉమ్మడి కరీంనగర్‌ నుంచి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ ఉండనున్నట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి వివేక్‌ లేదా వినోద్‌, ప్రేమసాగర్‌ రావుల పేర్లు వినిపిస్తున్నాయి. ఎనిమిది మంది సీనియర్లకు మాత్రమే అవకాశం దక్కవచ్చు.

ఎవరికి ఏ శాఖ..?

ఎవరెవరికి ఏ శాఖ అనే విషయంలో కూడా ఇప్పటికే కొంత స్పష్టత వచ్చినట్లు చెబుతున్నారు. శ్రీధర్‌బాబుకు ఆర్థికశాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. స్పీకర్‌ పదవి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినా శ్రీధర్‌బాబు తిరస్కరించినట్లు తెలిసింది. భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతున్నా స్పష్టత రావాల్సి ఉంది. ఈయనను ఉప ముఖ్యమంత్రిగా నియమించి రెవెన్యూ లేదా మరో శాఖ కేటాయించే అవకాశముంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నీటిపారుదల శాఖ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉంచి మిగిలినవి భర్తీ చేయవచ్చనే అభిప్రాయాన్ని కూడా పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మొదటిసారిగా ఎన్నికైన వారికి, ఓడిపోయిన వారికి అవకాశం ఇవ్వొద్దని ఏఐసీసీ నాయకులు రేవంత్‌రెడ్డికి సూచించినట్లు తెలిసింది.

హైదరాబాద్‌లో రేవంత్‌కు అధికారుల స్వాగతం

దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన రేవంత్‌రెడ్డి బుధవారం రాత్రి 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. డీజీపీ రవిగుప్తా, సీఎస్‌ శాంతికుమారి సహా పలువురు ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయనకు అధికారికంగా ఏర్పాటు చేసే కాన్వాయ్‌ (వాహనశ్రేణి)ని సిద్ధం చేయగా.. రేవంత్‌ వారించారు. తాను ఇంకా ప్రమాణ స్వీకారం చేయనందున వద్దంటూ తనతోపాటు దిల్లీ నుంచి వచ్చిన మాణిక్‌రావ్‌ ఠాక్రేతో కలిసి సొంత వాహనంలో విమానాశ్రయం నుంచి బయలుదేరారు. కానీ భద్రతా కారణాలరీత్యా కాన్వాయ్‌ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తమదంటూ డీజీపీ తదితర అధికారులు వాహనశ్రేణితో రేవంత్‌ వాహనాన్ని అనుసరించారు. అనంతరం రేవంత్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బస చేసిన గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌కు వెళ్లి.. ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని