4.72 లక్షల ఎకరాల్లో పంట నష్టం

రాష్ట్రంలో మిగ్‌జాం తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షాలతో 4.72 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది.

Updated : 07 Dec 2023 07:24 IST

ఉమ్మడి ఖమ్మంలోనే 82 వేల ఎకరాల్లో..
మిగ్‌జాం ప్రభావంతో భారీ వర్షాలు
కుండపోత వానతో నేలవాలిన వరి
దెబ్బతిన్న మిర్చి, పత్తి, మొక్కజొన్న

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మిగ్‌జాం తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షాలతో 4.72 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. వానలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. ఆ జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. బుధవారం కురిసిన వర్షాలకు కూసుమంచి, నేలకొండపల్లి, వైరా, ఏన్కూరు, జూలూరుపాడు, సత్తుపల్లి, పెనుబల్లి, తల్లాడ, వెల్చూరు, అశ్వారావుపేట, దమ్మపేట, ఇల్లెందు, టేకులపల్లి తదితర మండలాల్లో వరి దెబ్బతింది. చింతకాని, ముదిగొండ, వైరా, కొత్తగూడెం, లక్ష్మిదేవిపల్లి, సుజాతనగర్‌లలో పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. వరంగల్‌ జిల్లాలో 12 మండలాల్లో, ములుగు జిల్లాలో నాలుగు, భూపాలపల్లిలో మూడు, కుమురం భీం ఆసిఫాబాద్‌లో నాలుగు, కరీంనగర్‌, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఆరేసి మండలాల్లో వరి పైర్లు నేలవాలగా.. పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో కోసి ఉన్న వరి పైరుతో పాటు కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. కొన్నిచోట్ల వరదనీటిలో ధాన్యం కొట్టుకుపోయింది.

భారీగా నష్టం

పంట నష్టాలను వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. వారి అంచనా ప్రకారం.. ఖమ్మం జిల్లాలో 53,903 మంది రైతులకు చెందిన 82,180 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. 58,397 ఎకరాల్లో వరి, 17,267 ఎకరాల్లో పత్తి, 17,267 ఎకరాల్లో మిర్చి, 5,252 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కొత్తగూడెం జిల్లాలో 7,450 మంది రైతులకు చెందిన 13,608 ఎకరాల్లో పంటకు నష్టం కలగగా.. వరి 8,816, మిర్చి 2,475, వేరుసెనగ 1602, మొక్కజొన్న 585, పత్తి 130 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలో 23,923, వరంగల్‌లో 20,391, హనుమకొండలో 19,282, ములుగులో 18,920, భూపాలపల్లిలో 18,321 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల రాఘవాపురం, వెంకటాపురం గ్రామాల్లో పంట నష్టాలను పరిశీలించేందుకు వెళ్లిన అధికారుల వద్దకు రైతులు వచ్చి నేలవాలిన మిర్చి, తడిసిన పత్తి పంటలను చూపిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ ఓ ప్రకటనలో కోరారు.

నేడూ వర్షాలు

మిగ్‌జాం తుపాను ప్రభావంతో రాష్ట్రంలో గురువారం ఆదిలాబాద్‌, కుమురం భీం, నిర్మల్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల(గంటకు 30-40 కి.మీ. వేగం)తో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. బుధవారం కుమురం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వానలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 22.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అత్యధికంగా 324.2 మిల్లీమీటర్లు నమోదైంది. కొత్తగూడెం జిల్లాలోని మద్దుకూరులో 307.8 మి.మీ, మల్కారంలో 254, అంకంపాలెంలో 238, నాగుపల్లిలో 227, పెంట్లంలో 225, కొత్తగూడెంలో 210, గరిమెళ్లపాడులో 180, సీతారామపురంలో 179, సీతారామపట్నంలో 179, భద్రాచలం 174, ఖమ్మం జిల్లా గంగారంలో 171, సదాశివపాలెంలో 171, గుబ్బగుర్తిలో 164, రావినూతలలో 159 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. లక్ష్మీదేవిపల్లి, వేంసూరు, జూలూరుపాడు, దుమ్ముగూడెం, సుజాతనగర్‌లలోనూ 100 మిల్లీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైంది.

కష్టమంతా నేలపాలు

పంట కోతల సమయంలో వర్షాల కారణంగా కష్టమంతా నేలపాలైందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 42 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. మిగిలిన 58 శాతం ఈ నెల రెండో వారంలోగా పూర్తి కావాల్సి ఉంది. ఈ లోపే వర్షాలు కురవడంతో కోతలు నిలిచిపోయాయి. మిర్చి కాయలు, పత్తి రాలిపోతున్నాయి. మొక్కజొన్న కర్రలు నేలవాలుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వాపురం మండలం భీమవరంలో చలి కారణంగా 20 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. పలు కుంటలు, చెరువులకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని