ప్రమాణ స్వీకారానికి రండి..

హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని పీసీసీ అధ్యక్షుడు, కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు బుధవారం బహిరంగ లేఖ రాశారు.

Updated : 07 Dec 2023 07:09 IST

 ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు
అమరుల కుటుంబాలు, ప్రజాసంఘాలు సహా పలువురికి ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని పీసీసీ అధ్యక్షుడు, కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు బుధవారం బహిరంగ లేఖ రాశారు. బలహీనవర్గాలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, రైతులు, మహిళలు, యువత కోసం సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన రాష్ట్రంలో అందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్యస్థాపనకు సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి గవర్నర్‌ తమిళిసై బుధవారం ఆమోదం తెలిపారు. గవర్నర్‌ కార్యాలయం సంబంధిత ప్రతిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, కాంగ్రెస్‌ పార్టీకి పంపించింది. ఎన్నికైన 64 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా రేవంత్‌రెడ్డిని ఎన్నుకున్నారని, ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని గవర్నర్‌ తమిళిసైకి విన్నవించేందుకు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఉపాధ్యక్షుడు మల్లు రవి, రోహిణ్‌ రెడ్డి తదితరులు అంతకుముందు రాజ్‌భవన్‌కు వెళ్లారు. సంబంధిత లేఖను గవర్నర్‌ కార్యదర్శి సురేంద్రమోహన్‌కు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు మొత్తం 64 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌ కార్యాలయంలో అందజేసినట్లు చెప్పారు. ఈ లేఖను ప్రాతిపదికగా చేసుకుని.. గవర్నర్‌ ఆమోదం తెలిపారు. దీంతో ఉన్నతాధికారులు లాల్‌బహదూర్‌ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వపరంగా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు.

ప్రముఖులకు ఆహ్వానాలు

కాంగ్రెస్‌ పార్టీ పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులను ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించింది. వారికి బుధవారం గాంధీభవన్‌ నుంచి ఆహ్వానాలు పంపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, ఆ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు విచ్చేయనున్నారు. వీరితో పాటు పలు రాష్ట్రాల పలువురు ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వాన పత్రాలు పంపించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులను ఆహ్వానించారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, ఆచార్య హరగోపాల్‌, కంచె ఐలయ్యతో పాటు సినీ ప్రముఖులు, వివిధ కులసంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, తెలంగాణ అమరుల, ఉద్యమకారుల కుటుంబాలనూ ఆహ్వానించారు.

వీక్షణకు మూడు ఎల్‌ఈడీ తెరలు

ప్రముఖులు వచ్చే మార్గాలు, వాహనాలు నిలిపే ప్రదేశాలను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బషీర్‌బాగ్‌, అబిడ్స్‌, పబ్లిక్‌గార్డెన్స్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సుమారు 1.30 లక్షల మంది హాజరవుతారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎల్‌బీ స్టేడియం సామర్థ్యం 30 వేల వరకే ఉన్నందున పెద్దసంఖ్యలో ప్రజలు బయట వేచి ఉండే అవకాశాలున్నాయి. వారంతా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు మూడు పెద్ద ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నారు. ‘భారీగా జనం హాజరైనా, అనుకోకుండా వర్షం కురిసినా.. ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశాం. ఇతర జిల్లాల నుంచి కూడా పోలీసు బలగాలను   రప్పిస్తున్నాం’ అని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు.

 రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు బాధ్యతలు స్వీకరించనున్న రేవంత్‌రెడ్డికి తెదేపా రాష్ట్ర నేతలు అభినందనలు తెలిపారు. ఎనుముల రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథంలో ముందుకు వెళుతుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు, అరవింద్‌కుమార్‌గౌడ్‌ ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని