పోలీసుశాఖ ప్రక్షాళన ఖాయం!

పదేళ్ల భారాస ప్రభుత్వం రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి పోలీసుశాఖకు మౌలిక వసతులు కల్పించినా పరిపాలనాపరమైన విషయాల్లో అలసత్వం ప్రదర్శించిందన్న వాదన ఉంది.

Updated : 07 Dec 2023 09:12 IST

డీజీపీని కొనసాగించే అవకాశం
విజిలెన్స్‌లో కీలక మార్పులు
రాజధానిపై ప్రత్యేక దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: పదేళ్ల భారాస ప్రభుత్వం రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి పోలీసుశాఖకు మౌలిక వసతులు కల్పించినా పరిపాలనాపరమైన విషయాల్లో అలసత్వం ప్రదర్శించిందన్న వాదన ఉంది. కొందరు అధికారులను ఏళ్ల తరబడి ఒకే చోట కొనసాగించడం, ఇంకొందరికి సుదీర్ఘకాలంపాటు ఎక్కడా పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం, మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగించడం వంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువు తీరనున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మొత్తంగా పోలీసుశాఖను సంస్కరించవచ్చని తెలుస్తోంది...

శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయన్న ఉద్దేశంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పటి ప్రభుత్వం పోలీసుశాఖపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. రూ.కోట్లు ఖర్చుపెట్టి వందలాది వాహనాలు కొనుగోలు చేసింది. పోలీస్‌స్టేషన్లు, కార్యాలయాలను ఆధునికంగా తీర్చిదిద్దింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే విషయంలో తెలంగాణ పోలీసులు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నారు. ‘షి’ బృందాలు, భరోసా కేంద్రాలు, తెలంగాణ రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ, యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరోల ఏర్పాటు వంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. రూ.600 కోట్లతో అత్యాధునికంగా నిర్మించిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ రాష్ట్ర పోలీసుశాఖకే తలమానికం. కానీ మౌలిక వసతులపై పెట్టినంతగా పోలీసు పరిపాలనపై మాత్రం దృష్టి సారించలేదు. ఫలితంగా అధికారులు ఏళ్ల తరబడి ఒకే స్థానంలో కొనసాగేవారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులను రెండేళ్లకోసారి మార్చాలి. కానీ అనేక మంది అధికారులు అయిదారేళ్లపాటు ఒకే పోస్టులో ఉన్నారు. పోలీసుశాఖలో రాజకీయ జోక్యం మితిమీరిందని ఆరోపణలు వినిపించేవి. కొత్తగా అధికారం చేపడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ విషయాలపై దృష్టి పెడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు మూడోవంతు జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతోపాటు కీలక విభాగాల అధికారులను మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. డీజీపీ అంజనీకుమార్‌ను ఎన్నికల కమిషన్‌ సస్పెండ్‌ చేయడంతో ఆయన స్థానంలో నియమితులైన రవిగుప్తాను అదే స్థానంలో కొనసాగించే అవకాశం ఉంది. ఆయన తర్వాత రాజీవ్‌రతన్‌, సీవీ ఆనంద్‌, జితేందర్‌లకు డీజీపీ హోదా ఉంది.

వీరందరిలో రవిగుప్తా వైపే ప్రభుత్వం మొగ్గుచూపే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్‌ హైదరాబాద్‌ కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్‌ను కూడా తొలగించి ఆయన స్థానంలో సందీప్‌శాండిల్యను నియమించింది. ఎన్నికలప్పుడు శాండిల్య పనితీరును పలువురు ప్రశంసించారు. వచ్చే జూన్‌లో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. 2024 మే నెలలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. అప్పటికి ఆయన పదవీ విరమణకు ఒక నెల గడువు మాత్రమే ఉంటుంది. పదవీ విరమణకు దగ్గరలో ఉన్న అధికారులతో ఎన్నికలు నిర్వహించకూడదన్న నిబంధన నేపథ్యంలో సందీప్‌శాండిల్యను మార్చాల్సి ఉంటుంది. శాంతిభద్రతల పరంగా రాజధాని నగరం అత్యంత కీలకం. ఇక్కడ సమర్థులైన అధికారులను నియమించాల్సి ఉంది. నిఘా విభాగాన్ని అనుభవజ్ఞుడైన అధికారికి అప్పగించే అవకాశం ఉంది. వామపక్ష తీవ్రవాదంపై నిఘా ఉంచే స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి ఓఎస్డీగా ఉన్న ప్రభాకరరావు తన పదవికి రాజీనామా చేయడంతో అక్కడ కూడ మరో అధికారిని నియమించాలి. అవినీతి నిరోధకశాఖ (అనిశా) డీజీగా ఉన్న రవిగుప్తా... డీజీపీగా కొనసాగితే అనిశా బాధ్యత కూడా డీజీపీ స్థాయి అధికారికి అప్పగించాల్సి ఉంటుంది. విజిలెన్స్‌ను పటిష్ఠపరిచి, అధిపతిగా సమర్థుడైన అధికారిని నియమించవచ్చని భావిస్తున్నారు. సైబరాబాద్‌, రాచకొండ కమిషనర్లను ప్రస్తుతానికి కొనసాగించి, మిగతా కమిషనరేట్ల అధిపతులు, మెజారిటీ జిల్లాల ఎస్పీలను బదిలీ చేసే అవకాశం ఉంది. డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయిలో భారీగా కదలికలు ఉండవచ్చని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని