పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది.

Updated : 07 Dec 2023 05:53 IST

 30వ తేదీలోగా ఆర్‌ఓలు, సిబ్బందికి శిక్షణ పూర్తికావాలి
కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు

ఈనాడు,హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. అందుకు అనుగుణంగా ఈ నెల 30వతేదీలోపు రిటర్నింగ్‌ అధికారుల(ఆర్‌ఓ)తోపాటు పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది జాబితాను రూపొందించి, వారికి శిక్షణ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశిస్తూ కమిషన్‌ కార్యదర్శి అశోక్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని పంచాయతీల పాలక మండళ్ల కాల పరిమితి 2024 ఫిబ్రవరి 1వతేదీతో ముగుస్తుందని, పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం అంతకంటే మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బంది వివరాలు అందుబాటులో ఉన్నందున, ఈ ఎంపిక ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలని ఆదేశాలిచ్చారు.

ప్రతి 200 మంది ఓటర్లకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి

‘‘ప్రతి 200 మంది ఓటర్లకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఒక పోలింగ్‌ అధికారిని నియమించాలి. 201-400 మంది ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగు అధికారి, ఇద్దరు పోలింగ్‌ అధికారులు, 401 నుంచి 650 మంది ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ముగ్గురు పోలింగ్‌ అధికారులను నియమించాలి. నిర్ణీత సంఖ్యకు అదనంగా 20 శాతం సిబ్బందిని ఎంపిక చేయాలి.

  • ప్రతి వార్డులో విధిగా ఒక పోలింగ్‌ కేంద్రం ఉండాలి.
  • 650 మంది ఓటర్లు దాటితే రెండు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేయాలి.
  • పోలింగ్‌ అధికారులు, సిబ్బంది ఎంపిక కోసం టె-పోల్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించాలి.
  •  వారి పేరు, ఎంప్లాయి కోడ్‌, ఫోన్‌ నంబరు, హోదా, వేతన స్కేల్‌, సొంత మండలం, ప్రస్తుతం పనిచేస్తున్న చోటు తదితర వివరాలు అందులో పొందుపరచాలి’’ అని కమిషన్‌ కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని