ఉత్తమ పనితీరు కళాశాలలకు.. బ్రాంచ్‌ల ఏర్పాటుకు అనుమతి

ఇక ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కళాశాలలు సైతం ఆఫ్‌ క్యాంపస్‌ విధానంలో మరికొన్ని కళాశాలలను నడుపుకోవచ్చు.

Updated : 07 Dec 2023 05:53 IST

బీబీఏ, బీబీఎం, బీసీఏ కోర్సులకు ఏఐసీటీఈ సిలబస్‌
న్యాక్‌ పరిధిలోకి పాలిటెక్నిక్‌ కళాశాలలు
అనుమతులపై ఏఐసీటీఈ నిబంధనావళి విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: ఇక ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కళాశాలలు సైతం ఆఫ్‌ క్యాంపస్‌ విధానంలో మరికొన్ని కళాశాలలను నడుపుకోవచ్చు. సాధారణ పరిభాషలో చెప్పాలంటే బ్రాంచ్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే ఈ అనుమతిని మంచి పనితీరు కనబరిచే విద్యాసంస్థలకు మాత్రమే అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇవ్వనుంది. ఈమేరకు 2024-25 నుంచి 2026-27 విద్యా సంవత్సరం వరకు నిబంధనావళిని బుధవారం విడుదల చేసింది. ఇప్పటివరకు డీమ్డ్‌, ప్రైవేట్‌ వర్సిటీలకు మాత్రమే ఆఫ్‌ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉండేది. మార్గదర్శకాలకు లోబడి పనిచేసే కళాశాలలకూ ఈ వెసులుబాటు లభిస్తుంది. బ్రాంచ్‌లను అనుబంధ విశ్వవిద్యాలయం పరిధిలో మాత్రమే నెలకొల్పాలి. ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాల జేఎన్‌టీయూ-హెచ్‌ నుంచి గుర్తింపు పొందితే... రాష్ట్రంలో మరో ఆఫ్‌ క్యాంపస్‌ను పెట్టుకోవచ్చు. అదే ఓయూకు అనుబంధ కళాశాలగా ఉంటే హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్‌ జిల్లాల పరిధిలో మాత్రమే ప్రారంభించుకోవడానికి వీలవుతుంది. వచ్చే మూడు విద్యా సంవత్సరాలకు సంబంధించి అనుమతుల ప్రక్రియ ఈనెల 23వ తేదీ నుంచి మొదలై వచ్చే ఏప్రిల్‌కు ముగుస్తుంది.

ఆ కోర్సులకు ఏఐసీటీఈ సిలబస్‌...

బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (బీసీఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ), బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీబీఎం) కోర్సులకు వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచి ఏఐసీటీఈ అనుమతులు పొందాల్సిందేనని ఇటీవల ముసాయిదా నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా నిబంధనల హ్యాండ్‌బుక్‌లో మరింత స్పష్టతనిచ్చింది. ఆ కోర్సులకు ఏఐసీటీఈ కొత్త ఆదర్శ విద్యాప్రణాళికను విడుదల చేయనుంది. ఇప్పటివరకు యూజీసీ మార్గదర్శకాల మేరకు ఆయా వర్సిటీలు రూపొందించిన సిలబస్‌ను ఆ కోర్సులకు అమలు చేస్తుండగా...ఇకపై ఏఐసీటీఈ సిలబస్‌ను పాటించడం తప్పనిసరి. స్వయంప్రతిపత్తి హోదా ఉన్న కళాశాలలకు మాత్రం ఆ సిలబస్‌లో 20 శాతాన్ని తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఇకపై ఆ కోర్సులను నడిపే కళాశాలలు ఏఐసీటీఈ అనుమతి తీసుకోవాలి.

  మరికొన్ని ముఖ్యాంశాలివీ...

  •  ఇప్పటివరకు అండర్‌ గ్రాడ్యుయేట్‌, ఆపై కోర్సులు నడిపే కళాశాలలే న్యాక్‌ పరిధిలో ఉండేవి. ఇకపై పాలిటెక్నిక్‌ డిప్లొమా కళాశాలలు కూడా న్యాక్‌ గుర్తింపునకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే న్యాక్‌ గుర్తింపు తర్వాత స్వయంప్రతిపత్తి (అటానమస్‌) హోదా పొందొచ్చు.
  • ఉత్తమ పనితీరు కనబరుస్తున్న కళాశాలలకు కోర్సులు, సీట్ల పరిమితి విషయంలో మినహాయింపునిస్తారు. అందుకు ఆయా కళాశాలలకు అవసరమైన నాణ్యమైన మౌలిక వసతులు, అర్హులైన అధ్యాపకులు ఉండాలి. అటువంటి కళాశాలలకు మూడేళ్లపాటు అనుమతులు ఇస్తారు. అందుకు న్యాక్‌ ‘ఏ’ గ్రేడ్‌ లేదా 30 శాతం కోర్సులకు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌(ఎన్‌బీఏ) గుర్తింపు లాంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.
  •  ఇప్పటికే ఉద్యోగాలు చేస్తూ విద్యార్హతను పెంచుకోవాలనుకునే వారికోసం సాయంత్రం కోర్సులకు అనుమతినిస్తారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ విధానంలో వారు హాజరుకావచ్చు.
  •  ఏఐసీటీఈ అనుమతి తీసుకునే అన్ని కళాశాలలు ఒకేషనల్‌ కోర్సులను ప్రారంభించుకోవచ్చు. వాటికి ప్రత్యేకంగా అనుమతులు అవసరం లేదు.
  •  ఇన్నోవేషన్‌పై పూర్తి దృష్టి పెడతారు. అందుకే ప్రతి కళాశాలలో ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ (ఐఐసీ) ఏర్పాటు చేసుకోవాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని