సచివాలయంలో అధికార పీఠంపై..

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్‌రెడ్డి గురువారం సాయంత్రం సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

Published : 08 Dec 2023 05:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్‌రెడ్డి గురువారం సాయంత్రం సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. గురువారం సాయంత్రం 4.20 గంటలకు రేవంత్‌ సచివాలయానికి చేరుకున్నారు. ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, సచివాలయ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. సీఎంతో మాట్లాడడానికి, ఫొటోలు దిగడానికి సచివాలయ సిబ్బంది పోటీపడ్డారు. అందర్నీ పలకరిస్తూ, కరచాలనం చేస్తూ ఆయన కాలినడకనే వెళ్లారు. ప్రధాన ద్వారం వద్ద సీఎం రేవంత్‌రెడ్డికి వేద మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికారు.  సాయంత్రం 4.30 గంటలకు ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయానికి చేరుకున్నారు. సతీమణి గీతతో కలిసి పూజలు నిర్వహించారు. ముహూర్తం ప్రకారం 4.46 గంటలకు తన అధికార ఆసనంపై కూర్చుని.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. రేవంత్‌కు రెవెన్యూ ఉద్యోగుల ఐకాస, సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు తదితరులు పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని