శాసనసభాపతిగా గడ్డం ప్రసాద్‌కుమార్‌

తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్‌కుమార్‌ (59)ను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి ఆశావహుడిగా ఉన్న ఆయన్ను అధిష్ఠానం అనూహ్యంగా సభాపతి పదవికి ఎంపికచేసింది.

Updated : 08 Dec 2023 06:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా వికారాబాద్‌ కాంగ్రెస్‌ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్‌కుమార్‌ (59)ను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి ఆశావహుడిగా ఉన్న ఆయన్ను అధిష్ఠానం అనూహ్యంగా సభాపతి పదవికి ఎంపికచేసింది. స్పీకర్‌గా ఆయన పేరును గురువారం మంత్రుల పేర్లతోపాటు అధికారికంగా ప్రకటించింది. అధికార పార్టీకి సభలో 64 మంది ఎమ్మెల్యేల సాధారణ మెజారిటీ ఉన్న నేపథ్యంలో సభ నిర్వహణ కీలకంగా మారగా, అధిష్ఠానం అన్ని కోణాల్లో ఆలోచించి దళిత వర్గానికి చెందిన ప్రసాద్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ నేపథ్యం

వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 1964లో జన్మించిన ప్రసాద్‌కుమార్‌ తాండూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేశారు. 2008 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా వికారాబాద్‌ నుంచి పోటీచేసి భారాస అభ్యర్థి బి.సంజీవరావుపై గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు. 2009లో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన భారాస అభ్యర్థి చంద్రశేఖర్‌పై విజయం సాధించి రెండో దఫా ఎమ్మెల్యే అయ్యారు. 2009లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో చేనేత, లఘు పరిశ్రమలశాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్‌ మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఏర్పడిన మంత్రివర్గంలో, 2012లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలోనూ అదే మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్వర్తించారు. 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో ఆయన భారాస అభ్యర్థులు సంజీవరావు, మెతుకు ఆనంద్‌ చేతిలో ఓడిపోయారు. 2022లో టీపీసీసీ కార్యనిర్వాహక కమిటీ సభ్యునిగా నియమితులయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో భారాస సిటింగ్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌పై 12,893 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

ఎన్నిక లాంఛనమే

ఈ వారంలోనే శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రొటెం స్పీకర్‌ ముందుగా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం శాసనసభాపతి, ఉపసభాపతిల ఎన్నిక జరుగుతుంది. కాంగ్రెస్‌కు 64 సభ్యుల బలం ఉండగా, మిత్రపక్షమైన సీపీఐకి ఒక స్థానం ఉంది. మెజారిటీ స్పష్టంగా ఉన్నందున ఆయన ఎంపిక లాంఛనప్రాయం కానుంది.


మూడుసార్లు ఎమ్మెల్యే.. మంత్రిగా అనుభవం

మూడు దఫాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం దృష్ట్యా ఆయన అన్ని విధాలా సభాపతి పదవికి అర్హుడని అధిష్ఠానం భావిస్తోంది. ఆ ప్రకారం సభాపతిగా ఆయన ఎన్నికయ్యే పక్షంలో తెలంగాణ శాసనసభలో తొలి దళిత స్పీకర్‌ అవుతారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999 నుంచి 2004 వరకు ప్రతిభా భారతి శాసనసభాపతిగా పనిచేశారు. ఆ తర్వాత ఆ అవకాశం ప్రసాద్‌కే దక్కుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు