పాలకులం కాదు.. సేవకులం

‘మేం పాలకులం కాదు.. సేవకులం. ఈ రోజు నుంచి విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది’ అని నూతన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated : 08 Dec 2023 07:23 IST

ప్రగతి భవన్‌ కంచెలు బద్దలు కొట్టాం
అది ఇకపై ‘జ్యోతిరావు ఫులే ప్రజాభవన్‌’
శుక్రవారం అక్కడ ప్రజాదర్బార్‌ నిర్వహిస్తాం
ముఖ్యమంత్రిగా తొలి ప్రసంగంలో రేవంత్‌రెడ్డి
ఈనాడు - హైదరాబాద్‌

‘మేం పాలకులం కాదు.. సేవకులం. ఈ రోజు నుంచి విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది’ అని నూతన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘ప్రగతిభవన్‌ పేరును జ్యోతిరావు ఫులే ప్రజాభవన్‌గా మార్చాం. ఈ రోజే దాని చుట్టూ ఉన్న ఇనుప కంచెలను తొలగించాం. రేపు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు అదే భవనంలో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తాం. ఈ నిర్ణయానికి మీరందరూ పెద్దఎత్తున ఆమోదం తెలపాలని, చప్పట్లతో స్వాగతం పలకాలని కోరుతున్నాను. ఎన్నో ఆకాంక్షలను, ఆలోచనలను గుర్తించి, తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు స్వేచ్ఛనివ్వాలని, సామాజికన్యాయం చేయాలన్న సదాశయంతో సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో, కాంగ్రెస్‌ పార్టీ సమిధగా మారుతుందని తెలిసినా.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్‌ నుంచి అలంపూర్‌ వరకు, ఖమ్మం నుంచి కొడంగల్‌ వరకు సమానమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. కానీ గత దశాబ్ద కాలంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, మానవ హక్కులకు భంగం కలిగి ప్రజలు తమ బాధలు చెప్పుకోవాలంటే ప్రభుత్వం తరఫున వినేవాళ్లు లేకపోయారు. ఆ బాధలన్నీ మౌనంగా భరించిన ప్రజలు ఉక్కు సంకల్పంతో ప్రజాపరిపాలన కోసం కాంగ్రెస్‌కు అవకాశమిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. మీ ఆలోచనలను మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నాయకుడిగా, మీ రేవంతన్నగా తీసుకుని, మీ మాట నిలబెడతానని ఈ వేదిక మీద నుంచి అందరికీ హామీ ఇస్తున్నా. ప్రజల హక్కులు, శాంతిభద్రతలను కాపాడుతూ.. తెలంగాణను మిగతా రాష్ట్రాలతోనే కాకుండా ప్రపంచ దేశాలతోనే పోటీపడేలా అభివృద్ధిని ముందుకు తీసుకెళతాం. పేదవారికి, నిస్సహాయులకు ఏ దిక్కూ లేదనే పరిస్థితులను రానీయకుండా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా. సోనియమ్మ అండతో, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో, రాహుల్‌గాంధీ సూచనలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తాను. మీకు సేవ చేయడానికే మీరిచ్చిన ఈ బాధ్యతను శ్రద్ధగా నిర్వహిస్తా. ఈ అవకాశాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం వినియోగిస్తా. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడటానికి లక్షలాది మంది కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధమయ్యారే తప్ప చేతిలో మువ్వన్నెల పార్టీ జెండాను వదులుకోలేదు. మీ శ్రమను గుర్తు పెట్టుకుంటా. గుండెల నిండా నింపుకొంటా. గత పదేళ్లుగా కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత నాయకుడిగా నేను తీసుకుంటా. వేలాదిమంది ఈ శుభకార్యక్రమానికి హాజరై తెలంగాణకు పట్టిన చీడ, పీడ నుంచి విముక్తి కలిగించారు’ అని సీఎం రేవంత్‌ అన్నారు.


‘‘ఈ ప్రమాణ స్వీకారం ద్వారా తెలంగాణ ప్రజలు.. ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల ఆకాంక్షను నెరవేర్చడానికి మా ప్రభుత్వం ప్రతినబూనింది. ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఈ మంత్రివర్గంతో ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది. తెలంగాణ నలుమూలలా సమానమైన అభివృద్ధి జరుగుతుంది. ఈ వేదికపై నుంచి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా.. నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రజాభవన్‌లోకి ప్రవేశించి మీ ఆలోచనలు, ఆకాంక్షలను ప్రభుత్వంతో పంచుకోవచ్చు’’.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు