కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కనులపండువగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డితో గవర్నర్‌ తమిళిసై ప్రమాణం చేయించారు.

Updated : 08 Dec 2023 07:22 IST

కనులపండువగా కాంగ్రెస్‌ సర్కారు ప్రమాణ స్వీకారం
సీఎంగా రేవంత్‌రెడ్డి, డిప్యూటీగా భట్టి, మంత్రులుగా మరో 10 మంది ప్రమాణం
సోనియా, రాహుల్‌, ప్రియాంక, ఖర్గే హాజరు
కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ సీఎంల రాక
పెద్దఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కనులపండువగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డితో గవర్నర్‌ తమిళిసై ప్రమాణం చేయించారు. మల్లు భట్టివిక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా.. మరో 10మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. పార్టీ అగ్రనేతలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు, అధికార, అనధికార ప్రముఖులు, పెద్దసంఖ్యలో కాంగ్రెస్‌ శ్రేణులు, అభిమానులు హాజరయ్యారు. సభికుల కేరింతలు, నినాదాల నడుమ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ప్రమాణ స్వీకారాన్ని తిలకించేందుకు వీలుగా ఎల్బీ స్టేడియం లోపల, వెలుపల ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు.

కార్యకర్తల హర్షధ్వానాల మధ్య రేవంత్‌ ప్రమాణం

తొలుత రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం మొదలుపెట్టగానే కార్యకర్తలు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. ప్రమాణం అనంతరం వేదికపై ఉన్న అగ్రనేత సోనియా గాంధీ వద్దకు ఆయన వెళ్లి పాదాభివందనం చేశారు. రేవంత్‌ను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంక, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తదితరులు అభినందించారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా భట్టివిక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు. వీరిలో దామోదర రాజనరసింహా ఆంగ్లంలో ప్రమాణం చేశారు. సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఆత్మసాక్షిగా, మిగిలిన వారంతా దైవసాక్షిగా ప్రమాణం చేశారు. సీతక్క ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినప్పుడు.. కార్యకర్తలు, అభిమానుల నుంచి పెద్దఎత్తున హర్షధ్వానాలు వినిపించాయి. సీతక్క.. సీతక్క.. అన్న నినాదాలతో సభ దద్దరిల్లింది. ప్రమాణం చేయడానికి ఆమె కొద్దిసేపు ఆగాల్సి వచ్చింది. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులు గవర్నర్‌, సీఎం, సోనియా, రాహుల్‌, ప్రియాంక, ఖర్గేల దగ్గరకు వెళ్లి నమస్కరించారు. సీతక్క, కొండా సురేఖలను సోనియా ఆలింగనం చేసుకోవడంతో వారు భావోద్వేగానికి గురయ్యారు. భట్టి, ఉత్తమ్‌, కోమటిరెడ్డిలు.. రేవంత్‌ను ఆలింగనం చేసుకున్నారు. అందరూ చేతులు కలిపి సభికులకు అభివాదం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం మధ్యాహ్నం 1.04 గంటలకు నిర్ణయించగా.. 1.20 గంటలకు సీఎంగా రేవంత్‌ ప్రమాణంతో మొదలైంది. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణం చేయడంతో 1.47 గంటలకు ముగిసింది.

జై రేవంతన్న నినాదాలు..

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఉదయం 10 గంటల నుంచే ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలు కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిశాయి. ‘జై రేవంతన్న’, ‘జై కాంగ్రెస్‌’ నినాదాలతో స్టేడియం మారుమోగింది. అంతకుముందు ఉదయం సోనియా, రాహుల్‌, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తదితరులకు శంషాబాద్‌ విమానాశ్రయంలో రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే తదితరులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి వారు నేరుగా హోటల్‌ తాజ్‌కృష్ణకు చేరుకున్నారు. ఆ తర్వాత సోనియా, రేవంత్‌రెడ్డిలు ఓపెన్‌ టాప్‌ వాహనంలో పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. స్టేడియంలో సభికులు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. రాహుల్‌ అభివాదం చేయగా.. ‘పీఎం.. పీఎం’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి సతీమణి గీత, కుమార్తె నైమిషారెడ్డి, అల్లుడు, మనవడు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం.. రేవంత్‌రెడ్డి తన కుటుంబ సభ్యులను సోనియా, రాహుల్‌, ప్రియాంక, ఖర్గేలకు పరిచయం చేశారు. కొత్త సీఎం, మంత్రులతో గవర్నర్‌, సీఎస్‌ గ్రూప్‌ ఫొటో దిగారు. సభ నుంచి గవర్నర్‌ వెళ్లిపోయిన అనంతరం వేదిక పైనుంచి సోనియా, రాహుల్‌, ప్రియాంక, ఖర్గే తదితర కాంగ్రెస్‌ అగ్రనేతలతో కలిసి రేవంత్‌, మంత్రులు ప్రజలకు అభివాదం చేశారు. పార్టీ అగ్రనేతలు వెళ్లిపోయిన తర్వాత.. కృతజ్ఞత సభలో రేవంత్‌ ప్రసంగించారు. ఆయన ప్రసంగానికి జనం నుంచి స్పందన కనిపించింది. అనంతరం సీఎం దంపతులకు హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు ఆశీర్వచనాలు అందించారు.

వేదికపై ఆసీనులైన ప్రముఖులు

వేదికపై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఒకవైపు ఆసీనులు కాగా.. మరోవైపు కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, సుఖ్వీందర్‌ సింగ్‌ సుక్కు, పలువురు కర్ణాటక మంత్రులు, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్‌ బండా ప్రకాశ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు, అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, మధుయాస్కీ గౌడ్‌, బలరాం నాయక్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్‌రెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం, ప్రజా కళాకారుడు అందెశ్రీ, ప్రజాసంఘాల నాయకులు, తెలంగాణ అమరుల కుటుంబ సభ్యులు, కాంగ్రెస్‌ మాజీ మంత్రులు, నాయకులు కూర్చున్నారు. వేదిక మధ్యలో గవర్నర్‌, ముఖ్యమంత్రి కోసం ప్రత్యేక కుర్చీలు ఏర్పాటు చేయగా.. వారి సమీపంలో ఖర్గే, సోనియా, రాహుల్‌, ప్రియాంక ఆసీనులయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ సమన్వయం చేశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని