Free Bus Travel: రేపటి నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ఈ నెల 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రెండు గ్యారంటీలను అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.

Updated : 08 Dec 2023 07:19 IST

అందరికీ రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ భద్రత
కొత్త ప్రభుత్వం అమలు చేసే తొలి రెండు గ్యారంటీలివే..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వ విభాగాల వారీగా శ్వేతపత్రాల విడుదలకు ఆదేశాలు
ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఈ నెల 9న
తొలి క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయాలు
వెల్లడించిన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ఈ నెల 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రెండు గ్యారంటీలను అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. తొలి గ్యారంటీ కింద రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రెండో గ్యారంటీగా రూ.10 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయనుంది. వంద రోజుల్లోగా ఆరు గ్యారంటీ హామీలు అమలు చేస్తామని స్పష్టం చేసింది. గురువారం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం.. సచివాలయంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తొలి మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశ వివరాల్ని మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ‘ప్రజలు, పారిశ్రామిక సంస్థలు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడం కాంగ్రెస్‌ ప్రభుత్వ గ్యారంటీ అని మంత్రిమండలి స్పష్టం చేసింది. 2014 నుంచి 2023 డిసెంబరు 7వ తేదీ వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వ విభాగాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించాం. గ్రూప్‌-1, 2 పరీక్షలపై చర్చించాం. వీటిపై ఒక నివేదిక తెప్పించుకుని ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ నెల 9న కొత్త శాసనసభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్‌ ఎన్నిక, గవర్నర్‌ ప్రసంగం ఉంటాయి.

గుర్తింపుకార్డు చూపించి ఉచిత ప్రయాణం..

తొలి మంత్రిమండలి సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఈ సందర్భంగా.. తెలంగాణ ప్రజలందరికీ సీఎం, మంత్రుల తరఫున కృతజ్ఞతలు తెలిపాం. రాబోయే సంవత్సరాల్లో ప్రజా జీవితాల్లో మార్పు తెచ్చేలా హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై సుదీర్ఘంగా చర్చించాం. అవి సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు. తొలుత రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించాం. మొదటి గ్యారంటీ కింద రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రెండో గ్యారంటీగా రూ.10 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తాం. వీటికి సంబంధించి శుక్రవారం ఆయా విభాగాలతో చర్చించి శనివారం (ఈ నెల 9వ తేదీ) నుంచే అమలులోకి తెస్తాం. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని(Free Bus Travel To Women) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభిస్తారు. మహిళలు ఈ నెల 9 నుంచి తమ గుర్తింపు కార్డు (ఆధార్‌ లేదా ఇతర) చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ కార్యక్రమం అమల్లో భాగంగా ఎదురయ్యే సాధకబాధకాలను పరిశీలించి మరిన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆరు గ్యారంటీల అమలు ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం. మిగతా గ్యారంటీల అమలుకు సంబంధించి విభాగాల నుంచి సమాచారం తీసుకోవాల్సి ఉంది.

పదేళ్లుగా ప్రణాళిక లేని విద్యుత్తు వ్యవస్థ

మంత్రిమండలి సమావేశంలో రెండో అంశంగా 2014 నుంచి 2023 డిసెంబరు 7 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించాం. ప్రభుత్వ విభాగాలకు సంబంధించి ఎంత సొమ్ము దేనికి ఖర్చు పెట్టారు? వాటి ప్రయోజనాలు ప్రజలకు ఎంతవరకు చేరాయి? అనే వివరాలతో కూడిన శ్వేతపత్రాలు వీలైనంత త్వరగా విడుదల చేయాలని అధికారులకు సూచించాం. గృహావసరాలు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఇచ్చిన మాట మేరకు 24 గంటల విద్యుత్తు హామీ కార్యాచరణలో పెట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. 2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్తు విషయంలో దొర్లిన తప్పులు, ఆ శాఖ ప్రణాళిక లేకుండా సాగడంపై మంత్రి మండలి సుదీర్ఘంగా చర్చించింది. దీనిపై శుక్రవారం విద్యుత్తుశాఖ ముఖ్యకార్యదర్శి, ఇతర అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. విద్యుత్తుకు సంబంధించిన అనేక అంశాలతో పాటు గత పదేళ్లుగా జరిగిన లోటుపాట్లపై సమీక్షిస్తారు. అంతరాయం లేకుండా రాబోయే అయిదేళ్ల పాటు వ్యవసాయదారులకు 24 గంటల ఉచిత విద్యుత్తుతో పాటు ప్రభుత్వ గ్యారంటీల్లో భాగమైన గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుపై నిర్ణయాలు తీసుకుంటారు.

పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు

ఇటీవల వర్షాల వల్ల పంటలకు వాటిల్లిన నష్టంపై చర్చించాం. వీటిపై అధికారులు ఇప్పటికే ప్రాథమిక అంచనాలు వేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా పెట్టుబడి సహాయం కోసం ఆర్థికశాఖ నుంచి పూర్తిస్థాయి సమాచారం అడిగాం. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. అయిదేళ్లలో ఆరు గ్యారంటీలను అమలు చేయాల్సిన అవసరముంది. ఆర్థిక పరిస్థితి వివరాలు శ్వేతపత్రం రూపంలో ప్రజలకు అందించాలి. గత ఏడాది రుణమాఫీ బకాయిలు, రైతుల పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి? అన్న విషయాలతో పాటు మేం ఇచ్చిన హామీల అమలుకు వనరులు ఏ విధంగా సేకరించాలి? తదితర విషయాలు దృష్టిలో పెట్టుకుని సమగ్రంగా నిర్ణయం తీసుకుంటాం. మంత్రివర్గ కూర్పుపై సీఎం, ఏఐసీసీ నాయకులు చర్చించి నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీనియర్‌ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా ఉంటారు. ప్రమాణ స్వీకారం తరువాత స్పీకర్‌ ఎన్నిక, గవర్నర్‌ ప్రసంగం ఉంటాయి. అనంతరం స్పీకర్‌తో కూర్చుని ఎజెండా నిర్ణయించి వివరాలు వెల్లడిస్తాం. హౌసింగ్‌ బోర్డులో తొలగించిన వారి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో తరువాత నిర్ణయిస్తాం’ అని శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ వివరించారు.

మంత్రులకు శాఖల కేటాయింపులో జాప్యం

కొత్త ప్రభుత్వంలో మంత్రులకు ఇంకా శాఖలు కేటాయించలేదు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా.. వారికి ఫలానా శాఖలు కేటాయించారంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు చక్కర్లు కొట్టాయి. కొన్ని ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం నిజం కాదని.. మంత్రులకు శాఖలు కేటాయించలేదని ప్రభుత్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు కూడా మంత్రులకు శాఖల కేటాయింపుపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని