నిఘా విభాగాధిపతిగా శివధర్‌రెడ్డి!

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండు కీలక స్థానాల్లో అధికారులను మార్చింది. రాష్ట్ర నిఘా విభాగాధిపతిగా శివధర్‌రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించినట్లు తెలుస్తోంది.

Updated : 08 Dec 2023 07:50 IST

ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి!!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండు కీలక స్థానాల్లో అధికారులను మార్చింది. రాష్ట్ర నిఘా విభాగాధిపతిగా శివధర్‌రెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించినట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి బదిలీలు ఇవే. ప్రస్తుతం శివధర్‌రెడ్డి రైల్వేస్‌ అదనపు డీజీగా, శేషాద్రి సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 1994 బ్యాచ్‌కు చెందిన శివధర్‌రెడ్డి 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత మొదటి నిఘా విభాగాధిపతిగా సుమారు రెండేళ్లపాటు పనిచేశారు. అప్పటి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదట నియామకం ఆయనదే.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శివధర్‌రెడ్డి అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. బెల్లంపల్లి, అనకాపల్లి ఏఎస్పీగా, నల్గొండ, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా, హైదరాబాద్‌ దక్షిణ మండలం డీసీపీగా పనిచేశారు. అనంతరం వామపక్ష తీవ్రవాదంపై నిఘా ఉంచే స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచికి బదిలీ అయ్యారు. నాలుగేళ్లకుపైగా ఆయన అక్కడ పనిచేయగా, ఆ కాలంలో అనేక మంది కీలక మావోయిస్టులు అరెస్టు కావడమో, లొంగిపోవడమో, ఎన్‌కౌంటర్లలో మరణించడమో జరిగింది. ఆ తర్వాత ఆయన అవినీతి నిరోధకశాఖ సంచాలకులుగా కొంతకాలం పనిచేసి, విశాఖపట్నం కమిషనర్‌గా బదిలీ అయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో అక్కడే ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఏర్పడిన కేసీఆర్‌ ప్రభుత్వం హుటాహుటిన ఆయన్ను నిఘా విభాగాధిపతిగా నియమించింది. ఆ సమయంలోనే నల్గొండ జిల్లా జానకీపురంలో సిమీ ఉగ్రవాదుల కలకలం, వరంగల్‌ జిల్లా ఆలేరు వద్ద వికారుద్దీన్‌ తదితరుల ఎన్‌కౌంటర్‌, షాద్‌నగర్‌ వద్ద జరిగిన కాల్పుల్లో నేరగాడు నయీం హతం వంటి ఘటనలు జరిగాయి. 2016 సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను అకస్మాత్తుగా అక్కణ్నుంచి బదిలీచేసి, అదనపు డీజీ (పర్సనల్‌)గా నియమించింది. 2022 వరకూ అక్కడే పనిచేసిన ఆయన, ఆ సంవత్సరం డిసెంబరు నెలలో అదనపు డీజీ రైల్వేస్‌గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను నిఘా విభాగాధిపతిగా నియమించాలని నిర్ణయం తీసుకుంది. ఆ స్థానంలో ఉన్న అనిల్‌కుమార్‌ను బదిలీ చేసింది. రంగారెడ్డి కలెక్టర్‌గా పనిచేసిన శేషాద్రికి నిజాయతీపరుడైన అధికారిగా పేరుంది. రెవెన్యూశాఖపై మంచి పట్టున్న ఆయన మన్మోహన్‌సింగ్‌, మోదీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొంతకాలం ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేశారు. వీరిద్దరి నియామకంపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని