TS Cabinet: కొత్త.. పాత కలయికగా మంత్రివర్గం

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కొలువుదీరనున్న మంత్రివర్గం కొత్త..పాత కలయికగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సహా 12 మంది ప్రమాణ స్వీకారం చేశారు.

Updated : 08 Dec 2023 07:22 IST

నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్‌రెడ్డి
ఆరుగురు కొత్తవారికి అవకాశం
సీనియర్‌ మంత్రులుగా తుమ్మల, జూపల్లి

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కొలువుదీరనున్న మంత్రివర్గం కొత్త..పాత కలయికగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సహా 12 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 13 మందిలో ఏడుగురు గతంలో వివిధ ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసిన వారున్నారు. మిగిలిన ఆరుగురికి ఇదే మొదటి అవకాశం. రేవంత్‌రెడ్డి మంత్రిగా చేయకుండా నేరుగా ముఖ్యమంత్రి అయిన వారి జాబితాలో చేరారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా చీఫ్‌ విప్‌గా ఉన్నారు తప్ప ఎప్పుడూ మంత్రిగా చేయలేదు. దామోదర రాజనర్సింహా గతంలో ఉపముఖ్యమంత్రిగా, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు కూడా గతంలో మంత్రులుగా పనిచేశారు. వీరిలో ఎక్కువ మందికి ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పని చేసిన అనుభవం ఉంది. తుమ్మల ఎన్టీఆర్‌ మొదలుకొని కేసీఆర్‌ వరకు వివిధ ప్రభుత్వాల్లో 17 ఏళ్లు మంత్రిగా ఉన్నారు. జూపల్లి కృష్ణారావు నాలుగోసారి మంత్రి అయ్యారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వైఎస్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల ప్రభుత్వాల్లో పనిచేశారు. కొండా సురేఖ వైఎస్‌ మంత్రివర్గంలో ఉన్నారు. గతంలో ఎంపీలుగా ఉన్న పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌లు మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రి పదవులు పొందారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతక్క తొలిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీలో మైనార్టీ వర్గం నుంచి ఎమ్మెల్యేలెవరూ లేకపోవడంతో ఆ వర్గానికి ప్రాతినిధ్యం దక్కలేదు.

నాలుగు ఉమ్మడి జిల్లాలకు దక్కని ప్రాతినిధ్యం

గురువారం ప్రమాణ స్వీకారం చేసిన మొదటి మంత్రివర్గంలో రాష్ట్రంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. కాంగ్రెస్‌కు ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో మంత్రులుగా జి.వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావుల పేర్లు ప్రచారంలోకి వచ్చినా ఇద్దరికీ అవకాశం రాలేదు. నిజామాబాద్‌ నుంచి సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరిగినా ఆయనకూ దక్కలేదు. సామాజిక సమీకరణాల్లో భాగంగానే ఇవ్వలేదని పార్టీ వర్గాలు చెబున్నాయి. ఇదే జిల్లా నుంచి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావుకు ఐటీ శాఖ కేటాయిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చలు నడిచాయి. హైదరాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులెవరూ ఎమ్మెల్యేలుగా గెలవలేదు. రంగారెడ్డి నుంచి ఇద్దరు ముగ్గురి పేర్లు వినిపించినా ఎవరికీ పిలుపురాలేదు. అయితే వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌కు స్పీకర్‌గా అవకాశం కల్పించారు. అయితే మంత్రివర్గంలోకి మరో ఆరుగురిని తీసుకోవడానికి వీలుంది. అందులో ఈ జిల్లాల నాయకులకు అవకాశం లభించవచ్చు. ప్రస్తుత మంత్రివర్గంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఉపముఖ్యమంత్రితో సహా ఇద్దరికి పదవులు దక్కాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని