Telangana Ministers: అమాత్య యోగం.. సాగాలి అభివృద్ధి యాగం

రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మందిలో.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ అంచలంచెలుగా ఎదిగిన వారితో పాటు, అనతికాలంలోనే ఉన్నతస్థాయికి చేరిన నేతలున్నారు.

Updated : 08 Dec 2023 08:27 IST

రాష్ట్ర మంత్రులుగా(Telangana Ministers) ప్రమాణ స్వీకారం చేసిన 11 మందిలో.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ అంచలంచెలుగా ఎదిగిన వారితో పాటు, అనతికాలంలోనే ఉన్నతస్థాయికి చేరిన నేతలున్నారు. వీరిలో కొందరు తొలిసారి మంత్రులు కాగా.. తుమ్మల నాగేశ్వరరావు గతంలో ఎక్కువసార్లు మంత్రిగా పనిచేసిన సీనియర్‌ నేతగా ఉన్నారు. వారి విశేషాలివీ..


మల్లు భట్టి విక్రమార్క

మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతూ కాంగ్రెస్‌ పార్టీలో పలు కీలక పదవులు నిర్వహించారు. 1990లో రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించారు. 2019లో సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. ఇటీవల ఎన్నికలకు ముందు నాలుగు నెలల పాటు పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర నిర్వహించి కీలకస్థాయికి చేరారు. ఇప్పుడు తొలిసారి మంత్రి కావడంతో పాటు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

  • పుట్టిన తేదీ: 15.06.1961
  • స్వస్థలం: స్నానాల లక్ష్మీపురం, వైరా మండలం, ఖమ్మం జిల్లా
  • విద్యార్హత: ఎంఏ
  • తల్లిదండ్రులు: అఖిలాండ, మణిమ్మ
  • కుటుంబం: భార్య మల్లు నందిని. ఇద్దరు కుమారులు సూర్యాదిత్య, విక్రమాదిత్య

రాజకీయ ప్రస్థానం

1990 నుంచి 1992: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు
2007- 2009: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
2009 మేలో: మధిర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక.. ప్రభుత్వ విప్‌గా నియామకం
2012- 2014: శాసనసభ ఉపసభాపతి
2014: కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా నియామకం
2014: మధిర నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
2015: పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియామకం
2018: ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా ఎంపిక
2018: మధిర నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం..
మరోసారి మధిర నుంచి విజయం


కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఇంజినీరింగ్‌ డిగ్రీ చదివి రాజకీయాల్లోకి వచ్చిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నేతగా ఎదిగారు. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్నారు.  ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి నాయకుని నుంచి యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష చేశారు.

  • పుట్టిన తేదీ: 1963 మే 23
  • తల్లిదండ్రులు: సుశీలమ్మ, వెంకటపాపిరెడ్డి
  • స్వగ్రామం: బ్రాహ్మణ వెల్లంల, నార్కట్‌ పల్లి మండలం, నల్గొండ జిల్లా
  • కుటుంబం: భార్య: సబిత, కుమార్తె: శ్రీనిధి

రాజకీయ ప్రస్థానం

1999, 2004, 2009, 2014: వరుసగా 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం

  • వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంత్రిగా బాధ్యతలు. రోశయ్య మంత్రివర్గంలో  కొనసాగింపు
  • 2010లో కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన, విమానయాన ఓడరేవుల, సహజ వనరులశాఖ మంత్రిగా బాధ్యతలు

2018: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి
2019: భువనగిరి ఎంపీగా గెలుపు


దనసరి అనసూయ సీతక్క

మారుమూల పల్లెలో పుట్టి దశాబ్ద కాలం పాటు విప్లవ బాటలో నడిచిన సీతక్క రాజకీయాల్లో చేరి కీలక నేతగా ఎదిగారు. పదహారేళ్ల వయసులో జనశక్తి పార్టీలో చేరి దళకమాండర్‌గా పనిచేశారు. 1996లో జనజీవన స్రవంతిలో కలిసి ఓ స్వచ్ఛంద సంస్థలో పని చేశారు. అప్పుడే ఇంటర్‌, డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి న్యాయవాదిగా వరంగల్‌ కోర్టులో ప్రాక్టీసు చేశారు. 2022లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.

  • పుట్టిన తేదీ: 1971 జులై 9
  • స్వస్థలం: జగ్గన్నపేట, ములుగు మండలం, జిల్లా
  • విద్యార్హత: పీహెచ్‌డీ
  • తల్లిదండ్రులు: సమ్మయ్య, సమ్మక్క
  • కుటుంబం: భర్త.. దివంగత కుంజ కొమ్మాలు అలియాస్‌ రాము. కుమారుడు సూర్య

రాజకీయ ప్రస్థానం

2004: తెలుగుదేశం పార్టీలో చేరిక. ములుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి
2004-06: తెదేపా రాష్ట్ర కార్యదర్శి
2006-09: తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
2009-14: టీడీఎల్పీ కార్యదర్శి, తెదేపా అధికార ప్రతినిధి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
2009: తెదేపా నుంచి పోటీ చేసి ములుగు ఎమ్మెల్యేగా విజయం
2014: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి
2018: కాంగ్రెస్‌ అభ్యర్థిగా ములుగు ఎమ్మెల్యేగా ఎన్నిక.

ప్రస్తుతం ములుగు నుంచి మూడోసారి విజయం


కొండా సురేఖ

మండల పరిషత్‌ అధ్యక్షురాలి (ఎంపీపీ)గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత తెరాసలో చేరారు. 2018లో ఆ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసి ఓటమి చెందినా.. ప్రస్తుత ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నుంచి విజయం సాధించారు.

  • పుట్టిన తేదీ: 1965 ఆగస్టు 19
  • స్వగ్రామం: వంచనగిరి, గీసుకొండ మండలం, వరంగల్‌ జిల్లా
  • విద్యార్హత: బీకాం
  • తల్లిదండ్రులు: తుమ్మ రాధ, తుమ్మ చంద్రమౌళి
  • కుటుంబం: భర్త కొండా మురళీధర్‌రావు. కుమార్తె సుస్మిత పటేల్‌

రాజకీయ ప్రస్థానం

1995: గీసుకొండ మండల పరిషత్తు అధ్యక్షురాలిగా ఎన్నిక
1999, 2004: వరుసగా రెండుసార్లు శాయంపేట ఎమ్మెల్యేగా ఎన్నిక
2009: పరకాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక. మహిళా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు
2014: వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యేగా విజయం. భారాసలో చేరిక
2018: భారాస టికెట్‌ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరి పరకాల నుంచి పోటీ.. ఓటమి


దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

శ్రీధర్‌బాబు తండ్రి శ్రీపాదరావును 1999లో నక్సలైట్లు హత్య చేయడంతో ఆయన రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. అనతికాలంలోనే కాంగ్రెస్‌లో ప్రముఖ నేతగా ఎదిగారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో ఆ రాష్ట్రానికి ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేసి అధిష్ఠానం వద్ద గుర్తింపుపొందారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవముంది.

  • పుట్టిన తేదీ: 1969 మే 30
  • స్వస్థలం: ధన్వాడ, కాటారం మండలం, జయశంకర్‌ భూపాలపల్లి
  • విద్యార్హత: ఎంఏ, ఎల్‌ఎల్‌బీ
  • కుటుంబం: ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి శైలజా రామయ్యర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె అదితి, కుమారుడు అనిరుధ్‌ సంతానం.
  • 1998లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయవాద వృత్తిని చేపట్టారు.

రాజకీయ ప్రస్థానం

1999, 2004, 2009: వరుసగా మూడుసార్లు మంథని ఎమ్మెల్యేగా ఎన్నిక
2009: ఉన్నత విద్య, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు
2010-2014: శాసనసభ వ్యవహారాలు, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు
2004-2012: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షునిగా సేవలు
2014: ఎన్నికల్లో ఓటమి
2018: నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం
2014: పీసీసీ కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు
2014-2016: క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (క్యాట్‌) ఛైర్మన్‌

  • ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో రూపకల్పన కమిటీ ఛైర్మన్‌
  • మంథని నుంచి అయిదోసారి విజయం

పొన్నం ప్రభాకర్‌

విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తిని పెంచుకున్నారు.ఎన్‌ఎస్‌యూఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా.. రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1992 నుంచి 1998 వరకు ఉమ్మడి కరీంనగర్‌ ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందించారు. తరవాత ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టి 2002 వరకు కొనసాగారు. అనంతరం ఏడాది పాటు రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు.

  • పుట్టిన తేదీ: 1967 మే 8
  • స్వస్థలం: కరీంనగర్‌
  • విద్యార్హత: ఎంఏ, ఎల్‌ఎల్‌బీ
  • తల్లిదండ్రులు: మల్లమ్మ, సత్తయ్య
  • కుటుంబం: భార్య మంజుల. పిల్లలు.. పృథ్వీ, ప్రణవ్‌

రాజకీయ ప్రస్థానం

2002-04: ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మీడియా సెల్‌ సమన్వయకర్తగా బాధ్యతలు
2004: స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి
2009: కరీంనగర్‌ నుంచి ఎంపీగా ఎన్నిక. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంపీల కన్వీనర్‌గా సేవలు  
రైల్వే, విద్యుత్‌ మంత్రిత్వశాఖ కన్సల్టేటివ్‌ కమిటీ సభ్యుడిగా, రసాయనాలు, ఎరువులు, కంప్యూటర్లపై జాతీయ కమిటీల సభ్యుడిగా బాధ్యతలు
2014, 2019: వరుస ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి
2018: కరీంనగర్‌ శాసనసభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేసి ఓటమి  
2022 డిసెంబరు 10: పీసీసీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా నియామకం. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు
2023 ఆగస్టు 30: కాంగ్రెస్‌ పార్టీ బీసీ డిక్లరేషన్‌ కమిటీ ఛైర్మన్‌గా నియామకం
ప్రస్తుతం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి విజయం


పొంగులేటి శ్రీనివాసరెడ్డి

గత పదేళ్లలోనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. గతంలో ఖమ్మం ఎంపీగా నెగ్గిన ఆయన గత జులైలో కాంగ్రెస్‌లో చేరి పీసీసీ ప్రచార కమిటీ కోఛైర్మన్‌గా నియమితులయ్యారు. తరువాత కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. తాజా ఎన్నికల్లో పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పలువురు ఎమ్మెల్యేలకు ఈ ఎన్నికల్లో అండగా నిలిచి గెలిపించారు.

  • పుట్టిన రోజు: 1965 అక్టోబరు 28
  • స్వస్థలం: నారాయణపురం, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా
  • విద్యార్హత: ఎల్‌ఎల్‌బీ
  • తల్లిదండ్రులు: రాఘవరెడ్డి, స్వరాజ్యం
  • కుటుంబం: భార్య మాధురి. కుమారుడు హర్షారెడ్డి, కుమార్తె స్వప్నిరెడ్డి

రాజకీయ ప్రస్థానం

2013 ఫిబ్రవరి 23: వైకాపాలో చేరిక
2014: తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు
2014: ఖమ్మం ఎంపీగా ఎన్నిక. రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖ స్టాండింగ్‌ కమిటీల సభ్యుడిగా నియామకం. ఇంధన మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా బాధ్యతలు.
2016 మే 3: తెరాసలో చేరిక
2023 జనవరి 1: భారాసపై తిరుగుబావుటా
2023 జులై 2: ఖమ్మంలో సభలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక


తుమ్మల నాగేశ్వరరావు

ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్నవారిలో అత్యంత సీనియర్‌ నేత. 1985లోనే ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగుదేశం, భారాస ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. ఈ ఏడాది సెప్టెంబరులో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఖమ్మం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

  • పుట్టిన తేదీ: 1953 నవంబరు 15
  • స్వస్థలం: గండుగులపల్లి, దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం
  • విద్యార్హత: బీకాం
  • తల్లిదండ్రులు: లక్ష్మయ్య, మాణిక్యమ్మ
  • కుటుంబం: సతీమణి భ్రమరాంబ. కుమారుడు యుగంధర్‌. కుమార్తెలు మోహిని, చంద్రిక

రాజకీయ జీవితం

1982: ఎన్టీఆర్‌ పిలుపుతో రాజకీయాల్లోకి
1983: సత్తుపల్లి తెదేపా అభ్యర్థిగా ఓటమి
1985: సత్తుపల్లి నుంచి తెదేపా ఎమ్మెల్యేగా ఎన్నిక. చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు
1989: ఎన్నికల్లో ఓటమి
1994: సత్తుపల్లి నుంచి మరోసారి విజయబావుటా. మంత్రిగా బాధ్యతలు
1999: సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక.  మంత్రిగా బాధ్యతలు
2004: ఎన్నికల్లో ఓటమి
2004: ఖమ్మం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా నియామకం
2009: ఖమ్మం ఎమ్మెల్యేగా ఎన్నిక
2014: ఎన్నికల్లో ఓటమి
2014 సెప్టెంబరు 5: తెరాసలో చేరిక
2014 డిసెంబర్‌ 16: మంత్రిగా బాధ్యతలు
2015: ఎమ్మెల్సీగా ఎన్నిక
2016: పాలేరు ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నిక
2018: పాలేరు నుంచి ఓటమి


ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో సీనియర్‌ కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ పొందిన ఉత్తమ్‌.. భారత వైమానిక దళంలో ఫైటర్‌ పైలట్‌గా పనిచేశారు. రాష్ట్రపతి భవన్‌లో భద్రత, ప్రొటోకాల్‌, పరిపాలన, రాష్ట్రపతి విదేశీ పర్యటనల కంట్రోలర్‌గా విధులు నిర్వహించారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి.. కాంగ్రెస్‌ తరఫున ఆరుసార్లు ఎమ్మెల్యేగా, నల్గొండ ఎంపీగా గెలిచారు.  ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా ఉన్నారు.

  • పుట్టిన తేదీ: 1962 జూన్‌ 20
  • స్వస్థలం: తాటిపాముల, తిరుమలగిరి మండలం, సూర్యాపేట జిల్లా
  • తల్లిదండ్రులు: పురుషోత్తంరెడ్డి, ఉషాదేవి
  • కుటుంబం: భార్య పద్మావతి

రాజకీయ ప్రస్థానం

1994: కాంగ్రెస్‌ అభ్యర్థిగా కోదాడలో ఓటమి  
1999, 2004: వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నిక  
2009, 2014, 2018, 2023: హుజూర్‌ నగర్‌ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా విజయాలు  
2012- 2014: రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రిగా బాధ్యతలు
2014: పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా..
2015- జూన్‌ 2021: పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు
2019: నల్గొండ ఎంపీగా విజయం


దామోదర రాజనర్సింహా

1988లో అందోలు ఎమ్మెల్యేగా ఉన్న సి.రాజనర్సింహా అనారోగ్యంతో మృతిచెందగా.. వారసుడిగా ఆయన కుమారుడైన దామోదర రాజనర్సింహా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తండ్రి ప్రాతినిథ్యం వహించిన అందోలులో 1989 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. అదే నియోజకవర్గంలో వరుసగా పోటీ చేస్తూ వివిధ పదవులు అలంకరించారు. 2013-14 మధ్య రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

  • పుట్టిన రోజు: 1958, డిసెంబరు 5 స్వస్థలం: బేగంపేట, హైదరాబాద్‌
  • విద్యార్హత: బీఈ (సివిల్‌)
  • తల్లిదండ్రులు: జానాబాయి, రాజనర్సింహ
  • కుటుంబం: భార్య పద్మిని. కుమార్తె త్రిష

రాజకీయ ప్రస్థానం

1989, 2004, 2009, 2023: ఎమ్మెల్యేగా విజయాలు
1992: రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌
2004 నుంచి 2014: మంత్రిగా వివిధ శాఖల బాధ్యతలు నిర్వహించారు.
2014, 2018: ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలయ్యారు.
ప్రస్తుత ఎన్నికల్లో అందోలు నుంచే విజయం సాధించారు


జూపల్లి కృష్ణారావు

బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి స్థిరాస్తి వ్యాపారం చేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో రికార్డు సృష్టించారు. గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు.

  • పుట్టిన తేదీ: 1955 ఆగస్టు 10
  • స్వస్థలం: పెద్దదగడ, చిన్నంబావి మండలం, వనపర్తి జిల్లా
  • తల్లిదండ్రులు: రత్నమ్మ, శేషగిరిరావు
  • కుటుంబం: భార్య సృజన. కుమారులు వరుణ్‌రావు, అరుణ్‌రావు

రాజకీయ ప్రస్థానం

1999: కొల్లాపూర్‌ నుంచి గెలుపు (కాంగ్రెస్‌)
2004: స్వతంత్ర అభ్యర్థిగా విజయం.
2009: ఎమ్మెల్యేగా గెలుపు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు
2011: తెరాసలో చేరిక
2012: ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం.
2014: ఎమ్మెల్యేగా విజయం. మంత్రిగా బాధ్యతలు
2018: ఎన్నికల్లో ఓటమి
గత జులైలో కాంగ్రెస్‌లో చేరి కొల్లాపూర్‌ ఎమ్మెల్యేగా విజయం


ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే యంత్రాంగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని