రాచకొండలో అత్యధికం.. ములుగులో అత్యల్పం

తెలంగాణలో 2022 సంవత్సరంలో జరిగిన నేరాల్లో ఎక్కువగా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోనే చోటు చేసుకున్నాయి.

Published : 08 Dec 2023 04:56 IST

పోలీస్‌ యూనిట్ల వారీ నేరాలపై ఎన్‌సీఆర్‌బీ-2022 నివేదిక వెల్లడి
తెలంగాణలో నమోదైన నేరాల్లో ఎక్కువ భౌతిక దాడులవే..

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో 2022 సంవత్సరంలో జరిగిన నేరాల్లో ఎక్కువగా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోనే చోటు చేసుకున్నాయి. అత్యల్పంగా ములుగు జిల్లాలో జరిగినట్లు జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని పోలీస్‌ యూనిట్ల వారీగా గణాంకాలు ఇచ్చింది. తెలంగాణలో 2022లో మొత్తం ఐపీసీ నేరాలు 1,51,849 జరిగినట్లు, వీటిల్లో గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 64వేలకు పైగా నేరాలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది. ఇందులో సూర్యాపేట జిల్లా అయిదో స్థానంలో ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన నేరాల్లో ఎక్కువగా భౌతికదాడులకు సంబంధించి 43,338 కేసులు నమోదయ్యాయి. మోసాలకు సంబంధించిన నేరాలు 25,729, ఆస్తిసంబంధ నేరాలు 22,527, చోరీలకు సంబంధించి 15,673 చోటు చేసుకున్నాయి. ఇవి కాకుండా నిర్లక్ష్యం కారణంగా సంభవించిన మరణాల కేసులు (ఐపీసీ 304-ఎ) ఎక్కువ నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ తరహా నేరాలు 7,233 నమోదయ్యాయి. అలాగే నిర్లక్ష్యంగా వాహనాలు నడపటం వల్ల సంభవించిన మరణాల కేసుల సంఖ్య 7,054గా ఉంది. మరోవైపు మహిళలపై జరిగిన దాడులకు సంబంధించి 4,652 కేసులు నమోదయ్యాయి.

అత్యధిక నేరాలు నమోదైన యూనిట్లు..

  • రాచకొండ కమిషనరేట్‌: 22,634
  • సైబరాబాద్‌ కమిషనరేట్‌: 20,668
  • హైదరాబాద్‌ కమిషనరేట్‌: 22,000
  • వరంగల్‌ కమిషనరేట్‌: 8,956
  • సూర్యాపేట జిల్లా: 5,654

అత్యల్ప నేరాలు గల యూనిట్లు

  • ములుగు: 978
  • వనపర్తి: 1155
  • నారాయణపేట: 1275
  • జోగులాంబ గద్వాల: 1347
  • కుమురంభీం ఆసిఫాబాద్‌: 1443
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని