పగటి పూటే వణికిస్తోంది.. తుపానుతో పడిపోయిన ఉష్ణోగ్రతలు

తుపాను ప్రభావంతో రాష్ట్రంలో మధ్యాహ్న సమయంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. సాధారణం కన్నా తక్కువ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

Updated : 08 Dec 2023 07:23 IST

రాష్ట్రమంతటా శీతల వాతావరణం

ఈనాడు, హైదరాబాద్‌: తుపాను ప్రభావంతో రాష్ట్రంలో మధ్యాహ్న సమయంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. సాధారణం కన్నా తక్కువ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ప్రజలు పగటి పూటే వణికిపోతున్నారు. గురువారం హనుమకొండ జిల్లాలో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయింది. మెదక్‌ జిల్లాలో 7.5, నిజామాబాద్‌లో 7, రామగుండంలో 5.6 డిగ్రీల సెల్సియస్‌లకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరోవైపు రాష్ట్రంలో సాధారణం కన్నా రాత్రిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌లో డిసెంబరు మొదటి వారంలో దాదాపు 12.1 డిగ్రీల సెల్సియస్‌ నమోదవ్వాల్సి ఉండగా బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు 7.1 డిగ్రీల సెల్సియస్‌ అదనంగా 19.2 డిగ్రీలుగా నమోదయింది. పటాన్‌చెరులో 12.3 నమోదు కావాల్సి ఉండగా 19.2 డిగ్రీలు నమోదయింది. రాజేంద్రనగర్‌, హయత్‌నగర్‌, రామగుండం, హైదరాబాద్‌, దుండిగల్‌, భద్రాచలంలోనూ 5.9 నుంచి 4.8 డిగ్రీల మధ్య అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పలు ప్రాంతాల్లో వర్షాలు

రాష్ట్రంలో తుపాను పూర్తిగా బలహీన పడటంతో శుక్ర, శనివారాల్లో పొడి వాతావరణం నెలకొనే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. భద్రాద్రి జిల్లా మణుగూరులో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని