Prajadarbar: బాధలు విన్నారు.. భరోసా ఇచ్చారు!

‘చాలా కాలంగా తిరుగుతున్నా భూ సమస్య పరిష్కారం కాలేదు. ప్రభుత్వం నేరుగా దరఖాస్తు తీసుకోవడంతోనైనా న్యాయం జరుగుతుందన్న ఆశ ఏర్పడింది’ అని ఒకరు.. ‘విద్యుదాఘాతంతో చేతులు పోయాయి.

Updated : 09 Dec 2023 08:52 IST

ప్రజాదర్బార్‌కు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్‌రెడ్డి
ప్రజాభవన్‌లో పౌరుల నుంచి నేరుగా వినతుల స్వీకరణ
మంత్రులు పొంగులేటి, సీతక్కలతో కలిసి సమస్యలు విన్న సీఎం
వెంటనే పరిష్కరించాలని యంత్రాంగానికి ఆదేశం
రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు
అర్జీలలో భూ వివాదాలు, పింఛన్లవే అధికం
ఈనాడు- హైదరాబాద్‌, న్యూస్‌టుడే - ఖైరతాబాద్‌

‘చాలా కాలంగా తిరుగుతున్నా భూ సమస్య పరిష్కారం కాలేదు. ప్రభుత్వం నేరుగా దరఖాస్తు తీసుకోవడంతోనైనా న్యాయం జరుగుతుందన్న ఆశ ఏర్పడింది’ అని ఒకరు.. ‘విద్యుదాఘాతంతో చేతులు పోయాయి. ఆదుకుంటారనే నమ్మకంతో వచ్చాను’ అంటూ మరొకరు.. ‘నా భూమిని ఫోర్జరీ సంతకాలతో ఆక్రమించారు. ఆదుకోండి’ అంటూ ఇంకొకరు.. ఇలా రాష్ట్రం నలుమూలల నుంచి పలు సమస్యలతో పెద్ద సంఖ్యలో జనం ప్రజాదర్బార్‌కు(Prajadarbar) పోటెత్తారు. బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావ్‌ ఫులె ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రజాదర్బార్‌కు శ్రీకారం చుట్టారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలతో కలిసి ఉదయం 10 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించారు. దివ్యాంగులకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. వారి సమస్యలను సీఎం స్వయంగా అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు. ఇతర అర్జీదారుల సమస్యలనూ విన్నారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. వివిధ జిల్లాల నుంచి బాధితులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ప్రజాభవన్‌ కిటకిటలాడింది.

రెవెన్యూ, గృహనిర్మాణం, విద్యుత్‌ శాఖతోపాటు ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీలకు చెందిన సమస్యలపై వినతులు భారీ సంఖ్యలో వచ్చినట్టు, వాటిలో భూ సమస్యలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు ప్రజాదర్బార్‌ కొనసాగింది. ముఖ్యమంత్రి కొంత సమయం తర్వాత అత్యవసర సమావేశం కోసం సచివాలయానికి వెళ్లడంతో మంత్రి సీతక్క దర్బార్‌ను కొనసాగించారు. దివ్యాంగులు, మహిళలు, వృద్ధుల సమస్యలను ఓపికగా విన్నారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవిగుప్తా, జల మండలి ఎండీ దానకిశోర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రాస్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ తదితరులు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

బాధితులకు బాసటగా అధికారులు

వివిధ జిల్లాల నుంచి సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన బాధితులకు అధికారులు బాసటగా నిలిచారు. వారు చెప్పే అంశాలను ఆలకించడంతోపాటు వారి వద్ద ఉన్న సంబంధిత ఆధారాలను పరిశీలించి స్వయంగా అర్జీలూ రాసిచ్చారు. చదువుకోని వారు, కాగితాలు, పెన్నులు తీసుకురాని వారికి ప్రభుత్వ సిబ్బంది సహాయం చేశారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు మొత్తం 15 సహాయ కేంద్రాలు(హెల్ప్‌ డెస్కులు) ఏర్పాటు చేశారు. ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో నమోదుచేసి ప్రత్యేకంగా నంబరు కేటాయించారు. రసీదు ఇవ్వడంతోపాటు సంబంధిత వ్యక్తి ఫోన్‌కు సంక్షిప్త సందేశం పంపారు. దర్బార్‌ లోపల 320 కుర్చీలు ఏర్పాటు చేశారు. దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చి వరుసల్లో నిలబడిన వారికి తాగునీరు, దివ్యాంగులకు చక్రాల కుర్చీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన వారికి వైద్య సేవలు అందించారు.


ధరణిలో నమోదు చేయలేదు.. రైతుబంధు రావడం లేదు

గ్రామంలో నాకు మూడెకరాల భూమి ఉంది. ధరణి పోర్టల్లో నమోదు చేయలేదు. దీంతో రైతు బంధు, బీమా అందడం లేదు. 70 ఏళ్ల వయసులో మండలం నుంచి జిల్లా కేంద్రం వరకు అనేక మంది అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. సీఎం ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నారని తెలిసి వచ్చా. ముఖ్యమంత్రి నా సమస్య విని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి సానుకూల సమాధానం రావడంతో ఆనందంగా ఉంది.

బాలమ్మ, కాశీంనగర్‌, వనపర్తి జిల్లా


పదేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోలేదు

ఇందిరాగాంధీ హయాంలో మా కుటుంబానికి ఎకరా ఎసైన్డ్‌ భూమి ఇచ్చారు. నా భర్త చనిపోయిన తరువాత వేరే వాళ్లు భూమిని ఆక్రమించుకున్నారు. తిరిగి ఇప్పించాలని పదేళ్లుగా తహసీల్దారు నుంచి కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నా. ఎవరూ పట్టించుకోలేదు. భూమి సర్వే చేయించి న్యాయం చెయ్యాలి.

కేతావత్‌ రుక్కీ, గుమ్మడివెల్లి తండా, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా


సమస్యను సీఎం విన్నారు..

2012లో పొలంలో పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యా. రెండు చేతులు, కాలు కోల్పోయా. నా కుటుంబం అప్పులు చేసి నన్ను బతికించుకుంది. అప్పట్నుంచి తినడం సహా అన్ని అవసరాలు ఇతరుల సాయంతో తీర్చుకుంటూ వస్తున్నా. నేను నిరుపేదను. కృత్రిమ చేతులు ఏర్పాటు చేసుకునే స్థోమత లేదు. ఇన్నేళ్లుగా ఎందరినో కలిశా. న్యాయం జరగలేదు. కొత్త ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆశతో వచ్చా. సీఎం రేవంత్‌రెడ్డి నా సమస్యను విన్నారు.

సీహెచ్‌.నారాయణరెడ్డి, కోయిలకొండ, మహబూబ్‌నగర్‌


ఫోర్జరీతో నా భూమిని కాజేశారు

తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న నాలుగున్నర ఎకరాల పట్టా భూమి ఉంది. రైతు బంధు కూడా వస్తోంది. స్థానిక భారాస నాయకులు ఫోర్జరీ సంతకాలతో అందులో 1.20 ఎకరాల విస్తీర్ణాన్ని 2019లో బల్లెద్దుల మషన్న పేరు మీదికి మార్చారు. స్థానిక తహసీల్దారు నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు మొర పెట్టుకున్నా న్యాయం జరగలేదు. స.హ.చట్టం కింద నా భూమి వివరాలు సేకరించి ఫోర్జరీపై ప్రశ్నిస్తే ఎకరం మాత్రం నా పేరుపైకి మార్చారు. ఫోర్జరీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు మిగిలిన 20 గుంటల భూమిని నా పేరుతో నమోదు చేయాలని సీఎంకు విన్నవించా.

 జాగల మషన్న, దేవుని తిర్మలాపూర్‌, పెద్దకొత్తపల్లి మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని