ఆ ప్రిన్సిపల్‌ మాకొద్దు..!

ప్రిన్సిపల్‌ను మార్చాలంటూ కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలం బూరుగూడలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు శుక్రవారం ఆందోళనకు దిగారు.

Updated : 09 Dec 2023 06:44 IST

బూరుగూడ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల ఆందోళన
3 కి.మీ.లు కాలినడకన వచ్చి.. కలెక్టరేట్‌ ఎదుట బైఠాయింపు
ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు

 

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: ప్రిన్సిపల్‌ను మార్చాలంటూ కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్‌ మండలం బూరుగూడలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో కళాశాలలో అల్పాహారం చేయకుండానే విద్యార్థినులు కళాశాల నుంచి కలెక్టరేట్‌కు సుమారు 3 కి.మీ.ల మేర కాలినడకన ర్యాలీగా తరలివచ్చారు. కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు రెండున్నర గంటల పాటు ఆందోళన చేపట్టారు. కళాశాలలో 450 మంది వరకు విద్యార్థులుండగా 300 మందికి పైగా ఆందోళనలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో సురేశ్‌, డీఎస్పీ వెంకటరమణ, సీఐ రాజు, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ రమాదేవి, పీటీజీ ప్రిన్సిపల్‌ సురేశ్‌లు అక్కడికి చేరుకుని విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపల్‌ దివ్యరాణి కళాశాలలోని ఇబ్బందులు పట్టించుకోవడం లేదని, భోజనం సరిగా పెట్టడం లేదని పలువురు విద్యార్థినులు చెప్పారు. ‘సెలవుపై ఇంటికి వెళ్లి ఆలస్యంగా వస్తే పనిష్‌మెంట్‌ పేరుతో ప్రిన్సిపల్‌ వారం రోజులు బయట బాత్‌రూంల వద్ద, పాదరక్షలు విడిచేచోట నిలబెడుతున్నారు. దుర్వాసన వస్తున్నప్పటికీ అక్కడే భోజనం చేయిస్తున్నారు.

ఆర్‌సీవో కళాశాలను సందర్శించినప్పుడు మా సమస్యలను చెప్పనీయకుండా గదులకు తాళం వేస్తున్నారు. ఇష్టానుసారంగా దూషిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే టీసీల్లో సరైన ప్రవర్తన లేదని రాస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ బెదిరిస్తున్నారు’ అంటూ విద్యార్థినులు విలపిస్తూ చెప్పారు. ప్రిన్సిపల్‌ దివ్యరాణిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో అధికారులు గిరిజన డిగ్రీ గురుకులాల సహాయ కార్యదర్శి సోమనాథ్‌శర్మను ఫోన్‌లో సంప్రదించి.. విద్యార్థినులతో మాట్లాడించారు. అనంతరం వారంతా లిఖితపూర్వక ఫిర్యాదును ఆర్డీవోకు అందించారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ధర్నా విరమించారు. తర్వాత అధికారులు వారిని ప్రత్యేక బస్సుల్లో కళాశాలకు పంపించారు. కొద్దిసేపటికే ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేస్తూ గురుకులాల కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాయంత్రం గిరిజన డిగ్రీ గురుకులాల సహాయ కార్యదర్శి సోమనాథ్‌శర్మ, ఆర్‌సీవో గంగాధర్‌, గిరిజన సంక్షేమశాఖ జిల్లా డీడీ రమాదేవి కళాశాలకు వెళ్లి విచారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని