మహిళలకు ‘మహా’వరం

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది.

Updated : 09 Dec 2023 06:47 IST

శనివారం మధ్యాహ్నం 1.30 తర్వాత రాష్ట్రమంతా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు కూడా.. 
పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో అనుమతి
హైదరాబాద్‌ సహా ఇతర నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలోనూ వర్తింపు
తెలంగాణ చిరునామాతో ఉండే ఆధార్‌, ఓటరు కార్డు  డ్రైవింగ్‌ లైసెన్సులాంటి గుర్తింపు కార్డు చూపిస్తే చాలు
ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకానికీ నేడు సీఎం రేవంత్‌ శ్రీకారం

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. గురువారం ప్రమాణ స్వీకారం అనంతరం వాటికి సంబంధించి తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. శనివారం నుంచి అందులో రెండు పథకాలను అమల్లోకి తీసుకురానున్నారు. రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే మరో పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయ్యాక అసెంబ్లీ ప్రాంగణంలో మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం రేవంత్‌ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన అనంతరం రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ‘మహాలక్ష్మి’ స్మార్ట్‌కార్డ్‌ను తెచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం రాష్ట్రం మహిళలతో పాటు బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు కూడా వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు. శుక్రవారం ఆయన ఇక్కడ బస్‌భవన్‌లో విలేకరుల సమావేశంలో ఈ పథకం అమలు గురించి వివరించారు. ‘‘పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌ సహా ఇతర నగరాల్లో నడిచే సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అంతర్‌ రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. రాష్ట్రంలోని 7,292 సర్వీసుల్లో ప్రభుత్వం ఈ సేవలను అందిస్తుంది. రోజూ సుమారు 40 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారు. వారిలో దాదాపు 30 శాతం మంది మహిళలు. వారి సంఖ్య 12 లక్షల నుంచి 14 లక్షల దాకా ఉంటోంది. తాజాగా అమల్లోకి రానున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంతో లబ్ధిపొందే మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లను కలుపుకొంటే ఆ సంఖ్య 55 శాతానికి పెరుగుతుందని అంచనా. రోజు వారీగా ఆర్టీసీకి రూ.14 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఈ పథకం అమలుతో సుమారు సగం ఆదాయం తగ్గుతుంది. ఏడాదికి రూ.3 వేల కోట్ల వరకు ఆర్టీసీపై భారం పడుతుంది. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది’’ అని సజ్జనార్‌ వివరించారు.     లీజుకు ఇచ్చిన ఆర్టీసీ ఆస్తులకు సంబంధించి రావాల్సిన ఆదాయం విషయంలో ఇబ్బందుల్లేవని సజ్జనార్‌ తెలిపారు. ఆర్మూర్‌ ఆస్తి విషయంలో పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయని చెప్పారు. ‘కరోనా సమయం నుంచి ఉన్నాయి. తాజాగా కొంత మొత్తాన్ని చెల్లించారు. మిగిలిన ఆస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు’ అని వివరించారు.


జీరో టికెట్‌ జారీ

‘‘మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో ప్రయాణించే వారికి జీరో టికెట్‌ జారీ చేస్తాం. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఏయే మార్గాల్లో, ఏయే సమయాల్లో రద్దీ ఉంటుందనే విషయమై కొద్ది రోజుల తర్వాత అధ్యయనం చేస్తాం. అందుకు తగినట్లు సర్వీసులను, బస్సుల సంఖ్యను పెంచుతాం. ఈ పథకం కింద ప్రయాణించాలనుకునే వారు రాష్ట్రంలో నివసిస్తున్నట్టుగా చిరునామాను పేర్కొంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే వివిధ గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. ఆధార్‌, ఓటరు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు ఇలా ఏదో ఒకటి చూపించాలి. ప్రభుత్వం తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయం అమలుకు సిబ్బందిని కూడా సమాయత్తం చేస్తున్నాం. శుక్రవారం రెండు షిఫ్టులలో సుమారు 40 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లకు ఈ పథకంపై జూమ్‌ ద్వారా అవగాహన కల్పించాం. ప్రయాణికులతో సౌమ్యంగా, మర్యాదగా వ్యవహరించాలని సూచించాం. రద్దీ స్టేషన్లలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తాం. ఇటీవల కొత్తగా 776 బస్సులు వచ్చాయి. మరో 1,050 రానున్నాయి. అద్దె ప్రాతిపదికన మరో వెయ్యి విద్యుత్తు బస్సులు కూడా వస్తాయి. బస్సులకు ఇబ్బంది లేదు. గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్తు బస్సులను కూడా నడపనున్నాం’’.

 సజ్జనార్‌, ఆర్టీసీ ఎండీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని