TSPSC: గ్రూప్‌-2 షెడ్యూలు ప్రకారం జరిగేనా..!

రాష్ట్రంలో గ్రూప్‌-2 రాతపరీక్ష షెడ్యూలు ప్రకారం జరుగుతుందా? లేదా మరోసారి వాయిదా పడుతుందా? ఈ విషయమై నిరుద్యోగుల్లో సందిగ్ధం నెలకొంది.

Updated : 10 Dec 2023 07:07 IST

త్వరలో సమీక్ష నిర్వహించనున్న ప్రభుత్వం
వచ్చే వారంలో స్పష్టత వచ్చే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌-2 రాతపరీక్ష షెడ్యూలు ప్రకారం జరుగుతుందా? లేదా మరోసారి వాయిదా పడుతుందా? ఈ విషయమై నిరుద్యోగుల్లో సందిగ్ధం నెలకొంది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసిన 5.51 లక్షల మంది కమిషన్‌ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన గ్రూప్‌-2 పరీక్షను 2024-జనవరిలో నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ కార్యాచరణ మొదలుపెట్టింది. గ్రూప్‌-2లో 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించగా రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 29, 30న గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్‌ షెడ్యూలు జారీ చేసింది. వరుసగా గ్రూప్‌-1, 4 పరీక్షలు, గురుకుల నియామక పరీక్షలతో పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు సమయం లేనందున గ్రూప్‌-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పరీక్షలను నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూలు చేసింది. అయితే నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్‌ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూలు చేసింది. ప్రస్తుతం కమిషన్‌ గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించేందుకు పరిపాలన పరమైన ఏర్పాట్లు చేస్తోంది. పరీక్ష కేంద్రాలు గుర్తించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసింది. గ్రూప్‌-1, గ్రూప్‌-2తో పాటు ఇతర నియామక పరీక్షల తాజా పరిస్థితిపై ఇప్పటికే వివరాలు తీసుకున్న ప్రభుత్వం త్వరలో సమీక్ష నిర్వహించనుంది. ఈ సమీక్షలో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని