TSRTC: పురుషులకు ప్రత్యేక బస్సులు?

మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగింది. కొన్ని బస్సుల్లో అయితే వెనుక వరుస సీట్ల వరకు వారే కనిపిస్తున్నారు.

Updated : 27 Dec 2023 06:55 IST

అవసరమైనచోట విద్యార్థులకు సైతం
వృద్ధులకు ప్రత్యేక సీట్లపై ఆర్టీసీ యోచన

ఈనాడు, హైదరాబాద్‌: మహిళలకు (woman) ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో (TSRTC) రద్దీ గణనీయంగా పెరిగింది. కొన్ని బస్సుల్లో అయితే వెనుక వరుస సీట్ల వరకు వారే కనిపిస్తున్నారు. దీంతో సీటు దొరకలేదని పురుషులు దిగి వెళ్లిపోతున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్‌ మీటింగ్‌లో కండక్టర్లు ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఆర్టీసీ యోచిస్తోంది. వృద్ధుల(పురుషులు)కు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపుపైనా కసరత్తు జరుగుతోంది. మరోవైపు విద్యార్థులకు సైతం కొన్ని మార్గాల్లో సర్వీసులు నడిపే విషయాన్ని ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక సీట్లలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిసింది.

20 శాతం పెరిగిన ఓఆర్‌..

ఆర్టీసీ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తిని తెలిపే ఓఆర్‌ (ఆక్యుపెన్సీ రేషియో) గతంలో 69 శాతం ఉండేది. గతంలో నిత్యం మహిళా ప్రయాణికులు 12-14 లక్షలు ఉండగా ఇప్పుడు 29 లక్షలు దాటుతున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. దాంతో ఓఆర్‌ దాదాపు 89 శాతం నమోదవుతోంది. ఉన్న బస్సులతోనే అంత రద్దీని తట్టుకోవడం ఆర్టీసీకి సవాలుగా మారుతోంది. పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లే ఆఖరి బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో పరిస్థితుల్ని డ్రైవర్‌, కండక్టర్లు దాదాపు 20 మందికిపైగా ఆర్టీసీ ఎండీకి వివరించారు. సమస్య పరిష్కారానికి సూచనలూ ఇచ్చారు. నిల్చొనేందుకూ స్థలం లేక బస్సు ఎక్కలేక విద్యార్థులు అక్కడే ఆగిపోయి ఇబ్బందిపడ్డ ఘటనలూ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చాయి. ఆయా అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. డిపో మేనేజర్లు కూడా క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించారు.

భద్రాచలం-ఖమ్మం ఎక్స్‌ప్రెస్‌లో మహిళా ప్రయాణికులు ఎక్కువగా ఉంటున్నారు. బస్‌ కండక్టర్‌ కవిత ఎడమ వరుస(ఇద్దరు కూర్చునే సీట్లు) పురుష ప్రయాణికులకు వదలండి.. కుడి వరుస(ముగ్గురు కూర్చునే సీట్లు)లో మహిళలు కూర్చోండి అంటూ వారిని కోరుతున్నారు. ‘మహిళా ప్రయాణికులు అర్థం చేసుకుని ఒక వరుసకే పరిమితం అవుతున్నారు. సీట్లు దొరకని వాళ్లు నిల్చుంటున్నారు’ అని కండక్టర్‌ కవిత ‘ఈనాడు’తో పేర్కొన్నారు.

పురుషులు, విద్యార్థులు లేదా మహిళలకు ప్రత్యేకం

సమయాల వారీగా రద్దీపై సమగ్ర సమాచారం వచ్చాక పురుషులకు, విద్యార్థులకు ప్రత్యేక బస్సులు నడపడంపై ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్నారు. ఇవి సాధ్యం కాదంటే మహిళలకు మాత్రమే ప్రత్యేక బస్సులు నడపడం.. ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయని ఆర్టీసీ వర్గాల సమాచారం. ‘జీరో టికెట్‌’ అని మహిళా ప్రయాణికుల్ని చిన్నచూపు చూడం. వారి తరఫున ప్రభుత్వం ఆ ఛార్జీ చెల్లిస్తోంది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పలురకాల ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాం’అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు