Singareni Elections: సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో (Singareni Elections) ఏఐటీయూసీ విజయం సాధించింది. ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీపై 1,999 ఓట్ల ఆధిక్యంతో ఏఐటీయూసీ గెలుపొందింది.

Updated : 28 Dec 2023 09:52 IST

అయిదు ఏరియాల్లో ఏఐటీయూసీ, ఆరుచోట్ల ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపు

కొత్తగూడెం సింగరేణి, గోదావరిఖని, శ్రీరాంపూర్ న్యూస్‌టుడే: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో (Singareni Elections) ఏఐటీయూసీ విజయం సాధించింది. ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీపై 1,999 ఓట్ల ఆధిక్యంతో ఏఐటీయూసీ గెలుపొందింది. మరోవైపు, సంస్థలో మొత్తం 11 ఏరియాలు ఉండగా.. 5 చోట్ల ఏఐటీయూసీ, 6 చోట్ల ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి. బెల్లంపల్లి రీజియన్‌ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం రీజియన్‌లోని రామగుండం-1, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ, రామగుండం-3లో ఐఎన్‌టీయూసీ విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్‌ కార్యాలయంలో, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాల్లో ఐఎన్‌టీయూసీ గెలుపొందాయి.

ఆరు జిల్లాల్లోని 11 ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘాలు, గుర్తింపు సంఘం ఎన్నికకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 39,773 ఓట్లకు గాను 37,468 ఓట్లు పోలయ్యాయి. 94.20 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా ఇల్లెందు ఏరియాలో 98.37 శాతం, అతి తక్కువగా శ్రీరాంపూర్‌, రామగుండం-3 ఏరియాల్లో 93 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల బందోబస్తుకు సింగరేణివ్యాప్తంగా 450 మంది పోలీసులను నియమించారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగియగానే బ్యాలెట్‌ పెట్టెలను లెక్కింపు కేంద్రాలకు తరలించారు. రాత్రి 7 గంటల నుంచి డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. సింగరేణి ఎన్నికల ప్రధానాధికారి శ్రీనివాసులు పోలింగ్‌ నిర్వహణను పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని