TSRTC: కార్మికులకు ఆర్టీసీ బకాయిలు రూ.5 వేల కోట్లపైనే!

దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం వేలమంది ఆర్టీసీ కార్మికులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంలో కార్మికుల విలీనం ప్రక్రియ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యలోనే నిలిచిపోయింది.

Updated : 31 Jan 2024 09:32 IST

2013 నాటి వేతన సవరణ బకాయిలు బాండ్ల రూపంలోనే..
నేడు ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం వేలమంది ఆర్టీసీ కార్మికులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంలో కార్మికుల విలీనం ప్రక్రియ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యలోనే నిలిచిపోయింది. మరోవైపు పొదుపు చేసుకున్న సీసీఎస్‌ డబ్బులు రాక, నగదుగా మారని పదకొండేళ్ల కిందటి వేతన ఒప్పందం బాండ్లు.., డీఏ బకాయిలు అందక ఆర్థికంగా సతమతమవుతున్నారు. దాదాపు రూ.5,365 కోట్లకుపైగా బకాయిలు రావాల్సి ఉందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీ పరిస్థితిపై సమీక్షించనున్నారు. ఈ భేటీలో తమ కీలక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆర్టీసీ కార్మికులు ఎదురుచూస్తున్నారు.

పదకొండేళ్ల నుంచి వాయిదాలే

ఆర్టీసీ కార్మికులకు చివరగా 2013కు సంబంధించిన వేతన సవరణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగింది. సవరణ బకాయిల్ని ఆర్టీసీ బాండ్ల రూపంలో ఇచ్చింది. ఇప్పటికీ ఆ బాండ్లను నగదు రూపంలోకి మార్చలేదు. 2014 నుంచి లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ చెల్లించలేదు. ఆర్టీసీలో ప్రతి నాలుగేళ్లకోసారి వేతన ఒప్పందం జరిగేలా యాజమాన్యం గతంలో కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకుంది. ఆ మేరకు 2017, 2021లలో పీఆర్సీలు అమలు చేయాల్సి ఉందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

6784 రుణ దరఖాస్తుల పెండింగ్‌

ఆర్టీసీలో ఉద్యోగులు, కార్మికులు కలిసి ఉద్యోగుల పొదుపు, పరపతి సహకార సంఘా(ఎంప్లాయీస్‌ థ్రిప్ట్‌, క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ)న్ని ఏర్పాటుచేసుకున్నారు. పొదుపు చేసిన సొమ్మును ఆర్థిక ఇబ్బందులతో సంస్థ వాడుకోవడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. నిధుల్లేక 6,784దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. 3656 మంది సభ్యత్వాన్నే రద్దు చేసుకున్నారు. సీఎం రేవంత్‌తో బుధవారం జరిగే సమావేశంలో కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిల్లో కొన్నింటిపైనా, ఖాళీగా ఉన్న 3 వేల పోస్టుల భర్తీపైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు