ఓటాన్‌ అకౌంట్‌... వరాలు కురిపించేనా?

పార్లమెంటులో గురువారం కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో తెలంగాణకు నిధుల కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది.

Updated : 01 Feb 2024 10:00 IST

నేడు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌
రాష్ట్రానికి నిధుల కేటాయింపులపై ప్రభుత్వం ఆశలు

ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంటులో గురువారం కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో తెలంగాణకు నిధుల కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఓటర్లకు వరాలు కురిపిస్తుందని, వాటిలో తెలంగాణకు సైతం ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులు కొంతమేర ఉండవచ్చని రాష్ట్రం అంచనా వేస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరవాత సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై వినతిపత్రం అందజేశారు. వీటిలో కొన్నింటికి గత బడ్జెట్‌లో కేంద్రం నిధులేమీ కేటాయించనందున కొత్త బడ్జెట్‌లోనైనా చోటు దక్కుతుందా అని రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందున రూ.2,233 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం గతంలో సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

పారిశ్రామిక కారిడార్లపై...

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వరకు నూతన పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని, అలాగే హైదరాబాద్‌ - నాగ్‌పుర్‌ పారిశ్రామిక కారిడార్‌కు తుది అనుమతులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. వీటికి బడ్జెట్‌లో నిధులు కేటాయించవచ్చని అధికార వర్గాల అంచనా.

కొత్త మెట్రో ప్రాజెక్టు చేపట్టడానికి...

కొత్తగా 70 కిలోమీటర్ల దూరం మెట్రోరైలు ప్రాజెక్టు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీనికి కేంద్రాన్ని నిధులు అడుగుతోంది. రాష్ట్రానికి చాలాకాలంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పథకం కింద నిధులు రావడం లేదు. దాదాపు రూ.1,800 కోట్లు గ్రాంటుగా రావాల్సి ఉన్నందున ఈ బడ్జెట్‌లో కేటాయిస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. 

విభజన చట్టం హామీలపై...

విభజన చట్టంలో తెలిపిన గిరిజన యూనివర్సిటీ, ఉద్యాన వర్సిటీలకు నిధులు రావాల్సి ఉంది. ఇదే చట్టం కింద తెలంగాణకు 4 వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత్కేంద్రం నిర్మించాల్సి ఉంది. ఇందులో 1,600 మెగావాట్ల కేంద్రమే ఇప్పటికి నిర్మించారు. మిగిలిన 2,400 మెగావాట్ల కేంద్రాన్ని కూడా నిర్మించాలని కొత్త ప్రభుత్వం కోరుతున్నందున బడ్జెట్‌లో దీని ప్రస్తావన ఉండొచ్చని అంచనా.

‘పాలమూరు’కు నిధులొచ్చేనా..?

పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కానీ ఈ విధానం ఇప్పుడు లేదంటున్న కేంద్రం మరో పథకంలోనైనా నిధులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నందున ఏమేం ఉంటాయనేది వేచి చూడాల్సిందేనని రాష్ట్ర ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది(2023-24) కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.41,259 కోట్లు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం తొలుత అంచనా వేసినా గత డిసెంబరు ఆఖరునాటికి 9 నెలల్లో కేవలం 12 శాతాన్నే కేంద్రం విడుదల చేసింది. మార్చి నాటికి మిగిలిన 88 శాతం నిధులు వచ్చేది అనుమానమేనని అధికారులు చెపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని