Hyderabad: పురుషులకు ప్రత్యేక బస్సు మూడురోజుల ముచ్చటే

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తర్వాత పురుషులకు సీట్లు దొరకడం కష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో మహిళలు, పురుషులకు ప్రత్యేక బస్సులపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆలోచన చేశారు.

Updated : 02 Feb 2024 07:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తర్వాత పురుషులకు సీట్లు దొరకడం కష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో మహిళలు, పురుషులకు ప్రత్యేక బస్సులపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆలోచన చేశారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం బస్‌డిపో ఇబ్రహీంపట్నం-ఎల్బీనగర్‌ మధ్య 277 ఎల్‌ ‘పురుషులకు ప్రత్యేకం’ బస్సును ప్రవేశపెట్టింది. సోమవారం నుంచి బుధవారం వరకు మూడంటే మూడే రోజులు నడిపించారు. గురువారం నుంచి దీన్ని రద్దు చేసినట్లు డిపో మేనేజర్‌ ‘ఈనాడు’కు తెలిపారు. ఈ రూట్‌లో ప్రతి రెండు నిమిషాలకు ఓ బస్సుందని, ప్రత్యేక బస్సు వచ్చేంతవరకు నిరీక్షించకుండా పురుషులు ఏదో ఒక బస్సెక్కి వెళ్తుండడం, ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులు ఇబ్రహీంపట్నం దాటి వెళ్లాల్సి ఉండటం.. మధ్యలో బస్సు మారాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక సర్వీసును రద్దు చేసినట్లు తెలిపారు. ‘పురుషులకు మాత్రమే’ బస్సు ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు

బస్సుల్లో తీవ్ర రద్దీ ఉండటం, పురుషులు ప్రయాణించలేని పరిస్థితులు, విద్యార్థులు ఫుట్‌బోర్డుపై వెళ్లాల్సి వస్తోందంటూ ఆర్టీసీ యాజమాన్యానికి ‘ఎక్స్‌’, సామాజిక మాధ్యమాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై బస్‌భవన్‌లోని ఉన్నతాధికారులు దృష్టిసారించారు. హైదరాబాద్‌తోపాటు దూరప్రాంత సర్వీసులు, పల్లెవెలుగుల్లోనూ మహిళలు, పురుషులకు ప్రత్యేక బస్సుల ప్రవేశపెట్టే ప్రణాళికలు ఉన్నాయని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’తో చెప్పారు. ప్రస్తుతం రద్దీకి తగ్గట్లు బస్సుల కొరత ఉందని.. కొత్తవి వచ్చాక ప్రత్యేక సర్వీసులు ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని పేర్కొన్నారు.


జనవరిలో 13.96 కోట్ల మంది ప్రయాణం
మహాలక్ష్మితో 23 శాతం పెరిగిన ఆర్టీసీ ఓఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ‘మహాలక్ష్మి’ పథకంతో ఆర్టీసీ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి(ఓఆర్‌) భారీగా పెరుగుతోంది. జనవరిలో 89.25 శాతం ఓఆర్‌ నమోదైంది. గతేడాది ఇదే నెలలో 66.36 శాతం. అంటే దాదాపు 23శాతం ఓఆర్‌ పెరిగింది. జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో మొత్తం 13.96 కోట్ల మంది ప్రయాణించారు. 2023 జనవరిలో ఆ సంఖ్య 8.13 కోట్లు మాత్రమే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని