TSPSC: ఉద్యోగ పరీక్షల ఫలితాల విడుదలకు కసరత్తు

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు త్వరలో 1:2 నిష్పత్తిలో ఎంపిక జాబితాలను ప్రకటించనుంది.

Updated : 04 Feb 2024 09:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు త్వరలో 1:2 నిష్పత్తిలో ఎంపిక జాబితాలను ప్రకటించనుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై ప్రభుత్వం పరిపాలనాపరమైన విధాన నిర్ణయం తీసుకోనుంది. వీటి అమలుకు ఇప్పటికే సాధారణ పరిపాలనశాఖ, టీఎస్‌పీఎస్సీ, మహిళా సంక్షేమశాఖలు సంయుక్తంగా ముసాయిదా విధానాన్ని సిద్ధంచేశాయి. అత్యంత కీలకమైన ఈ రిజర్వేషన్ల విధానం అమలు కోసం దస్త్రాన్ని సీఎం రేవంత్‌కు పంపించాయి. ఆదివారం మంత్రిమండలి సమావేశంలో చర్చించాక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

ఈ నెలలోనే ఫలితాలివ్వాలి...: మరోవైపు ఇప్పటికే పరీక్షలు నిర్వహించిన నియామక సంస్థలు ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఉత్తర్వులు వచ్చిన వారం నుంచి పది రోజుల్లోనే విడుదల చేయాలని స్పష్టంచేసింది. నియామక సంస్థలు నోటిఫికేషన్ల వారీగా లక్ష్యాలు సిద్ధం చేసుకోవాలని, న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా ఫలితాలు ప్రకటించాలని కోరింది. టీఎస్‌పీఎస్సీ పరిధిలో యుద్ధప్రాతిపదికన ఏఈఈ, ఏఈ, గ్రూప్‌-4 ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్‌ కసరత్తు చేస్తోంది. గురుకుల నియామక సంస్థ పరిధిలో వారం రోజుల్లో కనీసం టీజీటీ, పీజీటీ లేదా డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్ల ఫలితాలు వెల్లడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తికావడంతో ఫలితాలు వెల్లడించేందుకు తాజా రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తున్నాయి.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి: మహిళలకు సమాంతర రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు నిబంధనలు చేర్చినట్లు తెలిసింది. మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్లు తగ్గకుండా కొత్త విధానం అమలు కానుంది. మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమల్లో వారికి న్యాయమైన వాటా దక్కేలా నిబంధనలు రూపొందించినట్లు సమాచారం. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు వీటి అమలు ప్రస్తుత తేదీ నుంచి కాకుండా గత తేదీ నుంచి ఇవ్వనుంది. తద్వారా నియామకాల్లో న్యాయవివాదాలకు పరిష్కారం చూపించినట్లు అవుతుందని భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు