4 ఏళ్లనుకుంటే 20 ఏళ్లయ్యింది..!

రెండు దశాబ్దాలుగా నిర్మాణంలోనే ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) పనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. దెబ్బతిన్న టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం), నీటిని తీసుకునే వైపు భారీగా సీపేజీ లాంటి సమస్యలతో ఏడాదిగా పనులు ఆగిపోయాయి.

Updated : 22 Feb 2024 07:08 IST

ఇంకా కొలిక్కిరాని ఎస్‌ఎల్‌బీసీ
పని పూర్తికి మరో రూ.2,200 కోట్లు అవసరం
దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం
ఈనాడు - హైదరాబాద్‌

రెండు దశాబ్దాలుగా నిర్మాణంలోనే ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) పనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. దెబ్బతిన్న టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం), నీటిని తీసుకునే వైపు భారీగా సీపేజీ లాంటి సమస్యలతో ఏడాదిగా పనులు ఆగిపోయాయి. ఇంకా రూ.2,000 కోట్లకు పైగా నిధులు వెచ్చించాల్సి ఉంది. ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇస్తామంటున్న ప్రస్తుత ప్రభుత్వం గురువారం దీనిపై సమీక్షించనుంది. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అధికారులు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు.

ఎన్నో ఏళ్లనాటి ప్రతిపాదన

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సొరంగ మార్గం ద్వారా నీటిని మళ్లించి మూడు లక్షల ఎకరాలకు అందించేందుకు ఎడమ గట్టు కాలువ పనిని ఉమ్మడి రాష్ట్రంలోని అప్పటి ప్రభుత్వం జలయజ్ఞం పథకం కింద చేపట్టింది. అంతకుముందు చాలా ఏళ్ల నుంచే ఈ ప్రతిపాదన ఉన్నా.. అభయారణ్యం కావడంతో సొరంగ మార్గం తవ్వడానికి అనుమతి లభించలేదు. దీంతో ఆనాటి ప్రభుత్వాలు నాగార్జునసాగర్‌ నుంచి నీటిని మళ్లించేలా ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించాయి. కానీ ఎత్తిపోతల ద్వారా కాకుండా గ్రావిటీతో శ్రీశైలం నుంచి నీటిని మళ్లించేందుకు సొరంగం తవ్వేలా ఎస్‌ఎల్‌బీసీ పనిని 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టింది. రూ.1,925 కోట్లకు జయప్రకాశ్‌ అసోసియేట్స్‌ సంస్థ ఈ కాంట్రాక్టు పొందింది. నాలుగేళ్లలో పూర్తి చేయాలనుకుంటే.. దాదాపు 20 ఏళ్లవుతున్నా ఇంకా కొలిక్కి రాలేదు. శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే వైపు (ఇన్‌లెట్‌) నుంచి 13.9 కి.మీ. మేర సొరంగం తవ్వకం పూర్తి కాగా.. నీళ్లు బయటకు వచ్చే వైపు (ఔట్‌లెట్‌) నుంచి 20.4 కి.మీ. దూరం తవ్వారు.మధ్యలో ఇంకా 9.6 కి.మీ. తవ్వాల్సి ఉంది. నిర్మాణ వ్యయం తాజాగా రూ.4,600 కోట్లకు పెరిగింది. ఇప్పటివరకు రూ.2,700 కోట్లు ఖర్చు చేయగా, సొరంగమార్గంతో పాటు అనుబంధ పనుల పూర్తికి ఇంకా రూ.2,200 కోట్లు అవసరమని సంబంధిత వర్గాలు తెలిపాయి. గుత్తేదారుకు రూ.50 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండగా, విద్యుత్తు బిల్లు రూ.59 కోట్లు చెల్లించాల్సి ఉంది.

సాంకేతిక సమస్యలే శాపాలు

ఔట్‌లెట్‌వైపు నాలుగేళ్ల కిందట బోరింగ్‌ మిషన్‌ దెబ్బతినడంతో దాన్ని మార్చడానికి మూడేళ్లకు పైగా పట్టింది. కొత్తది అమర్చి ఒకటిన్నర కి.మీ. మేర సొరంగం తొలిచిన తర్వాత మళ్లీ చెడిపోయింది. దాని కోసం మళ్లీ ఆర్డర్‌ ఇచ్చినా.. ఇప్పటివరకు రాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే వైపు 2019 నుంచి భారీగా నీటి ఊట (సీపేజీ) వస్తోంది. దీంతోపాటు మట్టి, రాళ్లు పడుతుండటంతో పని ముందుకు సాగడం లేదు. నీటిని తోడి, మట్టిని తొలగించి మళ్లీ పని ప్రారంభించినా సమస్యలు వెంటాడుతున్నాయి. మధ్యలో కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. దీంతో గత ప్రభుత్వం నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తూ.. దాని బిల్లును కాంట్రాక్టర్‌కు చెల్లించే మొత్తం నుంచి ముందుగానే రికవరీ చేసి విద్యుత్తు సంస్థకు చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. భారీ సీపేజీ కారణంగా టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ మూడేళ్లుగా నీళ్లలోనే ఉండిపోయింది. నీటిని తొలగించాక.. మిషన్‌ పరికరాలన్నీ వేరు చేసి ఆరబెట్టి మళ్లీ పని చేయించడానికి ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నీటి ఒత్తిడిని తగ్గించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని