వారం రోజుల్లో రూ.500కే సిలిండర్‌

ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ను వారం రోజుల్లో అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

Updated : 22 Feb 2024 07:03 IST

తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు
వచ్చేనెల 15 నాటికి  రైతు భరోసా డబ్బుల జమ
మోదీ, కేసీఆర్‌లతో  తెలంగాణకు తీరని అన్యాయం
కోస్గి సభలో సీఎం రేవంత్‌రెడ్డి
రూ.4,369 కోట్ల అభివృద్ధి  పనులకు శంకుస్థాపన
కోస్గి, కొడంగల్‌ - న్యూస్‌టుడే

న్నికల్లో హామీ ఇచ్చినట్లు రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ను వారం రోజుల్లో అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వచ్చేనెల 15 నాటికి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తమదేనని పేర్కొన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలో నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం సహా రూ.4,369 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలసి సీఎం శంకుస్థాపన చేశారు. 3,083 మహిళా సంఘాలకు రూ.177 కోట్ల విలువైన చెక్కును అందజేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటివరకు రెండు పథకాలు అమలు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో 18 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు.వారంతా పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు. వేలమంది సమ్మక్క-సారక్కలను దర్శించుకుంటున్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం.

కేసీఆర్‌ సీఎం అయ్యాకే ఎక్కువ నీటి దోపిడీ

ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కన్నా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మోదీ, కేసీఆర్‌ల పాలనలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగింది. ఆనాడు జరిగిన నీటి దోపిడీ కన్నా కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక జరిగిందే ఎక్కువ. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు చేపట్టారు. భీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్‌, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీ, దేవాదుల, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులను డబ్బులు దండుకొని అసంపూర్తిగా వదిలేశారు. రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసినా పూర్తి కాలేదు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పేరుతో రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకూ నీరు పారలేదు. కరీంనగర్‌లో ఓడిపోతానన్న భయంతో పాలమూరుకు వలస వచ్చారు. ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఆయన ఏం చేశారు? ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రోజుకు 12 టీఎంసీల నీరు తరలించుకుపోతున్నా చూస్తూండిపోయారు. పాలమూరులో ఎందుకు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు? ఈ ప్రాంతాన్ని ఎడారి చేసి.. వలసలను నిరోధించని కేసీఆర్‌ ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాకే లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లడగాలి. కాంగ్రెస్‌ నాయకుడు చిన్నారెడ్డి ప్రారంభించిన తెలంగాణ ఉద్యమాన్ని ఆయన తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రజలు ఎన్నికల్లో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా.. అల్లుడు నల్గొండ నుంచి, కుమారుడు పాలమూరు నుంచి పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు.

ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం

ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. మహిళా సంఘాలకు పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాల విద్యార్థులకు సంబంధించిన ఏకరూప దుస్తులు కుట్టే అవకాశం కల్పిస్తాం. కుట్టుమిషన్లు అందిస్తాం. ఐకేపీ ద్వారా రుణాలు అందించి సంఘాలను బలోపేతం చేస్తాం. త్వరలోనే పంటలు కొనుగోలు చేస్తాం.

మళ్లీ రూ.5వేల కోట్లు తీసుకొస్తా..

మంత్రులను ఒప్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను. కొడంగల్‌కు ఎవరూ ఊహించని విధంగా సుమారు రూ.5 వేల కోట్లు తెచ్చాను. వీటితో నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం, మెడికల్‌, ఇంజినీరింగ్‌, ప్రభుత్వ జూనియర్‌, మహిళా డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాలలకు శిలాఫలకాలు వేశాం. మళ్లీ వచ్చేటప్పుడు మరో రూ.5 వేల కోట్లు తీసుకొస్తాను. 2014లోనే నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల కోసం 69 జీవో తెచ్చాను. 7.10 టీఎంసీలతో లక్ష ఎకరాలకు సాగునీరు అందేలా మంజూరు చేయించాను. అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి అడిగి పునాది వేశారు. ఈ పథకాన్ని పదేళ్లు పక్కనపెట్టారు. భాజపా, భారాసలు చీకటి ఒప్పందం కుదుర్చుకొని ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాయి. ప్రధాని మోదీ మహబూబ్‌నగర్‌ పర్యటనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పిస్తానని హామీ ఇచ్చినా, నేటికీ అమలు కాలేదు. కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నా.. కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి అయిదేళ్లు పనిచేసినా, నలుగురు ఎంపీలున్నా తెలంగాణకు ఎలాంటి నిధులు మంజూరు చేయించుకోలేదు. కృష్ణా-వికారాబాద్‌ రైల్వే లైను, జాతీయ రహదారులు, మూసీ ప్రక్షాళనను పట్టించుకోలేదు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుంది’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డిని ప్రకటించారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

కొడంగల్‌ ఎత్తిపోతల ఆయకట్టు పెంపు

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల ద్వారా లక్ష నుంచి 1.30 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెంచామన్నారు. రాజీవ్‌ భీమా పథకం ద్వారా ఏడు టీఎంసీల మిగులు జలాలతో సాగు, తాగునీరు అందిస్తామన్నారు. ఆర్‌ అండ్‌ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కేవలం గజ్వేల్‌, సిరిసిల్ల, సిద్దిపేట మాత్రమే అభివృద్ధి చెందాయని.. మహబూబ్‌నగర్‌, నల్గొండ వంటి వెనుకబడిన జిల్లాలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్‌లో రింగు రోడ్డు ఏర్పాటు చేసి దేశానికి తలమానికంగా నిలుపుతామన్నారు. ఆబ్కారీశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పాలమూరు జిల్లాను రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సస్యశ్యామలం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, పర్నికారెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, వంశీకృష్ణ, శంకర్‌, మందుల శామ్యూల్‌, కూచికుళ్ల రాజేశ్‌రెడ్డి, కాంగ్రెస్‌ కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తిరుపతిరెడ్డి, దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, నాయకులు సునీతా మహేందర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌లోకి తాండూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌

తాండూరు, తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న బుధవారం భారాసకు రాజీనామా చేసి కోస్గిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ స్వప్న, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆమె మెడలో కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కౌన్సిలర్‌ రామకృష్ణ కూడా భారాసకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని