RRR: మూడేళ్లలో ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తి: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

అవుటర్‌ రింగ్‌రోడ్డు అవతల నుంచి నిర్మించే ప్రాంతీయ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)ను మూడేళ్లలో పూర్తిచేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Updated : 22 Feb 2024 08:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: అవుటర్‌ రింగ్‌రోడ్డు అవతల నుంచి నిర్మించే ప్రాంతీయ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)ను మూడేళ్లలో పూర్తిచేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ రాష్ట్రానికి సూపర్‌ గేమ్‌ ఛేంజర్‌ అవుతుందన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. ‘‘ఆ రహదారి మంజూరై నాలుగేళ్లయినా గత ప్రభుత్వ అసమర్థత కారణంగా ముందుకు సాగలేదు. పనులు ప్రారంభించిన నాటినుంచి మూడేళ్లలో పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతాం. భూసేకరణ ముమ్మరంగా సాగుతోంది. ఈ ప్రక్రియను వేగంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దక్షిణ భాగానికి కూడా త్వరలో జాతీయ రహదారి నంబరు కేటాయించేందుకు కేంద్రం అంగీకరించింది. ఆ తర్వాత నుంచి ఆ మార్గంలోనూ భూసేకరణ చేపడతాం. ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఆ రహదారి చుట్టూ రింగ్‌రైలు ప్రాజెక్టుతోపాటు ఫార్మా, ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం.

భాజపా, భారాసల లోపాయికారీ ఒప్పందం..

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కనీసం 12 స్థానాలను గెలుస్తాం. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, భారాస లోపాయికారీ ఒప్పందం చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడటం సరికాదు. మహారాష్ట్రలో మాదిరిగా పార్టీని చీల్చి ప్రభుత్వాలను కూల్చడం పోరాటాల గడ్డ తెలంగాణలో సాధ్యం కాదు. భారాస అధికారంలో ఉన్నప్పుడు అన్నింటికీ కేటీఆర్‌ను ముందుపెట్టేవారు.. మేడిగడ్డ కూలిపోగానే హరీశ్‌రావును ముందుపెట్టారు’’ అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.

మెజారిటీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటాం: షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన చూసి పార్టీలో చేరడానికి చాలామంది ముందుకొస్తున్నారని తెలిపారు. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన ముగ్గురు భారాస కార్పొరేటర్లు, పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు బుధవారం గాంధీభవన్‌లో షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్సీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే అభివృద్ధి పనుల కోసం ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున ముఖ్యమంత్రి మంజూరు చేశారని చెప్పారు.

భాజపాను ఎన్నికల కమిషన్‌ కట్టడి చేయాలి: జి.నిరంజన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడకుండా, కాంగ్రెస్‌ పార్టీని దూషించకుండా భాజపాను కట్టడి చేయాలని ఎన్నికల కమిషన్‌కు పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో డీజీపీ కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో విజయ సంకల్ప యాత్ర చేపట్టిన భాజపా.. ప్రజల్లో విభేదాలు సృష్టించడం, కాంగ్రెస్‌ను దూషించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని