రూ.500 సిలిండర్‌కు.. మూడేళ్ల సగటు లెక్క!

అర్హులైనవారి గృహావసరాలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలుకు కసరత్తును ప్రభుత్వం ముమ్మరం చేసింది. రేషన్‌కార్డు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

Updated : 22 Feb 2024 06:51 IST

రేషన్‌, ఆధార్‌ తప్పనిసరి
గ్యాస్‌ సబ్సిడీ చెల్లింపుపై కసరత్తు

ఈనాడు, హైదరాబాద్‌: అర్హులైనవారి గృహావసరాలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలుకు కసరత్తును ప్రభుత్వం ముమ్మరం చేసింది. రేషన్‌కార్డు ఉన్న వారికే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా, అందులో రేషన్‌కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలు. ఈ కుటుంబాలు గత మూడేళ్లలో ఉపయోగించిన గ్యాస్‌ సిలిండర్ల సగటును పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. మరో వారం రోజుల్లో రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తామని సీఎం బుధవారం ప్రకటించిన నేపథ్యంలో... విధివిధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

44 శాతం మంది వాడేది నెలకు ఒక సిలిండర్‌

మొత్తం 1.20 కోట్ల కనెక్షన్లలో 44 శాతం మంది ప్రతి నెలా ఒక సిలిండర్‌ వాడుతున్నట్లు పౌరసరఫరాలశాఖ గుర్తించింది. రేషన్‌కార్డున్న వారికే వర్తింపచేస్తే.. ఈ శాతం మరింత తగ్గుతుంది. మూడేళ్ల సగటును పరిగణనలోకి తీసుకోవాలని కొద్దిరోజుల క్రితం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం చర్చించినట్లు సమాచారం. గరిష్ఠ పరిమితి ఏదీ లేదని తెలుస్తోంది. ఉదాహరణకు ఒక కుటుంబం గత మూడేళ్లలో ఏడాదికి సగటున ఎనిమిది సిలిండర్లు వాడితే ఆ కుటుంబానికి రూ.500 గ్యాస్‌ సిలిండర్‌లు ఏడాదికి ఎనిమిది ఇచ్చే అవకాశం ఉంది. ఏడాదికి సగటున అయిదు చొప్పునే వాడితే అయిదే ఇస్తారు. పథకం అమలు మొదలయ్యాక.. మూడేళ్ల సగటు కంటే ఎక్కువ సిలిండర్లు వాడినా.. అదనపు సిలిండర్లకు ప్రభుత్వం ఇచ్చే రాయితీ వర్తించదు.  వాటికి పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.955 కాగా కేంద్రం రూ.40 సబ్సిడీగా ఇస్తోంది. ఈ రాయితీ సొమ్ము సిలిండర్‌ తీసుకున్నాక.. బ్యాంకు ఖాతాల్లో పడుతోంది.

దిల్లీలో చమురుసంస్థలతో భేటీ...

పౌరసరఫరాలశాఖ ఉన్నతాధికారి ఒకరు రెండు రోజుల క్రితం దిల్లీ వెళ్లారు. హెచ్‌పీసీఎల్‌, ఐవోసీఎల్‌, బీపీసీఎల్‌ సంస్థలు గ్యాస్‌ సిలిండర్లను అందిస్తున్నాయి. సిలిండర్‌ ధర రూ.955 కాగా, రూ.500కు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వినియోగదారుడు ముందు పూర్తి మొత్తాన్ని చెల్లిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నగదు బదిలీ ద్వారా వినియోగదారుల ఖాతాలో వేయాలా? లేదంటే చమురు సంస్థలకే చెల్లించి అర్హులైనవారు రూ.500కే సిలిండర్‌ పొందేలా చూడాలా? అన్న విషయంపై పౌరసరఫరాలశాఖ కసరత్తు చేస్తోంది. దీనిపై ఆ శాఖ ఉన్నతాధికారి చమురు సంస్థలతో చర్చించినట్లు సమాచారం. ఈ పథకానికి ఆధార్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరిగి సిలిండర్‌ కనెక్షన్‌ పాస్‌బుక్‌, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డును పరిశీలించి.. ఆ వివరాలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని