కరెంటు కోతల పేరిట కుట్ర

రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగితే అందుకు బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠినచర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

Published : 23 Feb 2024 04:46 IST

కొరత లేకున్నా.. కొందరు సిబ్బందే ‘కట్‌’ చేస్తున్నారు
ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా దుష్ప్రచారం
అకారణంగా సరఫరా ఆపితే సస్పెండ్‌ చేస్తాం
అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగితే అందుకు బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠినచర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అలాంటి వారిని అవసరమైతే సస్పెండ్‌ చేస్తామన్నారు. విద్యుత్తు సరఫరాపై ఆయన గురువారం సచివాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, విద్యుత్తుపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీఎం పేర్కొన్నారు. భారాస హయాంలో నియమితులైన కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా కోతలు పెడుతున్నారనే సమాచారం తమకు ఉందని తెలిపారు. గతంతో పోల్చితే విద్యుత్తు సరఫరా పెంచినా.. కోతలు పెడుతున్నారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మీపైనే ఉందని అధికారులను అప్రమత్తం చేశారు. ప్రస్తుత అవసరాలకు సరిపడా కరెంటు సరఫరా చేస్తున్నామని, కోతలు విధించేలా ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని సీఎం స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలోని 3 సబ్‌స్టేషన్లలో కొంతసేపు సరఫరాకు అంతరాయం కలగడానికి కారణాలేమిటని సీఎం ప్రశ్నించగా.. లోడు హెచ్చుతగ్గులను డీఈలు సరిచూసుకోకపోవడంతో సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. అలా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సాంకేతిక, ప్రకృతిపరమైన కారణాలు మినహా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కోతలకు కారణమైతే ఉపేక్షించవద్దని ఆదేశించారు. మరమ్మతులు, సాంకేతిక సమస్యలతో సరఫరా నిలిపివేయాల్సి వస్తే ముందుగానే వినియోగదారులకు సమాచారమివ్వాలని సూచించారు. గత ఏడాదితో పోల్చితే గడచిన రెండు నెలల్లో సరఫరా పెంచినట్లు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ రిజ్వీ తెలిపారు. గత ఏడాది జనవరిలో 230.54 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు సరఫరా కాగా.. ఈసారి అదే నెలలో 243.12 మిలియన్‌ యూనిట్లు సరఫరా అయిందని తెలిపారు. నిరుడు ఫిబ్రవరిలో ఒకటో తేదీ నుంచి 13వ తేదీ వరకు 242.44 మిలియన్‌ యూనిట్లు సరఫరా చేస్తే.. ఈసారి అదే వ్యవధిలో 264.95 మిలియన్‌ యూనిట్లు ఇచ్చామని వివరించారు. ఈసారి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పీక్‌ సీజన్‌కు సరిపడేలా విద్యుత్తు సరఫరాకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు రిజ్వీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని